‘అమ్మమ్మ డాట్ కామ్’తో పేరొచ్చింది

8 Sep, 2014 14:30 IST|Sakshi
‘అమ్మమ్మ డాట్ కామ్’తో పేరొచ్చింది

పాలకొల్లు : ‘అమ్మమ్మ డాట్ కామ్’ సీరియల్‌తో తనకు మంచి పేరొచ్చిందని.. బుల్లితెర రంగంలో స్థిరపడగలిగానని నటుడు మంత్రిప్రగడ నాగరవిశంకర్ అన్నారు. మంచిని స్వాగతిస్తూ ప్రేక్షకాదరణ లభించే పాత్రలు చేయడమే లక్ష్యమని చెప్పారు. దాసరి నారాయణరావు సారథ్యంలో కాపుగంటి రాజేంద్ర దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘గోకులంలో సీత’ సీరియల్‌లో హీరోగా నటిస్తున్న ఆయన పాలకొల్లులో విలేకరులతో ముచ్చటించారు.
 
ప్రశ్న : పరిశ్రమకు ఎలా పరిచయమయ్యారు
రవిశంకర్: 2002 నంది అవార్డుల ప్రదానోత్సవ సభలో అల్లూరి సీతారామరాజు వేషం వేశా. దాంతో సీరియల్‌లో నటించే అవకాశాలు వచ్చాయి.
 
ప్రశ్న : బుల్లితెర నటుడు కావాలని ఎందుకు అనుకున్నారు
రవిశంకర్: నాకు ఎవరూ గాడ్‌ఫాదర్లు లేరు. మాది శ్రీకాకుళం. బీకాం చదువుకున్నా. యాక్టింగ్ నేర్చుకోవాలని 2002లో రూ.10 వేలు పట్టుకుని హైదరాబాద్ వెళ్లా. మీడియా వర్కుషాపు ఆన్ యాక్టింగ్‌లో చేరా. శిక్షణ అనంతరం నెలరోజులే లక్ష్యంగా పెట్టుకున్నా. 30వ రోజు రాత్రి 11 గంటలకు కెమెరా ముందు నిలుచునే అవకాశం వచ్చింది. లేకపోతే వెనక్కి వెళ్లిపోయేవాడిని.
 
ప్రశ్న : డిగ్రీ పూర్తికాగానే ఏమి చేశారు
రవిశంకర్: కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం చేశా. సునామీ డేటా వింగ్‌లో విధులు నిర్వర్తించా.
 
ప్రశ్న : నటించిన తొలి సీరియల్.. గుర్తింపు తెచ్చింది ఏది
రవిశంకర్: అలౌఖిక సీరియల్‌తో బుల్లితెరకు పరిచయమయ్యా. ‘నువ్వువస్తావని’లో నెగిటివ్ రోల్ చేశా. ‘అమ్మమ్మ డాట్ కామ్’తో పేరువచ్చింది.
 
ప్రశ్న : ఇప్పటివరకు ఏయే సీరియల్స్‌లో నటించారు
రవిశంకర్: నిజం-నిజం, అపరాధి, నమ్మలేని నిజాలు, అలౌఖిక, నువ్వువస్తావని, అమ్మమ్మ డాట్ కామ్, ఏడడుగులు, శ్రావణమేఘాలు, లయ, యువ, సావిరహే, ఇట్లు ప్రేమతో అమ్మ.., అభిషేకం, కుంకుమరేఖ, నెం.23 మహాలక్ష్మి నివాసం, చిన్నకోడలు, బంగారు కోడలు, అష్టాచమ్మాలో నటించాను.
 
ప్రశ్న: సినిమా అవకాశాలు
రవిశంకర్: కథ (జెనీలియా ఫేం), స్నేహితుడా (నాని హీరో) సినిమాల్లో నటించాను. సీరియల్స్‌లో బిజీ అవ్వడం వల్ల సినిమా అవకాశాల కోసం ఎదురుచూడలేదు.  ఆర్టిస్టుగా స్థిరపడడానికి కారణమైన సీరియల్ అమ్మమ్మ డాట్ కామ్, లయ, అభిషేకం.

ప్రశ్న : ఏయే అవార్డులు తీసుకున్నారు
రవిశంకర్ :‘అభిషేకం’లో నటనకు వంశీ, ఉగాది, ఆరాధన అవార్డులు, ‘చిన్నకోడలు’లో నటనకు మా టీవీ, జెమినీ టీవీ, ఈటీవీ అవార్డులు అందుకున్నా.

మరిన్ని వార్తలు