పరిశుభ్రతతో ఆరోగ్యం, ఆనందం

8 Oct, 2014 02:52 IST|Sakshi
పరిశుభ్రతతో ఆరోగ్యం, ఆనందం

నెల్లూరు(బృందావనం) : పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని ప్రజలందరూ ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఏసీ సుబ్బారెడ్డి క్రీడాప్రాంగణంలో ఆ స్టేడియం వాకర్స్ అసోసియేషన్, జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన క్రీడాప్రాంగణం పరిశుభ్రతలో ఆయన పాల్గొన్నారు.

అనంతరం ఎంపీ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎంతో ఉన్నతాశయంతో ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన స్వచ్ఛభారత్ కార్యక్రమం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యంకావాలన్నారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రతలో భాగస్వామ్యమైతే దేశంలో వ్యాధులు దూరమై అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా జీవించగలరన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆశయాల మేరకు స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ప్రణాళికాబద్ధంగా చేపడితే 2019 అక్టోబరు 2 నాటికి గాంధీజీ కలలు నిజమౌతాయన్నారు. ఈ దిశగా ప్రజలందరూ అడుగులువేయాలన్నారు.   

నిత్యం వాకింగ్ చేసే క్రీడాప్రాంగణంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం చేపట్టడం హర్షణీయమన్నారు. తాను కూడా స్వచ్ఛభారత్‌లో పాల్గొంటున్నానన్నారు. ఏసీ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బాసం శేషగిరిరావు మాట్లాడుతూ తాము నిర్వహిస్తున్న స్వచ్ఛభారత్ కార్యక్రమంలో ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి పాలుపంచుకోవడం ఆనందంగా ఉందన్నారు.

జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎతిరాజ్ మాట్లాడుతూ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ చేపట్టిన స్వచ్ఛభారత్‌లో తాము తమ వంతుగా  పాలుపంచుకున్నామన్నారు.  ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కోశాధికారి నారాయణరావు, సభ్యులు డాక్టర్ అంకిరెడ్డి, డాక్టర్ శ్రీనివాసకుమార్, రాఘవేంద్రశెట్టి, ఎల్లారెడ్డి, రంగారావు, నిర్మలనరసింహారెడ్డి, నలబోలు బలరామయ్యనాయుడు, ఓబులరెడ్డి పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు