పేదల గుడిసెల కూల్చివేత

11 Dec, 2013 04:50 IST|Sakshi
పేదల గుడిసెల కూల్చివేత
 సుభాష్‌నగర్, న్యూస్‌లైన్ : నగర శివారులోని నందిగుట్ట సమీపంలో గల నిజాంసాగర్ ప్రధాన కాలువకు ఓ వైపు పేదలు నిర్మించుకున్న గుడిసెలను అధికారులు కూల్చివేయించారు. దీంతో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. కాలువకు ఓ వైపు పేదలు గుడెసెలు వేసుకున్నారు. సోమవారం మంత్రి సుదర్శన్‌రెడ్డిని కలిసి ఇళ్లకు సంబంధించి పట్టాలు ఇవ్వాలని కోరారు. స్పందించిన మంత్రి వెంటనే కలెక్టర్‌తో మాట్లాడారు. 15 రోజుల్లోగా నగరంలో 5 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి, నివాసాలు కల్పించాలని సూచించారు. అయితే జిల్లా యంత్రాంగం మాత్రం మంగళవారం తెల్లవారుజామున భారీ బందోబస్తు మధ్య పేదల గుడిసెలను కూల్చివేయించింది. కనీసం తమ వస్తువులను తీసుకుంటామని వేడుకున్నా కనికరం చూపలేదు. దీంతో బాధితులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. గుడిసెలు తీసి వేయడంతో తీవ్రమైన చలిలో చిన్న పిల్లలు, బాలింతలు వణుకుతూ గడిపారు. సుమారు 3 వందల కుటుంబాలు వీధిన పడ్డాయి. 
 
 వారం క్రితమే..
 నిజాంసాగర్ ప్రధాన కాలువ నందిగుట్ట ప్రాంతంలో పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్లాట్లు వేశారు. వాటిని విక్రయించుకోవడానికి పేదలు అడ్డు ఉన్నారని భావించారు. వారిని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని ఎత్తులు వేశారు. వారం క్రితం మంత్రిని కలసి సమస్యను వివరించారు. పక్కా ప్రణాళక ప్రకారమే గుడిసెలను కూల్చివేయించారని బాధితులు ఆరోపిస్తున్నారు.
 
 నీటి పారుదల శాఖ ఆదేశాల మేరకే..
 గుడిసెలను తొలగించడంలో మా ప్రమేయం లేదు. నీటిపారుదల శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే గుడిసెలను తొలగించాం.
 -యాదగిరిరెడ్డి, ఆర్డీఓ, నిజామాబాద్
 
Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు