ఈ పాపం ఎవరిది?

5 Oct, 2018 13:18 IST|Sakshi
దిక్కులేని వారైన ముగ్గురు బాలికలు

కన్నెత్తి చూడని ఐసీడీఎస్‌ అధికారులు

తెలియదంటున్న ఆరోగ్యశాఖ సిబ్బంది

ఆకలికి అలమటిస్తున్న పిల్లలు

నెల్లూరు, పొదలకూరు: అసలే పేదరికం. భార్యాభర్తలు దివ్యాంగులు. ముగ్గురు ఆడ పిల్లలకు జన్మనిచ్చారు. నాలుగో సంతానం మగబిడ్డ కావాలనుకుని గర్భం దాల్చడమే ఆ కుటుంబం పాలిట శాపంగా మారింది. ఏడో నెలలో పౌష్టికాహార లోపం వల్ల బిడ్డ కడుపులోనే మృతి చెందగా, తల్లి చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. దీంతో ముగ్గురు ఆడ పిల్లలు దిక్కులేని వారయ్యారు. ప్రభుత్వం గర్భిణి, బాలింత, పురిటి బిడ్డలను స్త్రీ, శిశు సంక్షేమశాఖ ద్వారా ఆదుకుంటున్నామని, శిశు మరణాలను గణనీయంగా తగ్గిస్తున్నామని ఊదరగొట్టుకుంటోంది.  స్త్రీ, శిశు మరణం నెలకొన్నా ఒక్క అధికారి సైతం అటు వైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు.

ఆకలితో అలమటిస్తూ..
ఏ పాపం చేశారో ఏమో ఆ చిన్నారులు ఆకలితో అలమటిస్తూనే ఉన్నారు. పొదలకూరు ఏసీనగర్‌ కాలనీలో కొంగి వెంకటేశ్వర్లు, వెంకటరమణమ్మ ముగ్గురు ఆడబిడ్డల పరిస్థితి ఘోరంగా ఉంది. తల్లిదండ్రులు దివ్యాంగులు (తండ్రి అంధుడు, తల్లికి అంగవైకల్యం). ఈ నేపథ్యంలో గర్భిణిని గుర్తించి పౌష్టికాహారం అందించాల్సిన ఐసీడీఎస్, వైద్యపరీక్షలు చేయించాల్సిన వైద్య ఆరోగ్యశాఖల సిబ్బంది వద్ద కనీస సమాచారం కూడా లేకపోవడం గమనార్హం. కాలనీవాసులు ద్వారా సమాచారం తెలుసుకున్నా అధికారులు అటు కేసి వెళ్లకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తల్లి ఎలాగో పోయినా ఉన్న బిడ్డలకు తండ్రి పట్టెడన్నం పెట్టలేని పరిస్థితిలో ఉన్నాడు.

పిల్లలను చైల్డ్‌కేర్‌ సెంటర్‌కు తరలించాలి
దిక్కులేని ముగ్గురు ఆడపిల్లలను అధికారులు చొరవ తీసుకుని చైల్డ్‌ కేర్‌ సెంటర్‌కు తరలించాల్సిందిగా కాలనీ వాసులు పేర్కొంటున్నారు. ముగ్గురు ఆడపిల్లల్లో దివ్య(11), శ్రావ్య(8) దివ్యాంగులు. సుమతి(4) స్థానిక అంగన్‌వాడీ కేంద్రంకు వెళుతోంది. తండ్రి పుట్టు అంధుడు కావడంతో ఆడ పిల్లలను చూసుకునే పరిస్థితి లేదంటున్నారు. మృతి చెందిన భార్య వెంకటరణమ్మకు దశదిన కర్మ చేసేందుకు సైతం స్తోమత లేదని కాలనీవాసులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తరఫున అధికారులు స్పందించి చేయూత నివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఐసీడీఎస్‌ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలంటున్నారు.  

మరిన్ని వార్తలు