కట్టుకున్న భార్యనే కడతేర్చాడు

12 Nov, 2013 00:39 IST|Sakshi

కీసర,న్యూస్‌లైన్: మద్యానికి బానిసైన అతడు కట్టుకున్న భార్యను కడతేర్చాడు. వాటర్ హీటర్ తీగతో ఉరివేసి ఉసురుతీశాడు. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం చేశాడు. నిందితుడు పారిపోయే యత్నం చేయగా స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన ఆదివారం అర్ధరాత్రి తర్వాత మండల పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని కవాడీగూడ ప్రాంతానికి చెందిన నర్సింగ్‌రావు(42), హేమలత(38) దంపతులకు 18 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి సంతానం కలగలేదు. దంపతులు ఏడాదిన్నరగా కీసర మండలం అహ్మద్‌గూడ పంచాయతీ పరిధిలోని రాజీవ్ గృహకల్ప కాలనీలో ఉంటున్నారు. నర్సింగ్‌రావు నగరంలోని ఓ బ్యాంకులో ప్రైవేట్ సెక్యూరిటీగార్డుగా పనిచేస్తున్నాడు. హేమలత నగరంలో హౌస్ కీపింగ్ విభాగంలో పనిచేస్తోంది. తాగుడుకు బానిసైన నర్సింగ్‌రావు భార్యను వేధించసాగాడు.
 
 ఈక్రమంలో పలుమార్లు హేమలత పుట్టింటికి వెళ్లగా నర్సింగ్‌రావు తిరిగి తీసుకొచ్చాడు. ఆదివారం రాత్రి అతిగా మద్యం తాగిన నర్సింగ్‌రావు ఇంటికి వచ్చి భార్యతో గొడవ పడ్డాడు. ఒంటిగంట సమయంలో వాటర్ హీటర్ వైరుతో ఆమెకు ఉరివేసి చంపేశాడు. ఉరి వేసిన ఆనవాళ్లు కనిపించకుండా హేమలత మెడకు జండూబామ్ రుద్దాడు. తన భార్య ఆత్మహత్యకు పాల్పడిందని ఇరుగుపొరుగును పిలిచాడు. ఇంట్లో వస్తువులు చిందరవందరగా పడి ఉండటంతో స్థానికులు అనుమానించి నర్సింగ్‌రావును నిలదీశారు. అతడు పారిపోయే యత్నం చేయగా పట్టుకొని దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. హేమలత మృతి విషయం తెలుసుకున్న ఆమె బంధువులు రాజీవ్ గృహకల్పకు చేరుకొని కన్నీటిపర్యంతమయ్యారు. నర్సింగ్‌రావు మద్యం తాగుతూ, పిల్లలు కలగడం లేదని హేమలతను వేధించేవాడని ఆరోపించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. నర్సింగ్‌రావు పోలీసుల అదుపులో ఉన్నాడు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది.
 

మరిన్ని వార్తలు