విసిగిపోయే ప్రాణాలు తీశాడు..

10 Jun, 2018 10:35 IST|Sakshi

లారీతో ఢీకొని భార్యను  హతమార్చిన భర్త

నేరం అంగీకరించిన నిందితుడు

వివరాలు వెల్లడించిన సీఐ  శ్యామలరావు

చీపురుపల్లి: భార్య ప్రవర్తనతో విసిగి వేసారిన భర్త ఆలోచన మారిపోయింది. తాను డబ్బులు ఇస్తానని చెప్పినా రాకుండా ప్రియుడితో కలిసి వాహనంపై తిరుగుతోందన్న సమాచారంతో మరింత రగిలిపోయాడు. చివరకు ప్రియుడితో కలిసి ద్విచక్ర వాహనంపై దర్జాగా వస్తున్న భార్యను చూసి తట్టుకోలేకపోయాడు. అంతే కోపం కట్టలు తెంచుకుని ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో లారీతో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి ఆ ఇద్దరినీ హతమార్చాలని భావించాడు. ఈ నెల 7వ తేదీన జరిగిన లారీ, ద్విచక్ర వాహనం ఢీకొన్న సంఘటనలో పోలీసుల విచారణలో తేలిన అంశమిది. 

శనివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌ శ్యామలరావు ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. గరివిడి మండలంలోని కాపుశంభాం గ్రామానికి చెందిన రేగాన తవిటయ్య, రమణమ్మలు భార్యాభర్తలు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. లారీ డ్రైవర్‌గా పని చేస్తున్న తవిటయ్య భార్య రమణమ్మకు అదే గ్రామానికి చెందిన రేగాన రామకృష్ణతో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయమై భార్యను పలుమార్లు తవిటయ్య హెచ్చరించాడు. 

అయినా రమణమ్మ భర్త మాట పెడచెవిన పెట్టింది. ఈ నెల 6వ తేదీన హుజూరాబాద్‌ నుంచి పర్లాకిమిడికి సిమెంట్‌ లోడు తీసుకువస్తున్న తవిటయ్య తన భార్య రమణమ్మకు ఫోన్‌ చేసి 7వ తేదీ ఉదయం 10 గంటలకు సుభద్రాపురం వస్తే డబ్బులు ఇస్తానని తెలిపాడు. అలాగే అని చెప్పిన రమణమ్మ మధ్యాహ్నం ఒంటి గంట అయినా సుభద్రాపురం చేరుకోలేదు. ఇంతలో తవిటయ్య ఇంటికి ఫోన్‌ చేస్తే కుమార్తె ఫోన్‌ లిఫ్ట్‌ చేసి అమ్మ ఎప్పుడో బయిలుదేరిపోయిందని తెలిపింది. 

వెంటనే తవిటయ్య చీపురుపల్లిలో ఉండే తన సహచరులకు ఫోన్‌ చేస్తే రామకృష్ణతో కలిసి బండిపై వెళ్లడం చూశామని చెప్పారు. దీంతో కోపోద్రిక్తుడైన తవిటయ్య సుభద్రాపురం నుంచి చీపురుపల్లి వైపు లారీలో వస్తుండగా, ఎదురుగా ద్విచక్ర వాహనంపై తన భార్య రమణమ్మ ప్రియుడు రామకృష్ణతో రావడం చూశాడు. వెంటనే వారిని హతమార్చాలని నిర్ణయించుకుని ద్విచక్ర వాహనాన్ని లారీతో బలంగా ఢీకొట్టాడు. ఈ సంఘటనలో రమణమ్మ అక్కడికక్కడే మృతి చెందగా, రామకృష్ణ తీవ్రంగా గాయపడి ప్రస్తుతం విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. ఇదిలా ఉంటే పోలీసుల ముందు నేరాన్ని అంగీకరించిన తవిటయ్యపై 302,304 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కార్యక్రమంలో చీపురుపల్లి, గరివిడి ఎస్సైలు టి.కాంతికుమార్, శ్రీనివాస్‌  ఉన్నారు. 

మరిన్ని వార్తలు