నేను మాట తప్పలేను: వైఎస్ జగన్

22 May, 2014 08:51 IST|Sakshi

' అందుకే అబద్ధపు హామీలు ఇవ్వలేదు
' వైఎస్సార్ సీపీ తొలి శాసనసభా పక్ష భేటీలో జగన్ స్పష్టీకరణ
' సాధ్యంకాని హామీలిచ్చిన బాబు బండారం త్వరలోనే బయటపడుతుంది
' ఈ ఎన్నికల్లో గెలుపు ఓటముల మధ్య తేడా ఐదు లక్షల అరవై వేల ఓట్లు మాత్రమే
' బాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు
' మా ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి టీడీ పీలోకి రమ్మని కోరుతున్నారు

 
 ఈ ఎన్నికల్లో గెలుపు ఓటముల మధ్య తేడా ఐదు లక్షల అరవై వేల ఓట్లు మాత్రమే. అంటే 1.90 శాతం తక్కువ ఓట్లతో మాత్రమే మనం ఓడిపోయాం. అయినా 45 శాతం ఓట్లను మనం సాధించాం. టీడీపీ, బీజేపీ కలిసిపోవడం, టీడీపీ అబద్ధపు హామీలు, నరేంద్ర మోడీ గాలి అన్నీ కలిపితే ప్రత్యర్థులు అధికంగా సాధించింది ఈ ఐదు లక్షల అరవై వేల ఓట్లు మాత్రమే. నేను కడప లోక్‌సభ ఉప ఎన్నికల్లో పోటీ చేసినపుడు నాకు వచ్చిన ఐదు లక్షల నలభై ఐదు వేల ఓట్ల మెజార్టీకి ఈ తేడా సమానం. దొంగహామీలు ఇచ్చి ఉంటే ఆ తేడాను అధిగమించడం ఏమంత కష్టమయ్యేది కాదు. కానీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోపే ప్రతి రైతన్న తిట్టే పరిస్థితి వచ్చేది.’’                - వైఎస్ జగన్
 
 ఇడుపులపాయ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ఆచరణ సాధ్యంకాని హామీలిచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి బండారం త్వరలో బయటపడుతుందని, ఆయనను ప్రజలు ఛీకొట్టే రోజు వస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల నాటికి సీమాంధ్రలోని 175 అసెంబ్లీ స్థానాల్లో పది స్థానాలు కూడా దక్కని అధ్వాన పరిస్థితుల్లోకి టీడీపీని నెట్టి వేయాలని, అందుకోసం ఇప్పటి నుంచే పార్టీ నేతలు, కార్యకర్తలంతా కలిసికట్టుగా ఐకమత్యంగా ప్రజా పోరాటాలు చేయాలని పార్టీ ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు.

బుధవారం ఇడుపులపాయలో వైఎస్సార్ కాంగ్రె స్ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతరం ఆయన ఎమ్మెల్యేలనుద్దేశించి ప్రసంగించారు. శాసనసభాపక్ష నేతగా తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ఎమ్మెల్యేలందరికీ శిరస్సు వంచి, చేతులు జోడించి కృతజ్ఞతలు తెలుపుకొంటున్నానని జగన్ అన్నారు. ‘‘చంద్రబాబులా ప్రజలకు దొంగ హామీలు ఇచ్చి ఉంటే నేను ఇవాళ ముఖ్యమంత్రిని అయ్యేవాడిని. కానీ నేనలా చేయలేదు. ఎందుకంటే నేను రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత అనే రెండు పదాలకు కట్టుబడి ఉండే వ్యక్తిని. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేకపోతే ప్రజల మాట అటుంచండి.. సొంత భార్యకు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి తలెత్తుతుంది. ఆ పరిస్థితి నేను తెచ్చుకోలేను’’ అని ఆయన స్పష్టంచేశారు.
 
 నేను సీఎం కావాలనుకోవడానికి ఓ ఉద్దేశం ఉంది
 ‘‘నేను ముఖ్యమంత్రి కావాలనుకోవడానికి ఓ ఉద్దేశం ఉంది. ఈ రోజు మా నాన్న దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఫొటో ప్రతి ఇంట్లో ఎలాగైతే ఉందో నేను మరణించిన తరువాత కూడా ఆయన ఫొటో పక్కన నా ఫొటో కూడా ఉండాలనే భావన నాలో ఉంది. అందుకే విశ్వసనీయత, విలువలతో కూడిన రాజకీయాలు చేయదల్చుకున్నాను’’ అని జగన్ స్పష్టంచేశారు. ఈ ఎన్నికల్లో తాను అధికారంలోకి వస్తాననే పూర్తి నమ్మకం, విశ్వాసంతో ఉండే వాడినని, ఎందుకంటే గత నాలుగేళ్లుగా ప్రజల తరఫున జరిగిన అన్ని పోరాటాల్లోనూ తాను ముందు నిలిచానని ఆయన గుర్తుచేశారు.
 
చేనేత కార్మికుల మరణాలు సంభవించినా, రైతన్నలు క్రాప్ హాలిడే (పంటల విరామం) ప్రకటించినా, విద్యార్థుల ఫీజుల చెల్లింపు సమస్యలున్నా అక్కడ తానే కనిపించానుతప్ప టీడీపీ అధినేత చంద్రబాబు ఎక్కడా కనిపించలేదన్నారు. ప్రజల తరఫున నిరాహార దీక్షలు జరిగితే అక్కడ జగనే కనిపించారు తప్ప చంద్రబాబు కనిపించలేదని గుర్తుచేశారు. ‘‘ముమ్మడివరం నియోజకవర్గంలో మత్స్యకారుల ఇళ్లు కాలిపోతే అక్కడికి జగన్ వెళ్లి పరామర్శించాడు తప్ప మరెవరూ వెళ్లలేదు. ప్రతి పేదవాడి విశ్వాసం మనపై ఉంది కనుక అధికారంలోకి వస్తామనుకున్నాను. కానీ, దేవుడు ఇంకా ఆలస్యం చేయాలనుకున్నాడేమో అందుకే సాధ్యం కాలేదు. దేవుడు ఎప్పుడూ తప్పుచేయడు’’ అని అన్నారు.
 
 ఆ రోజులు నాకింకా గుర్తున్నాయి
 తన రాజకీయ ప్రస్థానంలో తిరిగిన ఒక్కొక్క మలుపును జగన్ గుర్తు చేసుకున్నారు. తన తండ్రి మరణించినపుడు తాను ఏ ఒక్కరినీ అడక్కపోయినా 152 మంది ఎమ్మెల్యేలు తనను ముఖ్యమంత్రిని చేయాలని సోనియా గాంధీకి వినతిపత్రం ఇచ్చారని, ఆ రోజు తనకు ఇంకా గుర్తుందని ఆయన అన్నారు. విలువలకోసం, మాట కోసం కాంగ్రెస్ పార్టీని వీడి తాను, తన తల్లి విజయమ్మ బయటకువచ్చిన రోజు కూడా తనకు గుర్తుందన్నారు. పార్టీని వీడి తన తండ్రి సమాధి వద్దకు వచ్చిన రోజున ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి ఇద్దరూ తామూ వెంట వస్తామని తనను అడిగిన రోజు కూడా గుర్తుందన్నారు.
 
  ‘‘కాంగ్రెస్ పార్టీ ఇంకా నాలుగేళ్లపాటు అధికారంలో ఉంటుందని, ఈ క్రమంలో తనను తెరమరుగు చేయడానికి పన్నాగం పన్నుతుందని ఎందరో చెప్పారు. ‘కొండను ఢీకొంటున్నావు.. నిన్ను సర్వనాశనం చేస్తారు’ అని హెచ్చరించిన వారు కూడా ఉన్నారు. ఆ సమయంలో.. మాటకు కట్టుబడాల్సిన అవసరం లేదని మెదడు చెప్పింది. గుండె మాత్రం విలువలకు కట్టుబడి ఉండాలని, విశ్వసనీయతతో రాజకీయాలు చేయాలని చెప్పింది. నేను మాత్రం మెదడు మాట వినకుండా గుండె చెప్పిందే విని ముందుకు వెళ్లడానికే నిర్ణయించుకున్నాను’’ అని జగన్ గుర్తుచేసుకున్నారు.
 
 నాన్నా కొండను ఢీకొంటున్నాను
 ‘‘నేను కాంగ్రెస్ పార్టీని వదిలి వచ్చి నా తండ్రి సమాధి వద్ద ప్రార్థించినపుడు ‘నాన్నా నీవు దేవుడు దగ్గర ఉన్నావు. నేనిక్కడ కొండను ఢీకొంటున్నాను. నా తరఫున నీవు దేవుని దగ్గర ప్రాధేయపడి దేవుడి దయ, ఆయన కరుణ నాపై ఉండేటట్లు చూడు.. నా రాజకీయం తెరమరుగు అయ్యే విధంగా కాకుండా నేను రాజకీయాన్ని శాసించే స్థాయికి తీసుకువెళ్ల’మని ప్రార్థించాను. ఆ రోజునుంచి ఈరోజుటి వరకు పోరాటం చేస్తూనే ఉన్నాను’’ అని జగన్ ఆవేదనతో అన్నారు. ‘‘ఆ తర్వాత వరుసగా కాంగ్రెస్, టీడీపీ కుట్రలు చేశాయి.. సీబీఐని అడ్డం పెట్టుకుని కోర్టులను తప్పుదోవ పట్టించడానికి యత్నించాయి.
 
 నాపై కుట్ర పన్నారు. నన్ను 16 నెలలపాటు జైలులో పెట్టారు. ఇక్కడ చంద్రబాబుకు ఒక న్యాయం, నాకు మాత్రం మరో న్యాయం జరిగింది. మమ్మల్ని సర్వనాశనం చేయాలని అప్పటి నుంచి చూస్తున్నారు. అయినా కూడా మమ్మల్ని ఏమీ చేయలేకపోయారు. ఆ రోజున నేను, మా అమ్మ ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యేగా బయటకు వస్తే, తదుపరి జరిగిన ఉప ఎన్నికల్లో దేవుడు మా బలాన్ని ఇద్దరు ఎంపీలు, 17 మంది ఎమ్మెల్యేలకు పెంచాడు. ఆ తర్వాత ఇప్పుడు తొమ్మిది మంది ఎంపీలు, 70 మంది ఎమ్మెల్యేలకు పెరిగాం. దేవుడు ఎప్పుడు మా బలాన్ని హెచ్చిస్తూనే పోయాడు’’ అని జగన్ అన్నారు.
 
 మోడీని కలిస్తే వక్రీకరణలా!
 తాను మోడీని కలసి రాష్ట్ర ప్రయోజనాల కోసం వినతిపత్రం సమర్పించిన విషయంపై కూడా మీడియా, టీడీపీ వక్రీకరణలు చేస్తున్నాయని జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారం చేయగానే బడ్జెట్ సమావేశాలు మొదలవుతాయి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాష్ట్ర విభజన సందర్భంగా రాష్ట్రానికి అనేక హామీలు ఇచ్చారు. ఆ హామీలు వేటికీ బడ్జెట్ కేటాయింపులు లేవు. చట్టబద్ధత లేదు. అందువల్ల నేను మోడీని కలసి మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలకు చట్టబద్ధత కావాలని అడిగాను. సింగరేణి కాలరీస్‌లో మనకు వాటా ఏమీ లేనందున కేజీ బేసిన్‌లో లభ్యమయ్యే గ్యాస్ నుంచి కేంద్రం వాటాను మనకు ఇవ్వాల్సిందిగా కోరాను. రాష్ట్రానికి 15 ఏళ్లపాటు ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వాలని కోరాను. ఇందులో తప్పేమిటి? కానీ, నాపై టీడీపీ, మీడియా అభాండాలు వేస్తున్నాయి.
 
 ఈరోజు పోరాటం జరుగుతున్నది మనకూ, చంద్రబాబుకూ మధ్య మాత్రమే కాదు. మనకు, టీవీ9, ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలకు మధ్య కూడా. ఈ పోరాటం మున్ముందు కూడా కొనసాగుతుంది. మనం ఏం చేసినా వాళ్లు వక్రీకరిస్తూనే ఉంటారు. బీజేపీకి అంశాల వారీ మద్దతు ఇస్తానన్నా వక్రీకరించడమేనా? అంటే.. ఈ దేశ ప్రయోజనాల కోసం ఎన్డీయే ప్రభుత్వం ఏదైనా మంచి చేస్తే దానిని కూడా వ్యతిరేకించాలా? ఈ వక్రీకరణలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయి. వీటన్నింటినీ తట్టుకుని నిలబడాలి’’ అని జగన్ సూచించారు.
 
 చంద్రబాబు ఫిరాయింపు రాజకీయాలు
 ‘‘చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వారం రోజులకే మైండ్‌గేమ్ ఆడుతున్నారు. వేరే పార్టీ బీ ఫామ్‌పై ఎంపీటీసీలు, జెడ్పీటీసీలుగా ఎన్నికైన వారిని తమ పార్టీలోకి లాక్కోవాలని చూస్తున్నారంటే ఎంత దిగజారి వ్యవహరిస్తున్నారో అర్థమవుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ తర ఫున ఎన్నికైన 30 మంది ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి ప్రలోభపెట్టేందుకు యత్నిస్తున్నారు. ఇదెంత దారుణం? ఓ వైపు మన ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి రమ్మని పిలుస్తూ ఉంటే మరోవైపు ‘ఈనాడు’, ‘ఆంధ్రజ్యోతి’ పత్రికల్లో మాత్రం మన ఎమ్మెల్యేలే చంద్రబాబుతో సంప్రదింపులు జరుపుతూ పార్టీలోకి వస్తామని కోరుతున్నట్లు వార్తలు వస్తాయి. ఎవరెన్ని ఎత్తులు వేసినా మన పార్టీని అణచలేరనే విషయాన్ని ప్రజలకు చెప్పాలి. ఆచరణ సాధ్యంకాని హామీలు నెరవేర్చలేక  చంద్రబాబు ప్రజాదరణను కోల్పోవడం ఖాయం.’’
 - వైఎస్ జగన్

మరిన్ని వార్తలు