వీడిన శ్రీశైలం యువకుడి హత్య కేసు మిస్టరీ

1 Apr, 2018 11:04 IST|Sakshi

 భార్య వివాహేతర సంబంధమే భర్త హత్యకు కారణం 

మృతుడి భార్య, ఆమె ప్రియుడిని అరెస్టు చేసిన పోలీసులు 

పెద్దదోర్నాల: మండల పరిధి ఐనముక్కల సమీపం తీగలేరు కాలువ వద్ద గత నెల 24వ తేదీన ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు శ్రీశైలం ప్రాజెక్టు కాలనీ వాసి నేలటూరి శ్రీనివాసులుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. హత్య కేసును దర్యాప్తు చేపట్టిన పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఐదు రోజుల వ్యవధిలోనే మర్డర్‌ మిస్టరీని ఛేదించారు. హత్యకు పాల్పడిన నిందితుడు శ్రీరాంశెట్టి భాస్కరరావుతో పాటు, హత్యను ప్రోత్సహించిన మృతుడి భార్య నేలటూరి మల్లేశ్వరిని మార్కాపురం డీఎస్పీ  రామాంజనేయులు అరెస్టు చేసి వారిని శనివారం విలేకరుల ఎదుట ప్రవేశ పెట్టారు.

 డీఎస్పీ కథనం ప్రకారం.. కర్నూలు జిల్లా శ్రీశైలం ప్రాజెక్టు కాలనీకి చెందిన నేలటూరి శ్రీనివాసులు, శ్రీరాంశెట్టి భాస్కరరావులు సహ వ్యాపారులు. కాలనీలో పండ్లు, పూలు అమ్ముకుంటూ స్నేహంగా ఉండేవారు. మద్యానికి అలవాటు పడిన శ్రీనివాసులు అప్పులపాలై ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఒంటరిగా ఉన్న అతడి భార్య మల్లేశ్వరితో చనువు పెంచుకున్న భాస్కరరావు ఆమెతో సన్నిహితంగా ఉండేవాడు. కాలక్రమంలో వారి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో కొన్నాళ్లకు శ్రీనివాసులు తిరిగి ఇంటికి చేరాడు. భార్య వివాహేతర సంబంధంపై అనుమానం వచ్చి ఆమెతో ముభావంగా ఉంటున్నాడు.

 తమ వివాహేతర సంబంధానికి భవిష్యత్తులో అడ్డం వస్తాడన్న కారణంతో ఎలాగైనా అతడిని మట్టు పెట్టాలని నిర్ణయించుకున్న భాస్కరరావు గత నెల 24వ తేదీన తన సొంత ఆటోలో కొబ్బరి చిప్పలు నింపుకుని శ్రీనివాసులుతో కలిసి పెద్దారవీడు మండలం కుంట చేరుకున్నాడు. వేరే వాహనంలో కొబ్బరి బోండాల లోడుతో తిరుగు ప్రయాణమయ్యారు. దోర్నాల చేరుకున్న భాస్కరరావు అక్కడ ఓ మద్యం షాపులో మద్యాన్ని కొనుగోలు చేసి శ్రీనివాసరావుకు మోతాదుకు మించి తాగించాడు. స్పృహ కోల్పోయిన శ్రీనివాసరావును తన ఆటోలో వేసుకుని ఐనముక్కల వద్ద తీగలేరు కాలువ వద్దకు చేరుకున్నాడు. అక్కడే తువాలుతో గొంతు బిగించి హతమార్చాడు. 

అనంతరం మృతదేహాన్ని గుర్తు పట్టకుండా ఉండేందుకు పెట్రోల్‌తో కాల్చి అక్కడి నుంచి శ్రీశైలం ప్రాజెక్ట్‌ కాలనీకి చేరుకున్నాడు. దినపత్రికల్లో వచ్చిన కథనాలు చూసిన మృతుని తండ్రి పెంచలయ్య హత్యకు గురైన వ్యక్తి తన కుమారుడేనని గుర్తించడంతో పోలీసులు దర్యాన్తును వేగవంతం చేశారు. బంధువులు వ్యక్తం చేసిన అనుమానంతో భార్య మల్లేశ్వరి, భాస్కరరావు కదలికలపై నిఘా ఉంచారు. 

వీరి ఫోన్‌కాల్స్‌ డేటా పరిశీలించడంతో పాటు, మండల కేంద్రంలోని సీసీ కెమోరాల్లో భాస్కరరావు వాహనం ఎటువైపు ప్రయాణించిందన్న సాక్ష్యాలు సేకరించారు. తమపై అనుమానం ఉందని పసిగట్గిన వీరి ఆటోలో గుంటూరు పారిపోతుండగా కుంట వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను మార్కాపురం కోర్టులో హాజరు పరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు. చాకచక్యంగా వ్యవహరించి తక్కువ సమయంలో మిస్టరీని ఛేదించడంలో చరుగ్గా వ్యవహరించిన సీఐలు భీమానాయక్, మల్లికార్జునరావు, ఎస్‌ఐ రామకోటయ్యతో పాటు సిబ్బందిని అభినందించారు.

మరిన్ని వార్తలు