సాగు సంబరం

24 Oct, 2019 13:19 IST|Sakshi
ఐఏబీ సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి అనిల్, వేదికపై మంత్రి గౌతమ్, కలెక్టర్‌ శేషగిరిబాబు, ఇరిగేషన్‌ ఎస్‌ఈ ప్రసాద్‌బాబు

జిల్లాలో అందుబాటులో 118.75 టీఎంసీల నీరు

రబీ సీజన్‌కు ముందుగానే 15.11 టీఎంసీల విడుదల

కండలేరు నుంచి చెన్నైకి 4 టీఎంసీలు  

రాష్ట్ర వాటా 3.6 టీఎంసీలకు మించి సరఫరా

కాలువల వారీగా నీటి కేటాయింపుల వివరాలు ప్రకటించిన మంత్రి అనిల్‌  

నేటి నుంచి రబీకి నీరు విడుదల

రెండో పంటకు కూడా సాగునీరు పుష్కలం

జిల్లాలో వ్యవసాయ సాగు సంబరం నెలకొంది. గడిచిన ఐదేళ్లలో తొలి పంటకే సాగునీటికి కటకటలాడిన పరిస్థితులు. అరకొర విస్తీర్ణానికే ఐఏబీలో నీటి కేటాయింపులు. మొదటి పంటపైనే ఆశలు లేని పరిస్థితులకు భిన్నంగా ఈ ఏడాది రబీ, వచ్చే ఏడాది ముందస్తు ఖరీఫ్‌కు సైతం సాగు నీరు విడుదల చేస్తామని పాలకులు, అధికారులు ప్రకటించడంతో అన్నదాతల్లో ఆనందం తాండవం ఆడుతోంది. జిల్లాలోని ప్రధాన జలాశయాల్లో వర్షాల సీజన్‌కు ముందే నీరు పుష్కలంగా ఉండడంతోపాటు, చెరువుల్లో జలకళ తొణికిసలాడుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం జరిగిన ఐఏబీ సమావేశంలో కాలువల వారీగా నీటి కేటాయింపులు వెల్లడించారు.   

సాక్షి ప్రతినిధి, నెల్లూరు:  జిల్లా రైతాంగ చరిత్రలో ఇది చారిత్రాత్మకం. వర్షాలకు ముందే జిల్లాలో ప్రధాన జలాశయాలతో పాటు చెరువులు, రిజర్వాయర్లలో 118.75 టీఎంసీలు ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో సాగునీటి అవసరాలను తీర్చేందుకు పక్కా ప్రణాళికలతో పాలకులు, అధికారులు సంసిద్ధంగా ఉన్నారు. రబీ సీజన్‌ కంటే దాదాపు 60 రోజుల ముందు నుంచే జిల్లాలోని ప్రధాన చెరువులు, కాలువలకు నీరు విడుదల చేశారు. ఏటా జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం తర్వాత నీటి లభ్యతను బట్టి లెక్కలు అంచనాలు వేసి నీటి కేటాయింపులు జరిగేవి. కానీ ఈ పర్యాయం దీనికి పూర్తి భిన్నంగా చివరి ఆయకట్టు వరకు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రస్తుత రబీ సీజన్‌కు జిల్లాలో 8.23 లక్షల ఎకరాలకు నీరు అందించడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించి ఆ మేరకు నీటి కేటాయింపుల వివరాలను వెల్లడించారు. రబీ సీజన్‌ కోసం నీరు విడుదల చేసిన తర్వాత కూడా రిజర్వాయర్లలో నీరు భారీగా ఉండే పరిస్థితి ఉండటంతో రెండో పంటకు కూడా నీరు ఇస్తామని ఇప్పుడే ప్రకటించారు. ఇక పొరుగు రాష్ట్రం చెన్నైకు నీటి హక్కుగా విడుదల చేయాల్సిన దాని కంటే 40 వేల క్యూసెక్కుల నీరు అదనంగా విడుదల చేసిన పరిస్థితి ఈ ప్రభుత్వానిదన్నారు. గడిచిన 15 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మొదటి సారి రబీ సీజన్‌ కంటే ముందుగానే జిల్లాలో రెండు రిజర్వాయర్లలో నీటితో పాటు ఇప్పటి వరకు చెరువులు, కాలువలు, తాగునీటి అవసరాల అన్నింటికి కేటాంపులతో కలిపి 118.75 టీఎంసీల నీరు ఉంది. 

కరుణించిన వరుణుడు..కలిసొచ్చిన వరదలు
రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొద్ది నెలల క్రితమే కొలువు తీరింది. వరుణుడు కరుణించడంతో ఎగువ ప్రాంతాల్లో బాగా వర్షాలు పడి వరదలు వచ్చి సోమశిలకు భారీగా ఇన్‌ఫ్లో చేరింది. జిల్లా చరిత్రలో గతంలో లేని విధంగా కేవలం 4 నెలల వ్యవధిలో సుమారు 100 టీఎంసీల నీరు జిల్లాలోని జలాశయాలు, జలవనరులకు చేరాయి. బుధవారం జిల్లా కలెక్టర్‌ ఎంవీ శేషగిరిబాబు అధ్యక్షతన జరిగిన జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం ప్రజాప్రతిని«ధులు రైతాంగం తరఫున ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్‌ పి.అనిల్‌ కుమార్‌యాదవ్‌ కూడా జిల్లాకు చెందిన వ్యక్తే కావడంతో చివరి ఆయకట్టు వరకు నీటిని ఇవ్వాలనే యోచనతో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగారు. గత జూన్‌ 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు సోమశిలకు 118.75 టీఎంసీల నీరు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చింది. జూన్‌ మొదటి వారం ముందు వరకు పూర్తిగా డెడ్‌ స్టోరేజీ స్థాయి దాటి తక్కువ నీరు రిజర్వాయర్‌లో నిల్వ ఉంది. తాగునీటి ఇబ్బందులతో పాటు జిల్లాలో వందలాది చెరువులు, ప్రధాన కాలువలు ఎండిపోయిన పరిస్థితి. ఈ ఏడాది వర్షాలు కొంత ఆశాజనకంగా ఉండడంతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి లక్షల  క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా రావడంతో రబీ సీజన్‌ కంటే అరవై రోజులు ముందుగానే నీరు విడుదల చేయడం ప్రారంభించారు. ఇప్పటి వరకు సోమశిల వచ్చిన 118.75 టీఎంసీల నీటిలో రబీతో నిమిత్తం లేకుండా 15.11 టీఎంసీల నీటిని విడుదల చేశారు. నెల్లూరు నగర తాగునీటి అవసరాలకు 1.88 టీఎంసీలు, రాళ్లపాడు కెనాల్, నార్త్‌ ఫీడర్‌ కెనాల్‌కు 1.99 టీఎంసీలు, సౌత్‌ ఫీడర్‌ కెనాల్‌కు 0.6 టీఎంసీలు, కావలి కెనాల్‌కు 1.89 టీఎంసీలు, కనిగిరి, కనుపూరు, సంగం, పెన్నా బ్యారేజీలకు 9.7 టీఎంసీల నీటిని విడుదల చేశారు. రాష్ట్ర విభజనకు ముందు చెన్నైకు ఏటా కండలేరు నుంచి 5 టీఎంసీల నీటిని విడుదల చేయాలి. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రా వాటా 3.6 టీఎంసీలు, తెలంగాణ వాటా 1.4 టీఎంసీలు, కర్ణాటక, మహరాష్ట్ర కలిపి 7 టీఎంసీలు విడుదల చేయాలి. రాష్ట్ర వాటా 3.6 టీఎంసీలే అయినప్పటికీ నీటి లభ్యత బాగా ఉండడం, ఆ రాష్ట్ర ప్రతినిధుల వినతితో 4 టీఎంసీలకు పైగా నీటిని చెన్నై తాగునీటి అవసరాలకు కేటాయించారు. ప్రస్తుతం సోమశిలలో 72 టీఎంసీలు కండలేరులో 32.18 టీఎంసీల నీరు రిజర్వాయర్లలో నిల్వ ఉంది. దీంతో జిల్లాలో డెల్టాతో పాటు మెట్ట ప్రాంతాలకు సాగు నీరు ఇవ్వడానికి ఎలాంటి ఇబ్బందులు లేవు.  

ప్రజాప్రతినిధులంతా ఏకీభావం
బుధవారం జరిగిన జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశంలో జలవనరుల శాఖ మంత్రి పి.అనిల్‌కుమార్‌యాదవ్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డితో పాటు ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, మేకపాటి చంద్ర శేఖర్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, వెలగపల్లి వరప్రసాద్, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నీటి కేటాయింపులు, చివరి ఆయకట్టు వరకు నీరు అందించే పరిస్థితి ఉండటంతో సమావేశం పూర్తిగా ప్రశాంతంగా ముగిసింది. సమావేశంలో చర్చించిన అంశాలపై ప్రజాప్రతినిధులందరూ ఏకీభవించారు.

మరిన్ని వార్తలు