ఎదురు కట్నాలు ఇచ్చి మరీ చేసుకుంటారు: బాబు

8 Mar, 2017 14:12 IST|Sakshi
ఎదురు కట్నాలు ఇచ్చి మరీ చేసుకుంటారు: బాబు
విజయవాడ :  మహిళలు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే వారితో ఎవరూ పోటీ పడలేరని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు.  
 
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ బాగా చదువుకుని ఉద్యోగాలు చేస్తే ఎదురు కట్నాలు ఇచ్చి మరీ మహిళలను వివాహం చేసుకుంటారని అన్నారు. ఆర్టీసీలో 33శాతం కండక్టర్లుగా మహిళలు పని చేస్తున్నారని, అవకాశాలు కల్పిస్తే ఎటువంటి కఠినమైన ఉద్యోగాలు అయినా మహిళలు సునాయాసంగా నిర్వర్తించగలరని పేర్కొన్నారు. స్త్రీ,  పురుష సమానత్వంకు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. మహిళలకు ఆస్తి హక్కు కల్పించిన ఘనత ఎన్టీఆర్ దేనని గుర్తుచేశారు.
 
డ్వాక్రా సంఘాలు మరింత బలోపేతం కావాలన్నారు. మహిళలు ఆర్థిక స్వావలంబనను సాధించాలని ఆకాంక్షించారు. వేరే రాష్ట్రాలు ముందుకు రాకపోతే వచ్చే ఏడాది కూడా అమరావతి లోనే మహిళా పార్లమెంటు నిర్వహిస్తామని ప్రకటించారు.  బెజవాడలో పుట్టిన పివి సింధూ ఒలంపిక్‌ లో పతకం సాధించిందని, రాష్ట్రంలో మహిళలకు స్పూర్తిగా నిలిచిందని అన్నారు.  ఈ కార్యక్రమంలో మంత్రులు పీతల సుజాత,  దేవినేని ఉమ,  మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి,  జెడ్పీ చైర్ పర్సన్ గద్దె అనురాధ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు