పరిమిత ఆంక్షలు.. పదేళ్లు ఉమ్మడి

27 Nov, 2013 00:39 IST|Sakshi
పరిమిత ఆంక్షలు.. పదేళ్లు ఉమ్మడి

హైదరాబాద్ చుట్టూ తుది కసరత్తు.. కొలిక్కి వచ్చిన జీవోఎం నివేదిక
హైదరాబాద్‌పై పరిమిత ఆంక్షలతో తెలంగాణ ఏర్పాటుకు సూచన
సీమాంధ్ర కేంద్రమంత్రుల     యూటీ ప్రతిపాదనకు తిరస్కారం
శాంతిభద్రతలు, రెవెన్యూ, భూపరిపాలన అధికారాలు కేంద్రానికి
ఆర్టికల్ 258(ఎ) కింద గవర్నర్ లేదా కమిటీకి ప్రత్యేకాధికారాలు
ఆర్టికల్ 371(డి), భద్రాచలం జోలికి వెళ్లకుండానే విభజన?
ఢిల్లీలో వేగంగా పరిణామాలు.. రోజంతా జీవోఎం కీలక భేటీలు
నేడు మళ్లీ భేటీ.. ఇదే ఆఖరి సమావేశమన్న జైరాంరమేశ్
ఇదే తుది సమావేశమని చెప్పలేమని వ్యాఖ్యానించిన షిండే
రాష్ట్రపతి ప్రణబ్‌తో సోనియా భేటీ..

న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి:

రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రివర్గ బృందం (జీవోఎం) నివేదిక ఒక కొలిక్కి వచ్చింది. మంగళవారం హస్తినలో సాగిన జీవోఎం భేటీలు మొత్తం హైదరాబాద్ కేంద్ర బిందువుగా సాగాయి. ఢిల్లీలో చకచకా చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం (యూటీ)గా చేయాలన్న ప్రతిపాదన పూర్తిగా వెనక్కి వెళ్లింది. విభజన ప్రక్రియలో రాజ్యాంగాన్ని సవరించాలన్న సంకట స్థితిని తప్పించుకోవడానికి అంతిమంగా ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయనవసరం లేకుండానే కొన్ని షరతులతో ఉమ్మడి రాజధానిగా ఉంచేందుకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాలలో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)లో తీసుకున్న మౌలిక నిర్ణయానికే కట్టుబడాలన్నది కేంద్ర ప్రభుత్వ తాజా యోచనగా తెలుస్తోంది. హైదరాబాద్‌ను యూటీ చేయకపోయినా మెజారిటీ సీమాంధ్రులు కోరుతున్నట్టుగా కొంత కాలం పాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచేందుకే సమాయత్తమవుతున్నారు. ఉమ్మడి రాజధానిని నిర్ణీత కాలం వరకే అనే భరోసా తెలంగాణ వారికీ, ఆ సమయంలో శాంతి భద్రతలకు పూచీ ఇచ్చే నమ్మకాన్ని సీమాంధ్రులకు కలిగించే ఏర్పాట్ల కోసం కసరత్తు చేస్తున్నారు. గత కొంత కాలంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు తదితరులు చేస్తున్న రెచ్చగొట్టే ప్రకటనల పట్ల సీమాంధ్రులు తరచూ ఆందోళన, అభద్రత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మధ్యేమార్గంగా శాంతిభద్రతలు, రెవెన్యూ, భూపరిపాలన అంశాల పర్యవేక్షణ బాధ్యతను గవర్నర్ లేదా కేంద్ర అథారిటీ పరిధిలో ఉంచేందుకు కేంద్రం సిద్ధమైంది. అందుకోసం రాజ్యాంగంలోని 258 (ఎ) అధికరణను అనుసరించి ఎలాంటి రాజ్యాంగ సవరణ అవసరం లేకుండా ఆయా అంశాలకు సంబంధించిన కార్యనిర్వాహక అధికారాలను కేంద్రం పర్యవేక్షించేలా ఏర్పాటు చేయాలని జీవోఎం బిల్లు ముసాయిదాలో ప్రతిపాదించింది. విభజన అనంతరం తెలంగాణ, సీమాంధ్ర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డీజీపీలతో పాటు కేంద్ర ప్రతినిధితో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేసేలా ఇరు రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని కూడా అందులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని విషయంలో తెలంగాణ వాదుల నుంచి వ్యక్తమవుతున్న సందేహాలను నివత్తి చేసేందుకు నిర్దిష్ట కాల పరిమితి (సన్‌సెట్) అంశాన్ని తెలంగాణ బిల్లులో పొందుపరచారని సమాచారం. వివాదాస్పదమైన 371 (డి) అధికరణకు రాజ్యాంగ సవరణ అవసరం లేకుండానే రాష్ట్రాన్ని విభజించవచ్చని నివేదికలో పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని సవరించే సంకట స్థితే కాకుండా నియోజకవర్గ పునర్విభజన వంటి సంక్లిష్ట పరిస్థితులు తలెత్తకుండా చూసే క్రమంలో భద్రాచలం వంటి వివాదాస్పద అంశాల జోలికి జీవోఎం వెళ్లలేదు. నీరు, వనరుల పంపిణీ, విద్య, ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై జీవోఎం ఇప్పటికే తుదినిర్ణయానికి రాగా మంగళవారం వేగంగా సాగిన సమావేశాలు, సమాలోచనలన్నీ హైదరాబాద్ అంశం చుట్టే తిరిగాయి.
 
 అంతా మేడం కనుసన్నల్లోనే...
 కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆదేశాలకు అనుగుణంగానే జీవోఎం సభ్యులు నివేదికలో ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తున్నారు. అందులో భాగంగా మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జీవోఎం సారథి, కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే, జీవోఎం సభ్యుడు, మరో కేంద్రమంత్రి జైరాంరమేశ్‌లు నివేదిక రూపకల్పనపై కసరత్తు చేశారు. హైదరాబాద్ అంశంపైనే రోజంతా కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. సాయంత్రం జీవోఎం మరో సభ్యుడు, రక్షణమంత్రి ఎ.కె.ఆంటోని నివాసంలోనూ జీవోఎం సభ్యులు సమావేశమై దీనిపై చర్చించినట్లు సమాచారం. మరోవైపు బుధవారం ఉదయం సీమాంధ్ర కేంద్ర మంత్రులు జైరాంరమేశ్‌ను కలిసి హైదరాబాద్ అంశంపై చర్చించనున్నట్లు తెలిసింది. తరువాత జీవోఎం సభ్యులు నార్త్‌బ్లాక్‌లో సమావేశమై నివేదికను ఖరారు చేయనున్నట్లు హోంశాఖ వర్గాలు తెలిపాయి. బుధవారం జరగబోయే జీవోఎం సమావేశమే చివరిదని, నివేదికను ఖరారు చేస్తామని జైరాంరమేశ్ మంగళవారం ఢిల్లీలో మీడియాతో పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నం నుంచి రాత్రి 9 గంటల వరకు జీవోఎం సమావేశం ఉంటుందని చెప్పారు.
 
 ఎవరినీ బాధపెట్టని పరిష్కారం వెదుకుతున్నాం: షిండే
 అయితే.. జీవోఎం సారథి షిండే అందుకు విరుద్ధంగా పేర్కొన్నారు. ఆయన మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ‘‘తెలంగాణపై జీవోఎం సమావేశం కొనసాగుతుంది. రేపు (బుధవారం) కూడా జరుగుతుంది. రేపటి సమావేశమే చివరిదని చెప్పలేం. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేటపుడు ఏ ప్రాంతం వారినీ బాధపెట్టకుండే ఉండే పరిష్కార మార్గాలను వెదుకుతున్నాం’’ అని పేర్కొన్నారు. సాధ్యమైనంత త్వరగా జీవోఎం నివేదికను కేంద్ర కేబినెట్‌కు సమర్పిస్తామని చెప్పారు. అయితే.. షిండే వ్యాఖ్యల నేపథ్యంలో జీవోఎం నివేదిక ఈ నెల 28వ తేదీ (గురువారం) సాయంత్రం జరిగే కేంద్ర కేబినెట్ ముందుకు వస్తుందా? లేదా? అన్న అంశం ఉత్కంఠ రేపుతోంది. దీనిపై జైరాం సహా జీవోఎం సభ్యులెవరూ స్పష్టత ఇవ్వటం లేదు. ఇప్పటివరకైతే అలాంటి సంకేతాలు మాత్రం రాలేదని, కేబినెట్ ముందుకు ఎప్పడు నివేదికను పంపాలన్నది పూర్తిగా సోనియాగాంధీ ఆదేశాలపైనే ఆధారపడి ఉందని, నివేదిక మాత్రం దాదాపుగా ఖరారైందని కాంగ్రెస్ అధిష్టానం వర్గాలు చెప్తున్నాయి.
 
 షిండే, జైరాంలతో సిబల్ భేటీ...
 మరోవైపు మంగళవారం పలువురు కేంద్ర మంత్రులు జీవోఎం సభ్యులు షిండే, జైరాంరమేశ్‌లను కలిసి రాష్ట్ర విభజన విషయంలో తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు. తొలుత న్యాయశాఖ మంత్రి కపిల్‌సిబల్.. షిండేతో కొద్దిసేపు సమావేశమై వెళ్లారు. ఆర్టికల్ 371డీ, హైదరాబాద్ యూటీ, సీమాంధ్రలో భద్రాచలం విలీనం వంటి అంశాలపై న్యాయపరంగా తలెత్తిన అంశాలపై పలువురు న్యాయనిపుణుల అభిప్రాయాలతో క్రోడీకరించిన నోట్‌ను జీవోఎం సభ్యులకు సిబల్ అందజేసినట్లు తెలిసింది. ఆ తరువాత కొద్దిసేపటికి జాతీయ విపత్తు నివారణా సంస్థ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ కాంగ్రెస్ నేతల బృందం షిండేను కలిసింది. తెలంగాణలో అసెంబ్లీ స్థానాలను పెంచాలని కోరుతూ వినతిపత్రం అందజేసింది.
 
 ‘కర్నూలు రాజధాని’ కోరిన కోట్ల...
 అనంతరం రైల్వేశాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి అక్కడికి వచ్చారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కర్నూలును సీమాంధ్ర రాజధానిగా చేసే అంశాన్ని పరిశీలించాలని ఆయన కోరారు. అది సాధ్యం కాని పక్షంలో కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణలో కలపాలని కోరారు. ఈ రెండు జిల్లాల్ల గల సుమారు 2,300 గ్రామాలకు గాను దాదాపు 1700 గ్రామ పంచాయతీలు రాయల తెలంగాణను ఏర్పాటు చేయాలని కోరుతూ తీర్మానం చేశాయని పేర్కొంటూ వాటి వివరాలను జీవోఎం సభ్యులకు కోట్ల అందజేసినట్లు హోంశాఖ వర్గాలు తెలిపాయి. జీవోఎం సభ్యులు తమను అడుగడుగునా అవమానిస్తున్నందున ఇకపై తాను వారిని కలిసే ప్రసక్తే లేదని ప్రకటించిన కోట్ల రెండు రోజుల్లోనే మనసు మార్చుకుని అక్కడికి రావడం చర్చనీయాంశమైంది.
 
 పరిమిత ఆంక్షలకు జైపాల్ ఓకే!
 ఆ తరువాత కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి జీవోఎం సభ్యులు షిండే, జైరాంరమేశ్‌లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌పైనే ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. హైదరాబాద్‌ను యూటీ చేయకుండా సీమాంధ్రులకు రక్షణ కల్పించే విషయంపై జీవోఎం సభ్యులతో మాట్లాడాలంటూ సోనియాగాంధీ చేసిన సూచనల మేరకే జైపాల్‌రెడ్డి వారితో సమావేశమైనట్లు చెప్తున్నారు. దాదాపు గంటన్నర పాటు జరిగిన ఈ సమావేశంలో హోంశాఖ ఉన్నతాధికారులు కూడా హాజరై ఆయన అభిప్రాయాలను నోట్ చేసుకున్నట్లు తెలిసింది. ఆ తరువాత జైపాల్‌రెడ్డి నివాసానికి వెళ్లిన జైరాంరమేశ్ ఆయనతో కొద్దిసేపు సమావేశమై వెళ్లారు. మంగళవారం సాయంత్రం ఆంటోని నివాసంలో జీవోఎం సభ్యులు వీరప్పమొయిలీ, నారాయణస్వామి కొద్దిసేపు సమావేశమై హైదరాబాద్ అంశంపై చర్చించినట్లు తెలిసింది. అనంతరం జైపాల్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ అంశంపై మాట్లాడినట్లు చెప్పారు. ‘‘హైదరాబాద్‌లో సీమాంధ్రుల కోసం పరిమిత కాలానికి రక్షణలను ఏర్పాటు చేయాలంటే రాజ్యాంగ, న్యాయపరంగా ఉన్న చిక్కులపై చర్చించాం. తెలంగాణ వాదిగా వాటిపై నా అభిప్రాయాలను వివరించాను. నా వివరణ తరువాత జీవోఎం ఏ నిర్ణయం తీసుకుంటుందో అవగాహన లేదు’’ అని ఆయన పేర్కొన్నారు. పదేళ్లు ఉమ్మడి రాజధానిగా కొనసాగనున్న హైదరాబాద్‌లో సీమాంధ్రుల రక్షణ కోసం ఊరట కలిగించే చర్యలు తీసుకోవాలని సీడబ్ల్యూసీ తీర్మానంలో ఉందన్నారు. అలాంటిదేమీ అవసరం లేదనేది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. విభజన అనంతరం తెలంగాణ ప్రభుత్వమే ఈ విషయంలో రాజ్యాంగపరమైన విధులను నిర్వర్తిస్తుందనే నమ్మకం ఉందన్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో సీమాంధ్రులకు ఊరట కలిగించేలా చర్యలు తీసుకోవటానికి తనకేమీ అభ్యంతరం లేదన్నారు. హైదరాబాద్‌ను యూటీ చేయడానికి తనతో సహా తెలంగాణ ప్రజలు, పార్టీలు, నాయకులెవరూ ఒప్పుకోరని స్పష్టంచేశారు. రాజ్యాంగంలోని 258 (ఎ) విషయాల పై తానిప్పుడు మాట్లాడబోనన్నారు. అయితే యూటీ లేకుండా, రాజ్యాంగ సవరణ లేకుండానే హైదరాబాద్‌లో సీమాంధ్రుల రక్షణ కోసం కొన్ని చర్యలు తీసుకోవచ్చని జీవోఎం సభ్యులకు చెప్పానని.. వాటిని మీడియాకు వెల్లడించలేనని తెలిపారు. తెలంగాణ బిల్లు అసెంబ్లీకి ఎప్పుడు వెళుతుందో చెప్పలేనన్నారు. అయితే డిసెంబర్ 20 లోపు మాత్రం మొత్తం తెలంగాణ ప్రక్రియ పూర్తవుతుందనే విశ్వాసం తనకు ఉందన్నారు. తెలంగాణ నాయకులను సంప్రదించిన తరువాతే రాయల తెలంగాణ అంశంపై తాను మాట్లాడతానని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు.
 
 యూటీ చేస్తే చాలు..: ప్రధానికి శీలం వినతి
 సీమాంధ్ర రాష్ట్రంలో కొత్త రాజధానిని నిర్మించుకునేంత వరకు హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తే చాలని కేంద్రమంత్రి జె.డిశీలం మంగళవారం ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ను కోరారు. ఈ విషయంలో తెలంగాణ నేతలను ఒప్పించే బాధ్యతను తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఉదయం ప్రధానిని కలిసిన ఆయన ఈ మేరకు ఓ వినతి పత్రం అందజేశారు. ఆ తరువాత ఆర్థికమంత్రి చిదంబరంతో శీలం సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమేనని తాము ఒప్పుకుంటున్నామన్నారు. అయితే సీమాంధ్రలో కొత్త రాజధాని ఏర్పాటయ్యే వరకు మాత్రమే హైదరాబాద్‌ను యూటీ చేయాలని కోరుతున్నామని, ఈ విషయంలో తెలంగాణ నేతలు భీష్మించుకోకుండా ఇచ్చిపుచ్చుకునే రీతిలో వ్యవహరించాలే తప్ప నిర్దయగా ఉండొద్దని సూచించారు. తెలంగాణ వాళ్లు అడిగిందల్లా ఇవ్వాలని తాము కోరుతున్నామని, తమకు మాత్రం కొద్ది కాలం హైదరాబాద్‌ను యూటీ చేస్తే చాలని అన్నారు. తద్వారా 90 శాతం మంది ప్రజలను సంతోషపడతారని చెప్పారు. కాదూ కూడదని తెలంగాణ నేతలు భీష్మించుకుంటే జరగబోయే పర్యవసానాలకు తాము బాధ్యులం కాదని వ్యాఖ్యానించారు.
 
 సోనియాతో కృపారాణి భేటీ
 మరోవైపు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో కేంద్రమంత్రి కిల్లి కృపారాణి సమావేశమైనట్లు తెలిసింది. కోస్తాలో వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సోనియాను కోరిన కృపారాణి.. రాష్ట్ర విభజన అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ హైదరాబాద్‌ను యూటీ చేసే అంశాన్ని పరిశీలించాలని కోరినట్లు తెలిసింది. అయితే సోనియాగాంధీ మాత్రం ఆ ప్రతిపాదన సాధ్యం కాదని, సీడబ్ల్యూసీ తీర్మానం పరిధిలోనే రాష్ట్ర విభజన జరుగుతుందని స్పష్టం చేసినట్లు సమాచారం. సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులను ఈ విషయంలో ఒప్పించాల్సి బాధ్యత ఆ ప్రాంత కేంద్ర మంత్రులదేననని సూచించినట్లు తెలిసింది.
 
 రాష్ట్రపతితో సోనియా భేటీ
 ఇదిలవుంటే.. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మంగళవారం సాయంత్రం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలుసుకున్నారు. రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లు సిద్ధమవుతున్న నేపథ్యంలో సోనియా రాష్ట్రపతిని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్ర మంత్రివర్గ భేటీ తర్వాత తుది రూపం సంతరించుకునే విభజన బిల్లు ముసాయిదా అంశాన్ని ఆమె రాష్ట్రపతి దృష్టికి తెచ్చినట్టు సమాచారం.

మరిన్ని వార్తలు