మాంగల్యం మరణ శాసనం

11 Oct, 2014 03:38 IST|Sakshi
మాంగల్యం మరణ శాసనం

అగ్నిసాక్షిగా కట్టిన తాళే కసాయి భర్త చేతిలో ఉరితాడుగా మారింది. కష్ట సుఖాల్లో తోడుంటానని ... జీవితమంతా నీతో నడుస్తానన్న ఆ మృగాడు జీవితాన్నే అంతం చేశాడు. మూడు పదుల వయసు నిండకుండానే నూరేళ్ల ఆయువును తీసేశాడు. భార్యను చంపి రెండున్నరేళ్ల కుమార్తెను, ఆరు నెలల వయసున్న కుమారుడిని తల్లికి దూరం చేశాడు.
 
మార్కాపురం : దురలవాట్లకు బానిసగా మారిన ఓ భర్త కట్టుకున్న భార్యను కడతేర్చాడు. ఆమె మెడలో ఉన్న తాళినే గొంతుకు బిగించి అత్యంత దారుణంగా హతమార్చాడు. కనీసం తన ఇద్దరు పిల్లల గురించి కూడా ఆలోచించకుండా ఘాతుకానికి ఒడిగట్టాడు. మార్కాపురం పట్టణంలోని డ్రైవర్స్ కాలనీలో శుక్రవారం జరిగిన ఈ సంఘటన స్థానికులను కలచివేసింది. మృతురాలి తల్లిదండ్రులు, పోలీసుల కథనం ప్రకారం... మార్కాపురం మండలం శివరాంపురం గ్రామానికి చెందిన ఆవుల అల్లూరయ్యకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె కాగా, కుమార్తె రాజేశ్వరి (28)ని ఎనిమిదేళ్ల క్రితం గుండంచర్ల గ్రామానికి చెందిన వ్యక్తికిచ్చి వివాహం చేశారు. రెండు నెలలకే భార్యభర్తల మధ్య విభేదాలు తలెత్తడంతో విడిపోయారు.

అనంతరం 2009లో మార్కాపురం పట్టణానికి చెందిన ఆటోడ్రైవర్ పులిమి శ్రీనుతో రాజేశ్వరికి వివాహం చేశారు. వీరికి ప్రస్తుతం రెండున్నరేళ్ల కుమార్తె భవాని, ఆరు నెలల కుమారుడు రమేష్ ఉన్నారు. అయితే, ఏడాది కాలంగా మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న శ్రీను.. భార్య అడ్డును తొలగించుకోవాలని భావించాడు. కొద్ది రోజులుగా రాజేశ్వరిని వేధిస్తూ వస్తున్నాడు. ఇటీవల అతని వేధింపులు తట్టుకోలేకపోయిన రాజేశ్వరి పుట్టింటికి వెళ్లి తల్లిదండ్రుల వద్ద ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో వారు సర్దిచెప్పి తిరిగి కాపురానికి పంపించారు. ఈ నేపథ్యంలో మార్కాపురంలోని కంభం రోడ్డులో ఉంటున్న శ్రీను.. ఇరవై రోజుల క్రితం తన కుటుంబాన్ని డ్రైవర్స్‌కాలనీలోకి మార్చాడు.

శుక్రవారం ఉదయం 10.30 గంటల సమయంలో బయట నుంచి ఇంటికి వెళ్లిన శ్రీను.. రాజేశ్వరి మెడకు తాళి బిగించి హత్యచేసి పరారయ్యాడు. చుట్టుపక్కల వారిద్వారా సమాచారం అందుకున్న రాజేశ్వరి తల్లిదండ్రులు 11.30 గంటల సమయంలో డ్రైవర్స్‌కాలనీ చేరుకున్నారు. నోటి నుంచి రక్తంపడి మృతిచెంది ఉన్న కుమార్తె, ఉయ్యాలలో గుక్కపట్టి ఏడుస్తున్న మనుమడు రమేష్‌లను చూసి భోరున విలపించారు. సమాచారం అందుకుని సంఘటన స్థలానికి చేరుకున్న సీఐ శివరామకృష్ణారెడ్డి.. గొంతుకు తాళి బిగించడంతో నోటి నుంచి రక్తంకారి రాజేశ్వరి మృతిచెందినట్లు భావించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతురాలి తండ్రి ఆవుల అల్లూరయ్య ఫిర్యాదు మేరకు హత్యకేసు నమోదు చేసుకుని శ్రీను కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మరిన్ని వార్తలు