ప్రియుని సాయంతో భర్త హత్య

12 Feb, 2014 02:17 IST|Sakshi

 చినారుకట్ల వద్ద జరిగిన హత్య కేసు ఛేదన
 ఆరు రోజుల్లోనే పురోగతి
 నిందితులు కటకటాల పాలు
 
 
 మార్కాపురం, న్యూస్‌లైన్ :
 తనను వేధిస్తున్న భర్తను ప్రియుడి సాయంతో ఓ మహిళ మట్టుబెట్టినట్లు పోలీసు విచారణలో తేలింది. ఈ నెల 5న దోర్నాల పోలీస్ స్టేషన్ పరిధిలోని చినారుట్ల దగ్గరలోని నంది మలుపు వద్ద గుర్తుతెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. మార్కాపురం డీఎస్పీ జి.రామాంజనేయులు తన కార్యాలయంలో మంగళవారం నిందితులను ప్రవేశపెట్టి కేసు వివరాలు వెల్లడించారు. మృతుడు బాణావత్ భీమారావు స్వగ్రామం కృష్ణా జిల్లా మైలవరం మండలం కనిమెర్ల. వృత్తి రీత్యా కారు డ్రైవర్ అయిన భీమారావు అదే జిల్లాలోని పెనమలూరులో నివాసం ఉంటున్నాడు.
 
  తోటి డ్రైవర్ సలీమ్‌తో స్నేహం ఏర్పరచుకున్నాడు. అతని వద్ద కొంత అప్పు చేశాడు. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో సలీమ్.. భీమారావు ఇంటికి వస్తూపోతుండేవాడు. ఇలా భీమారావు భార్య కోటేశ్వరితో వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు. నిదానంగా వారి వ్యవహారం గమనించిన భీమారావు తన భార్యను కొట్టడం.. తిట్టడం చేస్తుండేవాడు. సలీమ్ కనపడినప్పుడల్లా గొడవకు దిగేవాడు. ఈ నేపథ్యంలో కోటేశ్వరి, సలీం కలిసి భీమారావును చంపాలని నిర్ణయించుకున్నారు. సలీమ్.. పెనమలూరులో ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న తన అన్న కొడుకు షేక్ ఇమ్రాన్‌ను సంప్రదించాడు. ఇమ్రాన్ తన కు అన్న వరస అయిన చాంద్‌బాషాతో కలిశాడు. అతను కూడా విజయవాడలోని పాయకాపురంలో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. చాంద్‌బాషాపై అప్పటికే కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీట్ నమోదైంది.
 
 పథకం పన్ని మెడ చుట్టూ వైరు బిగించి..
 గత నెల 28న విజయవాడలోని హ్యాపీ బార్ అండ్ రెస్టారెంట్‌లో ఈ ముగ్గురూ కలిసి హత్య ఎలా చేయాలో ప్లాన్ వేశారు. 29న సలీమ్, చాంద్‌బాషా, ఇమ్రాన్‌లు కుమారి అనే కాల్ గర్ల్, భీమారావుతో పాటు పెనమలూరు నుంచి బయలుదేరి మార్గమధ్యంలో మద్యం సేవించారు. తర్వాత వినుకొండలో క్లచ్ వైరు కొనుగోలు చేసి అదే రోజు రాత్రి 8.30 గంటలకు దోర్నాల చెక్‌పోస్టు దాటి నల్లమల అడవుల్లోకి ప్రవేశించారు. రాత్రి 12.30 గంటల సమయంలో చినారుట్ల దగ్గరలోని నంది టర్నింగ్ వద్ద ఆపి మళ్లీ మద్యం సేవించారు. ఇదే సమయంలో భీమారావు కారు దిగగానే సలీమ్, ఇమ్రాన్‌లు అతని చేతులు, కాళ్లు పట్టుకోగా, చాంద్‌బాషా క్లచ్ వైరును భీమారావు గొంతుకు బిగించి హత్య చేశాడు.
 
  మృతదేహాన్ని లోయలో పడవేశారు. అందరూ కలిసి సున్నిపెంట, నల్గొండ మీదుగా విజయవాడకు చేరుకున్నారు. పోలీసులు తమ కోసం గాలిస్తున్నారని తెలుసుకొని ముగ్గురు నిందితులతో పాటు కోటేశ్వరి ఓ కారులో పారిపోయేందుకు సిద్ధమయ్యారు. ఇలా ఈ నెల 10న సంతమాగులూరు జంక్షన్‌లోని పెట్రోల్ బంకులో డీజిల్ కొట్టించుకుని వెళ్లబోతుండగా మాటు వేసిన వై. పాలెం సీఐ పాపారావు నిందితులను అరెస్ట్ చేశారు. హత్య సమయంలో కాల్ గారల్ సంఘటనా స్థలంలోని కారులోనే ఉన్నట్లు తెలిసింది. భర్తను హత్య చేసేందుకు సహకరించిన కోటేశ్వరి సహా నిందితులను కోర్టులో హాజరు పరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు. కేసును ఛేదించిన యర్రగొండపాలెం సీఐ పాపారావు, దోర్నాల ఎస్సై బ్రహ్మనాయుడు, సిబ్బందిని అభినందించారు.
 

మరిన్ని వార్తలు