నేనూ సర్కారు బడుల్లోనే చదివా

11 Feb, 2015 19:05 IST|Sakshi
నేనూ సర్కారు బడుల్లోనే చదివా

డోన్ టౌన్:‘నేనేమీ కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదవలేదు. నేనూ ప్రభుత్వ కళాశాలల్లోనే చదివే ఈ స్థాయికి ఎదిగా. ప్రభుత్వోద్యోగిగా కొలువుదీరా’నంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ అన్నారు. డోన్‌లోని జీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం ఏర్పాటు చేసిన కళాశాల 36వ వార్సికోత్సవానికి ఆయన సతీసమేతంగా హాజరయ్యారు. ముందుగా ఆయన కళాశాల విద్యార్థులు తయారు చేసిన సోలార్ ప్రాజెక్టును సందర్శించి విద్యార్థుల మేధసంపత్తిని అభినందించారు. తరువాత కళాశాలలో ఏర్పాటు చేసిన వివేకానంద విజ్ఞాన మందిరం(లైబ్రరీ), కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించారు.

కళాశాల ప్రిన్సిపాల్ పల్లె శివశంకర్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో ఆయన తన విద్యార్థి జీవితాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ కళాశాలకు బస్సులు, రోడ్లు, ఇతర సౌకర్యాలు ఉన్నాయన్నారు. తాను చదివే రోజుల్లో ప్రతి రోజూ ఆరు కిలోమీటర్ల దూరంలోని కళాశాలకు నడచి వెళ్లి చ దువుకున్నట్లు తెలిపారు. అప్పటి నడకలే ఉన్నత శిఖరాలతో పాటు ఆరోగ్యానికి దోహదపడ్డాయన్నారు. పుస్తకాలతోనే మేధోసంపత్తితో పాటు వ్యక్తిత్వ వికాసం సిద్ధిస్తుందన్నారు. అందుకే పుస్తకపఠనం అలవర్చుకోవాలని కోరారు. తల్లిదండ్రులు, గురువులను పూజించిన చోటే నాగరికతతో కూడిన మానవత్వం విరాజిల్లుతుందన్నారు.
 
 ఓటుకూ ఆధార్..
  ఓటు హక్కు గల ప్రతి విద్యార్థి దాన్ని వినియోగించుకున్నప్పుడే నిజమైన నాయకుడు ఆవతరిస్తాడని భన్వర్‌లాల్ అన్నారు. తద్వారా ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రస్తుత ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఎనిమిది నెలల కిందటి ఫలితాలకు పూర్తిగా వ్యతిరేకంగా వచ్చాయన్నారు. అందుకే ఓటు ప్రతి పౌరుని చేతిలో వజ్రాయుధం లాంటిదని పేర్కొన్నారు. వందేమాతరం ఫౌండేషన్ డెరైక్టర్ మాధవరెడ్డి మాట్లాడుతూ మానసిక పరకత్వం లేని విద్య ఉపయోగపడదని, తద్వారా ఆరోగ్యం క్షీణించి అనర్థాలకు దారి తీస్తుందన్నారు.

కర్నూలు ఆర్డీఓ రఘుబాబు, ఆదోని ఆర్డీఓ ఓబులేసు మాట్లాడారు. కళాశాల ప్రగతిని ప్రిన్సిపాల్ చదివి విన్పించారు. అనంతరం భన్వర్‌లాల్ దంపతులను ఘనంగా సన్మానించారు. జింథాల్ మైన్స్ అధికారి అంకాల్‌రెడ్డి, సబ్‌జైల్ సూపరింటెండెంట్ స్వామి, పారిశ్రామిక వేత్త పామయ్య, న్యాయవాది నాగభూషన్‌రెడ్డి పాల్గొన్నారు.
 
 ఆకట్టుకున్న రవివర్మ సంగీతం
 ప్రముఖ సినీ రచయిత, సంగీత దర్శకుడు రవివర్మ సంగీత విభావరి విద్యార్థులను ఆకట్టుకుంది. పాడే ప్రతి గీతం రసరమ్య మధురంగా ఉండటంతో ఆయన పాటలకు విద్యార్థులు జతకట్టి నృత్యాలు చేశారు. రవివర్మ పాటలకనుగుణంగా వారు స్టెప్పులేయడం అందిరిలో జోష్ పెంచింది. 

>
మరిన్ని వార్తలు