కట్టుకున్నోడే కాలయముడు!

25 Aug, 2019 08:20 IST|Sakshi
నీలగిరి తోటలో హత్యకు గురైన పుష్ప మృతదేహాన్ని పరిశీలిస్తున్న సీఐ పైడయ్య, ఎస్సై అరుణ్‌కుమార్‌లు

రెండో భార్యను హత్య చేసిన భర్త 

మొదటి భార్య, ఆమె తల్లిదండ్రులే  సూత్రధారులుగా అనుమానం

అరకులోయలో కలకలం

నిందితులను కఠినంగా శిక్షించాలని గిరిజనులు ధర్నా

అరకులోయలో ఘోరం జరిగింది. మొదటి భార్య ఉందని తెలిసి కూడా తననూ బాగా చూసుకుంటాడని నమ్మి పెళ్లి చేసుకున్న యువతి ఆ మృగాడి చేతిలోనే దారుణ హత్యకు గురైంది.ఈ దారుణంలో మరికొంతమంది పాత్ర ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. శనివారం ఉదయం హత్యా ఘటన వెలుగులోకి రావడంతో అరకులోయ పట్టణంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. చినలబుడు గ్రామానికి చెందిన గిరిజన యువతి కిల్లో పుష్ప (20) భర్త చేతిలోనే ప్రాణాలు కోల్పోవడం విషాదాంతమైంది.

సాక్షి, అరకులోయ: భార్య ఉంటుండగానే నెల రోజుల క్రితం మరో యువతిని రెండో వివాహం చేసుకున్న భర్త కిరాతంగా వ్యవహరిం చాడు. నమ్మివచ్చిన పాపానికి దారుణంగా చం పేచాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొదటి సాముహికంగా అత్యాచారం చేసి చంపేసి ఉంటారనే ప్రచారం జరిగినప్పటికీ హత్యగా పోలీసులు నిర్ధారించారు. ఈ హత్య ఘటనకు నిందితుడి మొదటి భార్య, ఆమె తల్లిదండ్రులే సూత్రధారులనే ఆరోపణలూ వ్యక్తమవుతున్నాయి.  వివరాల్లోకి వెళితే.. చినలబుడు గ్రామానికి చెందిన గిరిజన యువతి కిల్లో పుష్ప (20)ను అరకులోయకు చెందిన గిరి జనుడు కె.రమేష్‌ (అలియాస్‌ మహేష్‌)(25) ప్రేమించాడు. అతనికి అప్పటికే భార్య, ఇద్దరు పిల్లలున్నారు.   పుష్ప ను నెల రోజుల క్రితం రెండవ వివాహం చేసుకుని స్థానిక సీ కాలనీలో కాపురం పెట్టాడు. రమేష్‌ రెండో పెళ్లి చేసుకున్న తరువాత కుటుం బ కలహాలు అధికమైనట్టు తెలిసింది.

మొదటి భార్య రాజేశ్వరి గిరిజనేతర కులానికి చెందినావిడ. ఆమెను కూడా ఐదేళ్ల క్రితం రమేష్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య రాజేశ్వరి నుంచి ఒత్తిడి అధికంగా ఉండడంతో పుష్పను అడ్డు తొలగించుకునేందుకు రమేష్‌ ఈ దారుణానికి ఒడికట్టినట్టు తెలిసింది. మొదటి భార్య రాజేశ్వరి, ఆమె తల్లిదండ్రులు కూడా పుష్ప హత్యకు రమేష్‌కు సహకరించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పుష్ప స్థానిక మీసేవ కేంద్రంలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా  పనిచేస్తుంది. సీ కాలనీలో నివాసం ఉన్న ఆమెను శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో భర్త రమేష్‌ బయటకు తీసుకొని వెళ్లినట్టు ఇంటి పక్కన ఉన్న పలు కుటుంబాలు చెబుతున్నాయి.

స్థానికుల సమాచారంతో వెలుగు చూసిన హత్య..
శనివారం ఉదయాన్నే శరభగుడ సమీపంలోని నీలగిరి తోటల్లో శరీరం సగం వరకు దుస్తుల్లేకుండా ఉన్న మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. సీఐ పైడయ్య, ఎస్సై అరుణ్‌కుమార్‌లు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అదే సమయంలో రమేష్‌ కూడా అక్కడకు చేరుకుని మృతిచెందినది తన రెండో భార్య పుష్పఅని, ఎవరో అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని కన్నీళ్లు కార్చాడు. అనుమానం వచ్చిన పోలీసులు రమేష్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అలాగే రమేష్‌ మొదటి భార్య రాజేశ్వరి, ఆమె తల్లిదండ్రులు అనసూయ, ధర్మారావులను కూడా అదుపులోకి తీసుకొని విచారించారు. పుష్పను ఆమె చున్నీనే మెడకు బిగించి హత్య చేశారని పోలీసుల విచారణలో తేలింది. మెడకు గట్టిగా చున్నీని బిగించడంతో నోరు, ముక్కు నుంచి రక్తస్రావం అయ్యిందని వైద్యపరీక్షల్లో వైద్యులు నిర్ధారించారు. ఎవరో అత్యాచారం చేసినట్టు అనుమానించే విధంగా మృతురాలు పుష్ప శరీరంపై దుస్తులను ఊడదీసి ఉంచారు. మృతదేహాన్ని చూసినవారంతా చలించిపోయారు.

గిరిజనుల ధర్నా..
పుష్ప హత్య ఘటనతో అరకులోయలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకున్నాయి. పుష్ప తల్లిదండ్రులు కిల్లో పరశురామ్, పుణ్యవతితో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు, చినలబుడు గ్రామానికి చెందిన గిరిజనులంతా అరకులోయ పట్టణంలో ఆందోళనకు దిగారు. తమ కుమార్తెను అన్యాయంగా పొట్టనపెట్టుకున్న భర్త రమేష్, అతని మొదటి భార్య, తల్లిదండ్రులను వెంటనే ఉరితీయాలని, లేని పక్షంలో తమకు అప్పగించాలని పోలీసులను డిమాండ్‌ చేశారు. పోలీసుస్టేషన్‌ వద్ద ఆందోళన చేపట్టిన తరువాత మెయిన్‌రోడ్డులో బైఠాయించారు. పుష్పకు శవపరీక్షలు జరగకుండా మధ్యాహ్నం వరకు అడ్డుకున్నారు. నిందితులను అరెస్టు చేశామని, కఠినంగా శిక్షిస్తామని పోలీసు అధికారులు బాధిత గిరిజనులకు హమీ ఇవ్వడంతో వారు శాంతించారు. పుష్ప మృతదేహానికి శవపరీక్షలు నిర్వహించిన తరువాత చినలబుడుకు తరలించారు. అలాగే నిందితులుగా భావిస్తున్న పుష్ప భర్త రమేష్‌ ఎస్టీ కులానికి చెందినవాడు కాగా, మిగిలిన మొదటి భార్య, ఆమె తల్లిదండ్రులు గిరిజనేతరులు కావడంతో వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. కేసును దర్యాప్తు చేస్తున్నామని పాడేరు డీఎస్పీ రాజ్‌కమల్‌ తెలిపారు.

తల్లడిల్లిన కుటుంబ సభ్యులు..
పుష్ప మరణంతో కన్నవారు తల్లడిల్లిపోయారు. రమేష్‌ను నమ్మి సర్వస్వం అనుకుని వెళ్లిన ఆమె చివరకు క్రూరమైన హత్యకు గురికావడంతో కన్నవారు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. శుక్రవారం రాత్రి పుష్పను సీ కాలనీలోని నివాసం నుంచి బయటకు తీసుకెళ్లిన రమేష్‌ ఒక్కడే ఆమె హత్య చేసాడా..లేక అతని మొదటి భార్య, ఆమె తల్లిదండ్రులు సహకరించారా అన్నది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.

డిగ్రీ వరకూ చదువు...
వ్యవసాయం చేస్తూనే అష్టకష్టాలు పడి,  కుమార్తె పుష్పను తల్లిదండ్రులు పరశురామ్, పుణ్యవతిలు డిగ్రీ వరకు చదివించారు. అరకులోయలోని మీసేవ కేంద్రంలో డేటా ఎంట్రీ అపరేటర్‌గా పనిచేస్తున్న ఆమెకు ప్రతి నెల రూ.7 వేల వరకు వేతనం వస్తుంది. ఈ డబ్బులో కొంత ఆమె తన తల్లిదండ్రులకు అందజేసి వారి జీవనంలో చేదోడు వాదోడుగా ఉంటుంది. సోదరుడు కిరణ్‌కుమార్‌ డిగ్రీ చదువుకు కూడా పుష్ప ఆర్థికంగా సహకరించేది.

నిందితులను కఠినంగా శిక్షించాలి: ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ.. 
కిల్లో పుష్పను కిరాతకంగా హత్య చేసిన భర్త రమేష్‌తో పాటు, ఇతర నిందితులను కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేశారు. గిరిజన మహిళ హత్యను ఆయన ఖండించారు. విశాఖలో మంత్రుల పర్యటనలో ఉన్న ఆయన పుష్ప హత్య ఘటనను తెలుసుకుని విచారం వ్యక్తం చేశారు.  రమేష్‌తో పాటు, అతని మొదటి భార్య రాజేశ్వరి, ఆమె తల్లిదండ్రులపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి,కఠినంగా శిక్షించాలని, ఈ ఘటనపై సమగ్ర విచారణ చేయాలన్నారు.

మరిన్ని వార్తలు