ఆ టీచరే ఉండాలి... లేకుంటే బడిమానేస్తాం... 

3 Nov, 2019 07:26 IST|Sakshi
డీఈఓ కార్యాలయం ఎదుట కొర్లాం ఎంపీపీ స్కూల్‌ విద్యార్ధులు, తల్లిదండ్రులు- ఇన్‌సెట్‌లో ఉపాధ్యాయిని వర్రి జ్యోతిలక్ష్మి   

సాక్షి, విజయనగరం అర్బన్‌: ఉద్యోగమంటే అదో మొక్కుబడి బాధ్యతగా భావించేవారినే చూశాం. వెళ్లామా... కాలక్షేపం చేశామా... క్యారియర్‌ ఖాళీ చేశామా... వచ్చేశామా... అనుకునేవారే ఎక్కువ. కానీ ఆ ఉపాధ్యాయిని అలా చేయలేదు. తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. పాఠశాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. పిల్లల్లో క్రమశిక్షణ అలవాటు చేశారు. అంతేనా... తన బోధనలతో పిల్లలను ఆకట్టుకున్నారు. 45మంది పిల్లలున్న ఆ బడిలో 95మంది పిల్లలను చేర్పించారు. అలాంటి ఉపాధ్యాయురాలు బదిలీ అయిపోతే ఎలాంటివారికైనా కాస్త ఆందోళన తప్పదు. ఇక బడిపిల్లలు, వారి తల్లిదండ్రుల సంగతైతే వేరే చెప్పనవసరం లేదు.

అదే జరిగింది గంట్యాడ మండలం కొర్లాంలో. అక్కడి మండల పరిషత్‌ ప్రాధమిక పాఠశాల ఉపాధ్యాయిని వర్రి జ్యోతిలక్ష్మికి బదిలీ అయిందని తెలియగానే... ఊరు ఊరంతా కట్టకట్టుకుని జిల్లా కేంద్రానికి వచ్చారు. డీఈఓను కలసి తమకు ఆ టీచరే కావాలని పట్టుబట్టారు. లేదంటే బడిమానేస్తామని చెప్పారు. ఉపాధ్యాయిని ఇంటికెళ్లి తమ ఊరు వదిలి వెళ్లవద్దని వేడుకున్నారు. ఈ సంఘటన శనివారమే చోటు చేసుకుంది. ఈ సందర్భంగా జ్యోతిలక్ష్మి మాట్లాడుతూ నిజానికి పిల్లల్ని విడిచి వెళ్లడానికి తనకూ బాధగానే ఉందనీ, వృత్తి పరమైన అభ్యున్నతిని తిరస్కరించినట్లవుతుందని అన్నారు.

ఇంతకీ ఆ టీచర్‌ ప్రత్యేకత ఏంటటే...? 
గంట్యాడ మండలం కొర్లాం ఎంపీపీ పాఠశాలలో 2017 ఆగస్టులో ఉపాధ్యాయినిగా బదిలీపై జ్యోతి లక్ష్మి వచ్చారు. అక్కడి విద్యార్థుల మనసులను హత్తుకునేలా బోధించారు.  అప్పటికి కేవలం 45 మంది విద్యార్థులు మాత్రమే ఆ స్కూళ్లో ఉన్నారు. తరువాతి సంవత్సరం ఆనంద లహరి (అల) పథకం వర్తించడంతో భిన్న బోధనా నైపుణ్యాలు ఆ స్కూల్‌కు లభించాయి. వాటిని శతశాతం వినియోగిస్తూ గ్రామంలో ప్రైవేటు స్కూళ్లకు వెళ్లే విద్యార్థినులను ఆకట్టుకునేలా ఆమె బోధనలను అందించారు. తద్వారా విద్యార్ధుల నమోదు 95 మందికి పెంచారు. అంతే గాకుండా పాఠశాల ప్రాంగణాన్ని వినూత్నంగా తీర్చిదిద్దారు. అదే ఆమెపై అక్కడివారు పెంచుకున్న అభిమానానికి కారణమైంది.  

>
మరిన్ని వార్తలు