క్రాస్‌బౌ–18 విజయవంతం 

14 Dec, 2018 00:54 IST|Sakshi

సూర్యలంకలో ముగిసిన క్షిపణి ప్రయోగ విన్యాసాలు 

విశాఖ సిటీ: క్రాస్‌బౌ–2018 పేరుతో భారత వైమానిక దళం నిర్వహించిన క్షిపణి ప్రయోగ విన్యాసాలు గురువారంతో ముగిశాయి. గుంటూరు జిల్లా సూర్యలంకలోని ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో ఈ నెల 3 నుంచి క్రాస్‌ బౌ విన్యాసాలు మొదలయ్యాయి. సదరన్‌ ఎయిర్‌ కమాండ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన క్షిపణి విన్యాసాల్లో ముఖ్య అతిథులుగా భారత వైమానిక దళాధిపతి బీరేందర్‌ సింగ్‌ ధనోవా, సదరన్‌ ఎయిర్‌ కమాండ్‌ కమాండింగ్‌ ఇన్‌ చీఫ్‌ ఎయిర్‌ మార్షన్‌ బి.సురేష్‌ పాల్గొన్నారు.

ఉపరితలంపై నుంచి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఆకాష్, స్పైడర్, ఒసా–ఎక్‌–ఎం, ఐజీఎల్‌ఏ మొదలైన క్షిపణులను విజయవంతంగా విన్యాసాల్లో పరీక్షించారు. భూ ఉపరితలం నుంచి గాలిలో ఉన్న శత్రు లక్ష్యాల్ని ఛేదించే ప్రయోగం విజయవంతమయ్యింది. రాత్రి సమయంలో ప్రత్యక్ష ఫైరింగ్‌ విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎస్‌.యూ–30 ఫైటర్‌ జెట్‌ ఈ విన్యాసాల్లో పాల్గొంది. ఈ విన్యాసాల ద్వారా భారత వాయుదళాల మార్గదర్శక వ్యవస్థలు, అంతర్గత ఎయిర్‌ కమాండ్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ సామర్థ్యాలను పరీక్షించారు.  
 

మరిన్ని వార్తలు