తెనాలిలో ఏడు పూరిళ్లు దగ్ధం

17 Jun, 2014 02:54 IST|Sakshi
తెనాలిలో ఏడు పూరిళ్లు దగ్ధం

తెనాలి అర్బన్ : పట్టణంలో మొన్నటి ఘోర అగ్నిప్రమాద సంఘటన మాసిపోకముందే సోమవారం మరో అగ్నిప్రమాదం సంభవించింది. పేదల గుడిసెలపై ఉగ్రరూపం దాల్చిన అగ్నికీలలకు క్షణాల్లో ఏడు పూరిళ్లు బూడిదయ్యాయి. స్థానిక మారీసుపేట మఠంబజారులో మున్సిపల్ ప్రాథమిక పాఠశాలకు అనుకుని ఉన్న పూరిళ్లలో మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఓ పాక నుంచి ఎగసిపడిన మంటలు క్షణాల్లో అలముకున్నాయి. చూస్తుండగానే ఏడు పూరిళ్లు బూడిదయ్యాయి. ఆకస్మిక పరిణామంతో ప్రజలు భీతిల్లిపోయారు. ప్రాణాలు దక్కితే చాలన్నట్లు పరుగులు పెట్టారు. అరుపులు కేకలతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. సమీపంలోని అపార్ట్‌మెంట్, భవనాల్లో ఉన్న వారు భయాందోళనలకు గురయ్యారు.
 
స్పందించిన అగ్నిమాపక, రెవెన్యూ సిబ్బంది..
సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారి కె.కృష్ణారెడ్డి నేతృత్వంలో బృందం రెండు వాహనాలతో అక్కడికి చేరుకుంది. చుట్టుపక్కల భవనాలకు ప్రమాదం లేకుండా మంటలను అదుపు చేసింది. ఆస్తినష్టం రూ.1.50 లక్షలు ఉంటుందని అధికారిక అంచనా. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు అంటున్నారు.

కూలిపనులు చేసుకునే బాధితులు స్థానికంగా ఉన్న మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో తలదాచుకున్నారు. సంఘటనా స్థలాన్ని తహశీల్దార్ కేవీ రమణనాయక్, మున్సిపల్ కమిషనర్ బి.గోపినాథ్, ఎంఈ ఎం.ప్రభాకరరావు, బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్ అనూరాధ, ఆర్‌ఐ సూర్యనారాయణమూర్తి, వీఆర్వోలు రోశయ్య, జగన్‌మోహన్‌రావు, ముఖర్జీ, సాయి తదితరులు పరిశీలించి, సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.

మరిన్ని వార్తలు