భార్యను నరికి చంపేసిన భర్త

7 May, 2018 09:54 IST|Sakshi

కడియం మండలం గుబ్బలవారిపాలెంలో ఘటన

కడియం(రాజమహేంద్రవరం రూరల్‌): మండలంలోని మాధవరాయుడుపాలెం పంచాయతీ పరిధి గుబ్బలవారిపాలెంలో దొంగల శ్రీనివాసు అనే వ్యక్తి తన భార్య దొంగల జయ (31)ను కత్తితో నరికి చంపాడు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. శ్రీనివాస్‌కు అదే గ్రామానికి చెందిన జయతో దాదాపు 16 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి సింధువైష్ణవి, అర్జున్‌వెంకటసాయి అనే కుమార్తె, కుమారుడు ఉన్నారు. భార్యాభర్తలిద్దరూ కొంతకాలంగా తగాదాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో పలు మార్లు పెద్దల సమక్షంలో వీరిమధ్య సయోధ్య కుదిర్చేందుకు కూడా ప్రయత్నాలు జరిగాయి. అయితే అవి సఫలం కాకపోవడంతో ప్రస్తుతం ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు. ఇదిలా ఉండగా గ్రామానికి సమీపంలోనే శ్రీనివాసు గులాబీ తోటను సాగు చేస్తున్నాడు.

 ఆదివారం ఉదయం సదరు తోట మీదుగా మరో ఇద్దరు మహిళలతో కలిసి జయ కూలిపనికి వెళుతోంది. గులాబీ తోట వద్దకు వచ్చేసరికి శ్రీనివాసు, జయతో వాగ్వాదానికి దిగాడు. హఠాత్తుగా తన కూడా తెచ్చుకున్న కత్తితో జయ మెడ భాగంలో విచక్షణా రహితంగా నరికేశాడు. ఉన్నట్టుంటి కత్తితో దాడికి దిగడంతో జయతోపాటు వస్తున్న ఇద్దరు మహిళలు  పారిపోయి స్థానికులకు సమాచారమిచ్చారు. స్థానికులు వచ్చి చూసేసరికి కత్తిగాట్లతో తీవ్ర రక్తస్రావమవుతున్న జయ అక్కడే రక్తపుమడుగులో పడి ఉంది. ఆమెను హుటాహుటిన రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతిచెందింది. 

ఆమె మృతదేహాన్ని వెనక్కి తీసుకువచ్చేశారు. జయ మృతి నేపథ్యంలో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతురాలి తల్లి మంగాయమ్మ ఫిర్యాదు మేరకు టుటౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ ముక్తేశ్వరరావు, కడియం ఎస్సైలు ఎల్‌ గౌరీనాయుడు, కె. సురేష్‌బాబులు తమ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాగా శ్రీనివాసు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా