మోడీ వచ్చాకే ఐఏఎస్‌ల పంపిణీ

18 May, 2014 02:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ల పంపిణీ మార్గదర్శకాలకు ఆమోదం తెలిపేందుకు ప్రధాని మన్మోహన్ నిరాకరించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందడం, ప్రధానమంత్రి పదవికి కూడా రాజీనామా చేసినందున ఈ ఫైలుపై సంతకం చేయడానికి మన్మోహన్ నిరాకరించినట్లు ఉన్నతస్థాయివర్గాలు తెలిపాయి. దీంతో  మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాతగానీ విభజన మార్గదర్శకాలకు మోక్షం లభించదని ఆ వర్గాలు చెప్పాయి. అఖిల భారత సర్వీసు అధికారుల పంపిణీ మార్గదర్శకాలను ప్రత్యూష సిన్హా కమిటీ ఖరారు చేసింది. ఏ రాష్ట్రానికి ప్రాధాన్యత ఇస్తారు లేదా ఇరు రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇస్తారా అని అధికారుల నుంచి డిక్లరేషన్లను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. రాష్ట్ర కేడర్‌కు చెందిన అఖిల భారత సర్వీసు అధికారులందరూ ప్రాధాన్యతలను తెలియజేస్తూ సీల్డ్ కవర్లను ప్రభుత్వానికి పంపారు.
 

మరిన్ని వార్తలు