నా భర్త ఉద్యోగాన్ని టీడీపీ నాయకులు అమ్ముకున్నారు !

15 Nov, 2018 08:07 IST|Sakshi
సబ్‌స్టషన్‌ వద్ద ధర్నా నిర్వహిస్తున్న బాధితురాలు విజయలక్ష్మి, సీపీఎం నేత సాంబమూర్తి తదితరులు

నేను బతికేది ఎలా?

భర్త పోయిన ఓ మహిళ ఆవేదన

విజయనగరం :కొమరాడ(కరుపాం): గరుగుబిల్లి మండలం చిలకాం గ్రామానికి చెందిన ఏగిరెడ్డి సాయికృష్ణ కొమరాడ విద్యుత్‌ సబ్‌స్టేసన్‌లో షిఫ్ట్‌ ఆపేరేటర్‌గా పనిచేసేవారు. గత నెల 12న విధులు ముగించుకుని అత్తవారు ఊరైన కొమరాడ మండలం గంగారేగువలస వస్తుండగా కోటిపాం సమీపాన గెడ్డవద్ద సంభవించిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. దీంతో భార్య విజయలక్ష్మి విద్యుత్‌శా ఖ ఉన్నతాధికారులను ఆశ్రయించి భర్త ఉద్యోగం తనకు ఇచ్చి కుటుంబాన్ని ఆదుకోవాలని మొరపెట్టుకుంది. ఉద్యోగం ఆమెకే ఇస్తామని అధికారులు నమ్మబలికారు. ఇంతలో టీడీపీ నాయకులు ఒత్తిడి మేరకు ఆ ఉద్యోగాన్ని నర్సిపురానికి చెందిన ఓ వ్యక్తికి అమ్మేసుకున్నారని విజయలక్ష్మి విమర్శిస్తోంది. తాను ఎలా బతకాలంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలంటూ బుధవారం తన తల్లి సత్యవతితో కలసి సీపీఎం మండల కన్వీనర్‌ కొల్లి సాంబమూర్తి ఆధ్వర్యంలో కొమరాడ విద్యుత్‌ సబ్‌ష్టేసన్‌ వద్ద ధర్నాకు దిగింది.

బాధితురాలికి న్యాయం చేయాలి
సీపీఎం నేత సాంబమూర్తి మాట్లాడుతూ భర్తపోయిన విజయలక్ష్మికి అధికారులు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ నాయకులు శవం మీద కాసులకు కూడా కక్కుర్తిపడుతున్నారని విమర్శించారు. భర్త చనిపోయి పుట్టెడు దుఖఃలో ఉన్న విజయలక్ష్మిని ఓదార్చి ఉద్యోగం ఇచ్చి భరోసా కల్పించకుండా టీడీపీ నేతలు ఆమె ఉద్యోగాన్ని లక్షలకు అమ్ముకోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఇప్పటికైన స్పందించి మరణించిన సాయికృష్ణ ఉద్యోగాన్ని భార్య విజయలక్ష్మికి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేదంటే పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు