గంటా ఎత్తు.. బీసీ చిత్తు

4 Apr, 2014 00:45 IST|Sakshi
గంటా ఎత్తు.. బీసీ చిత్తు

విశాఖపట్నం, న్యూస్‌లైన్: విశాఖ తూర్పు, ఉత్తర, దక్షిణ, భీమిలి నియోజకవర్గాల నుంచి నలుగురు ఓసీ అభ్యర్థులను రంగంలోకి దించడం ద్వారా మాజీ మంత్రి గంటా ఎన్నికల వ్యయాన్ని తగ్గించుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఆయా నియోజకవర్గాల్లో సామాజిక వర్గ పరంగా బలంగా తమను దెబ్బతీసేందుకు గంటా కుయుక్తులు పన్నుతున్నట్లు ఆ పార్టీ బీసీ వర్గాలు  ఆరోపిస్తున్నాయి.

ఈమేరకు ఎంవీవీ ఎస్ మూర్తి, నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణలతో గంటా లోపాయికారి ఒప్పం దం కుదుర్చుకొని జాబితాను రూపొందించారని తెలిసింది. ఉత్తరం, దక్షిణం, భీమిలి నియోజకవర్గాల నుంచి ఎక్కువమంది బీసీ అభ్యర్థులు టికెట్లు ఆశిస్తున్నారని, వీరిలో ఏ ఒక్కరికి టికెట్ కేటాయించిన మిగిలిన వారు వ్యతిరేకంగా పనిచేసే అవకాశముందనే సాకుతో ఓసీలకు కేటాయిస్తే ఇబ్బందులు తలెత్తకుండా పార్టీ విజయానికి మేలు జరుగుతుందని చంద్రబాబును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని బీసీ నేతలే బాహాటంగా అంటున్నారు. దీనిపై బీసీ నేతలు  గంటా తీరుపై గరంగరంగా ఉన్నారు.

ఉత్తరంలో పంచకర్లకు టికెట్ ఇప్పించే క్రమంలో బీసీ సామాజికవర్గ నేతలైన భరణికాన, పైలా ముత్యాల నాయుడులకు ప్రాతినిథ్యం దక్కకుండా పావులు కదుపుతున్నారని భోగట్టా. అలాగే దక్షిణ ంలో వాసుపల్లికి బీజేపీ పొత్తును సాకుగా చూపి  ఓసీ అభ్యర్థి సీమాంధ్ర బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబును, లేని పక్షంలో చివరగా ఎంవీవీ ఎస్ మూర్తిని గాని పోటీ లో నిలిపేందుకు రంగాన్ని సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.

బీసీ నేతల మధ్య అనైక్యతను చూపుతూ భీమిలి నుంచి తన సామాజిక వర్గానికి చెందిన  ధనబలమున్న అవంతి శ్రీనివాస్‌ను, తూర్పు నుంచి వెలగపూడి రామకృష్ణబాబులకు టికెట్లు ఖరారు చేసేందుకు ప్రణాళికను రూపొందించినట్లు తెలిసింది. లోక్‌సభ పరిధిలోని పశ్చిమం, గాజువాక, పెందుర్తి, ఎస్.కోట నియోజకవర్గాల్లో కూడా ఒకటి రెండు చోట్ల ఆర్థిక  స్తోమత ఉన్న  ఓసీలకు సీట్లు ఇప్పించేందుకు ఈ మాజీమంత్రి యత్నిస్తున్నట్లు తెలిసింది.
 

మరిన్ని వార్తలు