బాల్యవివాహాన్ని అడ్డుకున్న అధికారులు

7 Dec, 2019 09:53 IST|Sakshi
బాలికతో ఉన్న తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇస్తున్న ఐసీడీఎస్‌ అధికారులు, పోలీసులు

బాలిక తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇచ్చిన సీడీపీఓ శాంతిదుర్గ

శ్రీకాళహస్తి రూరల్‌/ తిరుపతి క్రైం: బాల్య వివాహాన్ని అడ్డుకున్న సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. శ్రీకాళహస్తి డివిజన్‌ ఐసీడీఎస్‌ సీడీపీఓ శాంతిదుర్గ కథనం..మండలంలోని అబ్బాబట్లపల్లెకు చెందిన బత్తెయ్య, బత్తెమ్మ దంపతుల వ్యవసాయ కూలీలుగా కుటుంబాన్ని పోషిస్తున్నారు. వీరి 15 ఏళ్ల కుమార్తె 10వ తరగతి చదువుతోంది. పెట్రోల్‌ బంకులో కార్మికుడిగా పనిచేస్తున్న అదే గ్రామానికి చెందిన 21 ఏళ్ల యువకునితో వివాహం నిశ్చయమైంది. గురువారం రాత్రి వివాహం చేయడానికి ఇరు కుటుంబాలు సిద్ధం చేశాయి. బాల్య వివాహం చేస్తున్నారని తిరుపతి పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం అందడంతో వారు శ్రీకాళహస్తి పోలీసులను అలర్ట్‌ చేశారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. అనంతరం బాలిక తల్లిదండ్రులను ఐసీడీఎస్‌ కార్యాలయానికి తీసుకువచ్చి అధికారులు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. బాలికకు 18 ఏళ్లు నిండే వరకు పెళ్లి చేయమని రాతపూర్వకంగా బాలిక తల్లిదండ్రుల నుంచి స్టేట్‌మెంట్‌ నమోదు చేశారు. బాల్యవివాహాలు చేయటం చట్టరీత్యా నేరమని, బాల్యవివాహాలు చేసినా, ప్రోత్సహించినా కఠిన శిక్షలు తప్పవని సీడీపీఓతోపాటు పోలీసులు హెచ్చరించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్‌ అధికారులు బజావతి, శారద, అరుణకుమారి, హెడ్‌ కానిస్టేబుల్‌ గంగయ్య పాల్గొన్నారు.

సకాలంలో స్పందిస్తాం : అర్బన్‌ ఎస్పీ
ఆపద కాలంలో పోలీసు రక్షణ కోసం స్టేషన్‌ చు ట్టూ తిరగాల్సిన పనిలేదని అర్బన్‌ జిల్లా ఎస్పీ గజరావు భూపాల్‌ తెలిపారు. డయల్‌ 100కు ఫోన్‌ చేస్తే సకాలంలో ఘటనా స్థలం చేరుకుంటామన్నారు. తద్వారానే శ్రీకాళహస్తిలో బాలిక వివాహాన్ని అడ్డుకున్నట్టు పేర్కొన్నారు. డయల్‌ 100తో పాటు 112, 181 నంబర్లను వినియోగించుకోవాలని కోరారు. బాల్యవివాహం చట్టరీత్యానేరమన్నారు. అంతేకాకుండా చిన్నవయస్సులో వివాహం చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా ఎదుగుదల ఉండదన్నారు.

మరిన్ని వార్తలు