ఐసీడీఎస్‌కు ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ కావలెను

9 Jul, 2018 12:08 IST|Sakshi
ఐసీడీఎస్‌ పీడీ కార్యాలయం

రెండేళ్లుగా ఇన్‌చార్జిల పాలన

పర్యవేక్షణకు మంగళం

నెల్లూరు (వేదాయపాళెం): మహిళా శిశు సంక్షేమానికి ఎంతో ప్రాధాన్యత ఉన్న నేపథ్యంలో ఆశాఖకు జిల్లాలో ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ నియామకం రెండేళ్ల నుంచి జరుపకపోవటంతో ఇన్‌చార్జిలే దిక్కుగా మారుతోంది. ఫలితంగా ఆశాఖ కార్యకలాపాలు కుంటుపడుతున్నాయి. వరుసగా ఇతర మాతృశాఖల అధికారులను ఐసీడీఎస్‌కు ఇన్‌చార్జిలుగా నియమించి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో ఇన్‌చార్జిల పాలనతో ఐసీడీఎస్‌కు గ్రహణం పట్టినట్లైంది. మాతృశాఖల పర్యవేక్షణలకు వారు ప్రాధాన్యత నివ్వటంతో ఎంతో కీలకమైన ఐసీడీఎస్‌ను పట్టించుకునే నాథుడు కరువయ్యారు.

ఆయా సందర్భాల్లో ఇన్‌చార్జిలుగా కొనసాగుతూ వస్తున్న అధికారులు మొక్కుబడిగా విధులకు పరిమితమవుతున్నారు, అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు పూర్వప్రాథమిక విద్యను విస్తరించాలని ప్రణాళికలు రూపొందిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో లక్ష్యాలను చేరుకోలేకుంది. అశాఖలోని వివిధ పథకాల అమలు సజావుగా సాగే పరిస్థితి కానరావటంలేదు. మహిళా శిశు సంక్షేమానికి రూ.కోట్లు విడుదల అవుతున్నప్పటికీ వాటి సద్వినియోగం ప్రశ్నార్థకంగా మారుతోంది. జిల్లాలో 3,454 మెయిన్‌ అంగన్‌వాడీ కేంద్రాలు, 320 మిని అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. 17 ప్రాజెక్టులున్నాయి. వీటిల్లో మూడేళ్ల లోపు పిల్లలు 89,856 మంది, 3 నుంచి ఆరేళ్ల పిల్లలు 82,736 మంది ఉన్నారు. అలాగే బాలింతలు 17,786 మంది, గర్భిణీలు 18,943 మంది ఉన్నారు.వీరికి ప్రభుత్వ పరంగా లబ్ధి చేకుర్చే విషయంలో పర్యవేక్షణ ఎంతో కీలకం.

ఇన్‌చార్జిల పరంపర
రెండేళ్ల క్రితం రెగ్యులర్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ విద్యావతి బదిలీ అనంతరం అప్పటి డ్వామా పీడీ ఇప్పటి నెల్లూరు ఆర్డీఓ డి,హరితను ఇన్‌చార్జిగా నియమించారు. ఆమె ఆరు నెలల పాటు ఇన్‌చార్జిగా కొనసాగారు. ఆనంతరం మంత్రి నారాయణ జోక్యంతో తెలుగుగంగ స్పెషల్‌ కలెక్టర్‌గా, అలాగే ఐసీడీఎస్‌ ఇన్‌చార్జిగా ఏకకాలంలో నియమించారు. ఆమె ఎడాదికిపైగా ఇన్‌చార్జిగా కొనసాగారు. గత నెల చివరి వారంలో అనంతపురంకు బదిలీ అయ్యారు. ఐటీడీఏ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌గా ఉన్న కమలకుమారిని నెల్లూరు జేసీ–2గా పదోన్నతి కల్పిస్తూ నియమించారు. అలాగే ఐసీడీఎస్‌కు ఇన్‌చార్జిగా నియమించారు. ఈమెను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసిన ఐదు రోజుల తరువాత మొక్కుబడిగా ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్ట్‌ డైరెక్టర్‌ కార్యాలయానికి వచ్చి కాసేపు అందరిని పలకరించి సమీపంలో ఉన్న శిశుగృహాన్ని సందర్శించి వెళ్లారు.

అప్పటి నుంచి కార్యాలయానికి వచ్చిన దాఖలాలులేవు. ఐసీడీఎస్‌ కార్యాలయం ఫైల్స్‌ను కార్యాలయ అధికారులను జేసీ–2 చాంబర్‌కు తెప్పించుకుని నామమాత్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఇప్పటి వరకూ అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేయకపోగా సీడీపీఓలతో సమావేశం ఏర్పాటు చేయలేదు. కమలకుమారికి ఐసీడీఎస్‌ ఇన్‌చార్జి బాధ్యతలు చేపట్టడంపై తొలి నుంచి నిరాసక్తతగానే వ్యవహరిస్తున్నారు. ఇటీవల తనను ఐసీడీఎస్‌ ఇన్‌చార్జి బాధ్యతల నుంచి తప్పించాల్సిందిగా మంత్రి నారాయణను కమలకుమారి కోరినట్లు సమాచారం. అధిక పని ఒత్తిడి బాధ్యత ఉన్న ఐసీడీఎస్‌కు శాశ్వత పీడీని నియమించటంలో ఉన్నతాధికారులు ఎందుకు మీనమేషలు లెక్కిస్తున్నారనేది ఆశాఖ అధికారులలో చర్యనీయంశంగా మారింది. ఐసీడీఎస్‌ని గాడిలో పెట్టేందుకు శాశ్వత ప్రాజెక్టు డైరెక్టర్‌ను నియమించాల్సి అవసరం ఎంతైనా ఉంది.

మరిన్ని వార్తలు