రాయల తెలంగాణ ప్రతిపాదనతో రాక్షసానందం

9 Nov, 2013 03:10 IST|Sakshi

 

=సీఎం, చంద్రబాబు భావితరాల విలన్లు
 =రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే జగన్ తాపత్రయం
 =వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు

 
సాక్షి, తిరుపతి : రాయల తెలంగాణను తెరపైకి తెచ్చి రాక్షసానందం పొందేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, అమరనాథరెడ్డి, శ్రీని వాసులు అన్నారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం వారు మాట్లాడారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బ తీసేందుకు రాయల తెలంగాణ  వాదాన్ని తెరపైకి తీసుకువచ్చారని చెప్పారు. ఆ ప్రతిపాదన తీసుకువస్తే, ప్రజలే వీరి నాలుకలు తెగ్గోస్తారని హెచ్చరించారు.

రాష్ట్ర విభజనకు కారణమైన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ నేత చంద్రబాబు నాయుడు భావితరాల  దృష్టిలో విలన్లు కావడం ఖాయమన్నారు. కర్ణాటక రా ష్ట్రంతో ఇప్పటికే కృష్ణా జలాల సమస్యను ఎదుర్కొంటున్నామని గుర్తుచేశారు. మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రతిపాదించిన గాలేరు- నగరి, హంద్రీ-నీవా ప్రాజెక్టులు ఇప్పటికీ పూర్తి కాలేదన్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన సీఎం ఈ ప్రాజెక్టులను పూర్తి చేయకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. 48 గంటల పాటు రహదారుల దిగ్బంధం చేపట్టిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై కేసులు పెట్టించి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని విరుచుకుపడ్డారు.

వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సమైక్యవాదానికి కట్టుబడి ఉన్నారని తెలిపారు. ఇందు లో భాగంగానే ఈనెల 16 నుంచి దేశ వ్యాప్తం గా ఆయన పర్యటించి, అన్ని జాతీయ పార్టీల నాయకులను కలుసుకుంటారని చెప్పారు. సమైక్య ఉద్యమాన్ని రాష్ట్రపతి గుర్తించాలని కో రారు.  విభజన వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని అభ్యర్థించారు. రాజకీయ పార్టీలు ఒకే తాటిపైకి రావాలనే జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు కు ఆయా పార్టీల నాయకులు స్పందించాలని కోరారు. విభజన బిల్లు శాసనసభకు వస్తే అడ్డుకుంటామని  హామీ ఇచ్చారు. యూపీఏ ఇస్తున్న ప్యాకేజీలు సీమాంధ్రలో అమలవుతాయనే నమకం ఏముందని ప్రశ్నించారు.
 

>
మరిన్ని వార్తలు