వైఎస్సార్‌సీపీలోనే కొనసాగుతా: బుట్టా రేణుక

28 May, 2014 02:06 IST|Sakshi
వైఎస్సార్‌సీపీలోనే కొనసాగుతా: బుట్టా రేణుక

న్యూఢిల్లీ: తాను వైఎస్సార్‌సీపీలోనే కొనసాగుతున్నానని, ఇందులో ఎలాంటి అయోమయానికి తావులేదని వైఎస్సార్‌సీపీ తరఫున కర్నూలు ఎంపీగా ఎన్నికైన బుట్టా రేణుక స్పష్టం చేశారు. నియోజవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే ఆంధ్రప్రదేశ్‌కి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మర్యాద పూర్వకంగా కలిశానని వివరణ  ఇచ్చారు. ఢిల్లీలో మంగళవారం ఉదయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, కొత్తపల్లి గీతతో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘‘నాపై ఎలాంటి ఒత్తిళ్లు లేవు. నేను పూర్తిగా అయోమయంలో ఉన్నాను. ఏమవుతుందో తెలుసుకునేలోపే అంతా జరిగింది. ఇదంతా అనుకోకుండా జరిగిన ఓ సంఘటన’’ అని రేణుక తెలిపారు.

తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలకు ఇక్కడితో ముగింపు పలుకుతున్నట్టు చెప్పారు. టీడీపీ సభ్యత్వం తీసుకున్న మీ భర్త అందులోనే కొనసాగుతారా అని ప్రశ్నించగా.. ‘‘నాతో చర్చించకుండానే ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారు. ఆ సమయంలో నేను పార్లమెంట్‌కి వెళ్లాను. ఆయన టీడీపీలో చేరినట్టు నాకూ మీడియా ద్వారానే తెలిసింది. అందుకే దాని గురించి ఏమీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను’’ అని తెలిపారు. రాజకీయానుభవం లేకపోవడం వల్లే ఇలాంటి సంఘటనలు జరిగాయని, భవిష్యత్తులో ఇలాం టివి పునరావృతం కాకుండా చూసుకుంటానని చెప్పారు.

ఎస్పీవై రెడ్డి ఇకనైనా తప్పు తెలుసుకోవాలి: మేకపాటి

తన ప్రాంత అభివృద్ధి కోసం టీడీపీలో చేరానని చెబుతున్న నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి ఇప్పటికైనా చేసిన తప్పును తెలుసుకోవాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ మేకపాటి సూచించారు. ఎస్పీవై రెడ్డిని టీడీపీ నాయకులు భ్రమపెట్టారో, భయపెట్టారో తెలియడం లేదన్నారు. ‘‘గత రెండు రోజులుగా చోటు చేసుకున్న సంఘటనలు ఎంతో దురదృష్టకరం. టీడీపీకి ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేంత మద్దతు ప్రజలు  ఇచ్చారు. రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వాన్ని నడుపుతూ, చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలి.

అది వదిలేసి ఇతర పార్టీల నాయకులను ప్రలోభ పెట్టడం అనైతికం. టీడీపీ నాయకులు ఇప్పటికైనా అలాంటి కార్యక్రమాలకు ముగింపు పలికితే మంచిది’’ అని చెప్పారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలను నెరవేరుస్తారని ప్రజలంతా ఆశతో ఉన్నారని, చెప్పిన మాటను నిలబెట్టుకోకపోతే ప్రజలు ఆలోచిస్తారన్నారు. వ్యవసాయ రుణాల మాఫీపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ..బాబు చెప్పిన దానికి పూర్తి విరుద్ధంగా చేస్తుంటారని, రుణమాఫీ అమలు ఏవిధంగా చేస్తారో వేచి చూద్దామన్నారు. ఎస్పీవై రెడ్డి తిరిగి పార్టీలోకి వస్తే తీసుకుంటారా అని ప్రశ్నించగా.. ఆ విషయాన్ని పార్టీ అధ్యక్షుడు నిర్ణయిస్తారని మేకపాటి సమాధానమిచ్చారు.
 

>
మరిన్ని వార్తలు