కొండపి ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు

10 Jul, 2019 06:40 IST|Sakshi
ఎమ్మెల్యేపై ఎస్సైకి ఫిర్యాదు చేస్తున్న ఆదర్శరైతు దివి శ్రీనివాసరావు

రైతు దినోత్సవంలో గలాటా సృష్టించడమే కారణమన్న వైఎస్సార్‌ సీపీ ఇన్‌చార్జ్‌ వెంకయ్య

సాక్షి, కొండపి: కొండపిలోని కామేపల్లి రోడ్డులో సోమవారం ప్రభుత్వం నిర్వహించిన వైఎస్సార్‌ రైతు దినోత్సవం కార్యక్రమాన్ని అబాసుపాలు చేయటానికి కొండపి ఎమ్మెల్యే డీఎస్‌బీవీఎన్‌ స్వామి తన అనుచరులతో ప్రయత్నించాడని కొండపి వైఎస్సార్‌ సీపీ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ వెంకయ్య అన్నారు. రైతు దినోత్సవం సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే స్వామి తన అనుచరులతో వచ్చి సృష్టించిన గలాటాపై మంగళవారం ఆదర్శరైతు దివి శ్రీనివాసులు కొండపి ఎస్‌ఐ ప్రసాద్‌కి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కొండపి వైఎస్సార్‌ సీపీ ఇన్‌చార్జ్‌ వెంకయ్య విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం రైతుల కోసం చేపట్టిన మంచి కార్యక్రమాన్ని సజావుగా సాగకుండా చేయటం కోసం స్వామి తన అనుచరులతో వచ్చారని ఆరోపించారు. రైతు దినోత్సవం వద్ద సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని ఎమ్మెల్యే స్వామి పరుషపదజాలంతో దూషించారని అన్నారు. ఇది తగదని చెప్పిన రైతుల మీదకు సైతం ఆయన అనుచరులు పైకి దూకారన్నారు.

ప్రజాప్రతినిధి అయి ఉండి సంయమనం పాటించకుండా అల్లరిమూకతో వచ్చి నానాయాగి చేయటం తగదన్నారు. జిల్లా మంత్రి బాలినేని సైతం స్వామిని రైతుదినోత్సవంలొ పాల్గొనేలా చూడాలని చెప్పగా తాను పిలవటానికి వెళ్లానని, అప్పటికే గందరగోళం చేసి వెళ్లిపోయాడన్నారు. స్వామి గతంలో గ్రామాల్లో రైతుల మీద ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టించగా ఆరైతులు స్వామిని చూసి ఆందోళన చేశారన్నారు. ఏ ప్రోటోకాల్‌తో దామచర్ల సత్యను ముందు సీట్లో కూర్చొబెట్టుకుని వెనుక సీట్లో ఎమ్మెల్యే స్వామి కూర్చున్నారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే స్వామి ఒక బాధ్యతగల ప్రజాప్రతినిధిగా వ్యవహరించకుండా ప్రభుత్వ కార్యక్రమాలను అబాసుపాలు చేయటానికి ఇటువంటి దౌర్జన్యాలకు పాల్పడటం ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదన్నారు. స్వామి తన పద్ధతి మార్చుకోకుంటే ప్రజలే తగిన బుద్ది చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైఎస్సార్‌ సీపీ కన్వినర్‌ గోగినేని వెంకటేశ్వరరావుతో పాటు పలు గ్రామాల నుంచి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా