కుర్రకారు జోష్ కు బ్రేక్!

27 Jul, 2014 14:42 IST|Sakshi
కుర్రకారు జోష్ కు బ్రేక్!

టీనేజీ కుర్రాళ్లు దారి తప్పుతున్నారు. సాహసాల పేరుతో చెడుదారిలో పయనిస్తున్నారు. అడ్వెంచర్ ను ఆస్వాదించేందుకు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. సరదాల కోసం తమ ప్రాణాలతో వాటు సాటివారి ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. బైక్ రేసింగ్ లతో జనాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. కుర్రకారు జోష్ తో రోడ్డుపై జనం నడవాలంటే జంకాల్సిన పరిస్థితులు కల్పిస్తున్నారు.

హైదరాబాద్ లో బైక్ రేసింగ్ సంస్కృతి వేగంగా పెరుగుతోంది. అర్థరాత్రి, ఉదయం వేళల్లో ఇది ఎక్కువగా ఉంటోంది. సంపన్న వర్గాలకు నిలయమైన బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ తో పాటు నెక్లెస్ రోడ్, గండిపేట చెరువు వంటి పర్యాటక పాంత్రాలు కుర్రకారు రేసింగ్ లకు అడ్డాలు మారాయి. బైకులపై మితిమీరిన వేగంతో వెళుతూ టీనేజర్లు ప్రదర్శించే విచిత్ర విన్యాసాలు ప్రజల ప్రాణాలమీదకు తెస్తున్నాయి. కారు బాబులు కూడా పందాలు వేసుకుంటూ జనాన్ని భయపెడుతున్నారు.

పోలీసులు ఎన్నిచర్యలు తీసుకుంటున్నా బైక్ రేసింగ్ లకు అడ్డుకట్ట పడడం లేదు. తాజాగా గండిపేట వద్ద బైక్ రేసింగ్ నిర్వహిస్తున్న దాదాపు 80 మంది టీనేజర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న 30 బైకులను సీజ్ చేశారు. వీరిలో చాలా మంది 15 ఏళ్లలోపు వారే కావడం గమనార్హం. తల్లిదండ్రులు నిద్రలేవకముందే వారికి తెలియకుండా బైకులు తీసుకొచ్చి వీరు రేసింగ్ చేస్తున్నారని పోలీసులు తెలిపారు. వీరికి కౌన్సెలింగ్ ఇస్తామని చెప్పారు. వారి తల్లిదండ్రులు పిలిచి మాట్లాడతామని చెప్పారు. బైక్ రేసింగ్ పాల్పడేవారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు