మానవత్వాన్ని చాటిన సబ్‌ కలెక్టర్‌

18 Jan, 2019 13:11 IST|Sakshi
సబ్‌ కలెక్టర్‌ కారులో ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన క్షతగాత్రులు

క్షతగాత్రులను తన కారులో ఆస్పత్రికి తరలించిన యువ ఐఏఎస్‌

గుంటూరు, గన్నవరం : రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన క్షతగాత్రులను అటుగా వస్తున్న ఓ యువ ఐఏఎస్‌ అధికారి సకాలంలో స్పందించి తన వాహనంలో ఆస్పత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ ఘటన మండలంలోని గొల్లనపల్లి వద్ద గురువారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని పురుషోత్తపట్నం గ్రామానికి చెందిన వేమూరి రామకోటయ్య (29) ఆగిరిపల్లి నుంచి ఐదు నెలల గర్భిణీ అయినా తన భార్య వరలక్ష్మి (23), మూడేళ్ల కుమారైతో కలిసి బైక్‌పై ఇంటికి బయలుదేరాడు. మార్గమధ్యలో గొల్లనపల్లి రైస్‌ మిల్లు వద్ద నాలుగు రోడ్ల కూడలిలో అతి వేగంగా వచ్చిన మరో బైక్‌ వీరిని ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో రామకోటయ్య, వరలక్ష్మికి తీవ్ర గాయాలు కాగా వారి కుమారైకు స్వల్ప గాయాలయ్యాయి. అదే సమయంలో విజయవాడ నుంచి గన్నవరం మీదుగా నూజివీడు వెళ్తున్న సబ్‌ కలెక్టర్‌ స్నపిల్‌ దినకర్‌ రోడ్డుపై పడి ఉన్న క్షతగాత్రులను గమనించి తన సిబ్బందితో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. గాయాలతో బాధపడుతున్న క్షతగాత్రులను సబ్‌ కలెక్టర్‌ తన కారులోనే గన్నవరం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం వారిని 108 అంబులెన్స్‌లో విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సరైన సమయంలో స్పందించి క్షతగాత్రులపై మానవత్వం చూపిన సబ్‌ కలెక్టర్‌ చర్యలను పలువురు అభినందించారు. 

మరిన్ని వార్తలు