సమస్యలతో నిద్రలేని రాత్రులెన్నో గడిపా: స్పీకర్

24 May, 2014 00:35 IST|Sakshi
సమస్యలతో నిద్రలేని రాత్రులెన్నో గడిపా: స్పీకర్

సాక్షి, హైదరాబాద్: దేశంలో ఎవరూ ఊహించని ఎన్నో సమస్యలను 13వ శాసనసభ చవిచూసిందని శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అన్నారు. వీటిని అధిగమించడం కోసం తాను నిద్రలేని రాత్రులెన్నో గడిపానని చెప్పారు. అసెంబ్లీ కమిటీ హాలులో శుక్రవారం అసెంబ్లీ సచివాలయ సిబ్బంది స్పీకర్‌కు వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాదెండ్ల మాట్లాడుతూ ‘ఎక్కడాలేని, ఎవరూ ఊహించని సమస్యలెన్నో 13వ శాసనసభకు ఎదురయ్యాయి. వీటిని అధిగమించేందుకు చాలా రోజులు నిద్రపట్టలేదు. అర్ధరాత్రివరకు ఆయా సమస్యలపై చర్చించేవాడిని. ఒక్కోసారి సమస్యలను పరిష్కరించగలుగుతామా? అనే భావన కూడా వచ్చేది. అంతిమంగా స్పీకర్ కుర్చీలో కూర్చొనే సమయానికి ఏ చిన్నపొరపాటు కూడా జరగకూడదని భావించేవాడిని. అందరి సహకారంతో వాటన్నింటినీ అధిగమించాను’అని ఆయన పేర్కొన్నారు.
 
 ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను సభలో ప్రవేశపెట్టగలగడం తనకు గర్వకారణమన్నారు.  శాసనసభ సంక్షేమ, శాఖల వారీ కమిటీల ద్వారా ప్రజలకు న్యాయం జరిగేలా  ఎమ్మెల్యేలకు జాగ్రత్తగా సలహాలు ఇవ్వాలని అసెంబ్లీ సచివాలయ సిబ్బందిని ఆయన కోరారు. శాసనసభ కమిటీలు చాలా వరకు ఢిల్లీ, ముంబయి వంటి చోట్ల అనవసరంగా పర్యటనలు చేస్తున్నాయని అభిప్రాయపడ్డారు. దానికి బదులుగా జిల్లాల్లో పర్యటిస్తే ప్రజల సమస్యలు తెలుస్తాయని, తద్వారా పరిష్కారమార్గాలు కనుగొనడం సులువు అవుతుందన్నారు. ఈ ఉద్దేశంతోనే కొన్ని కమిటీలు ఇతర రాష్ట్రాల్లో పర్యటిస్తామని ప్రతిపాదనలు పంపితే వాటి ని అనుమతించలేదన్నారు.

మరిన్ని వార్తలు