ఈవోగా వస్తానని ఊహించలేదు

18 May, 2017 19:25 IST|Sakshi
ఈవోగా వస్తానని ఊహించలేదు

► తిరుమల ఈవో అనిల్ కుమార్ సింఘాల్


తిరుపతి: మొదటి నుంచీ శ్రీవారి సేవకుడినే. 1994లో తొలిసారి స్వామివారిని దర్శించుకున్నా. అప్పటి నుంచీ ఎక్కడున్నా ఏటా స్వామివారి దర్శనానికి తిరుమల వస్తూనే ఉన్నా. అయితే..ఇలా ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా స్వామికి సేవలందించే భాగ్యం, అదృష్టం కలుగుతుందని మాత్రం ఊహించలేదు అని తితిదే ఈవోగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. ఈవో సింఘాల్‌ గురువారం తొలిసారి తిరుపతి పాత్రికేయులతో వివిధ ముఖ్యాంశాలపై ముచ్చటించారు.

శ్రీవారి ప్రాశస్త్యం, భక్తులకు వసతులు, ప్రసాదాల పంపిణీ, యాత్రికులకు కల్పించే మెరుగైన సదుపాయాలు, రుయా, స్విమ్స్‌ ఆస్పత్రుల్లో రోగులకు లభించే వైద్య సేవలపై చర్చించారు. ప్రభుత్వ ఆదేశాలకు లోబడి టీటీడీ బోర్డు నిర్ణయాలను గౌరవిస్తూ భక్తులకు సంతృప్తికర దర్శనం కలిగించడమే తన ముందున్న లక్ష్యంగా ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ పేర్కొన్నారు. తాను తితిదేలో బాధ్యతలు చేపట్టేందుకు కాలినడకన తిరుమల చేరుకుని సాధారణ క్యూ లైన్లో దర్శనం చేసుకున్నాననీ, దీనివల్ల భక్తుల యాతనలు, అభిప్రాయాలు స్వయంగా తెల్సుకునే వీలు కలిగిందన్నారు. దివ్యాంగులు, వయో వృద్ధులకు వెంటనే శ్రీవారి దర్శనం జరిగేలా కౌంటర్ల పనివేళల్లో మార్పులు తెచ్చి ఏర్పాట్లు చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. ఇందుకోసం సాఫ్ట్‌వేర్‌లో మార్పులకు సిఫార్సు చేశామన్నారు. తనకన్నా ముందు పనిచేసిన ఈవోలందరూ టీటీడీ వృద్ధికి ఎంతో చేశారనీ, మిగిలిన పనులను పరిశీలించి భక్తులకు ప్రయోజనకరమని భావిస్తే వాటిని పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు.

నిర్మాణ దశలో ఆగిపోయిన భవనాల పనులను పూర్తి చేయిస్తామన్నారు.  తిరుపతి, తిరుమల వేర్వేరు కాదనీ, రెండు చోట్లా అభివృద్ధి జరగాలని అభిప్రాయపడ్డారు. దేశవిదేశాలు, సుదూర ప్రాంతాల నుంచి తిరుపతి చేరుకునే యాత్రికులకు బస్టాండ్, రైల్వేస్టేషన్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక మరుగుదొడ్లు, రవాణా సదుపాయాలు కల్పించే విషయంపై యోచిస్తున్నామన్నారు. స్విమ్స్, రుయా ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందేలా పర్యవేక్షణ పెంచుతామని హామీ ఇచ్చారు.

ఇష్టపడి ఆంధ్రా కేడర్‌కు...
రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ కేడర్‌కు వెళ్లాననీ, తర్వాత అడిగి మరీ ఆంధ్రాకు వచ్చినట్లు తెలిపారు. మొదట ఉట్నూరు, కోట రామచంద్రాపురం ఐటీడీఏలకు పీవోగా పనిచేసిన అనుభవం ఉందనీ, పరిపాలనతో కూడిన విధులకు, ఆధ్యాత్మిక భావన నిండిన తిరుమల ఈవో విధులకు పెద్ద తేడా ఏమీ ఉండదని చెప్పారు. ఐఐటీ కాన్పూర్‌లో బీటెక్‌ పూర్తి చేసిన తాను 1993లో ఐఏఎస్‌లో రెండో ర్యాంక్‌ సాధించి సివిల్‌ సర్వీస్‌కు ఎంపికయ్యానని ఈవో అనిల్ కుమార్ తెలిపారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా