ఇడుపులపాయలో ఆర్‌జీకేయూటీ ఆఫీస్

15 Mar, 2015 02:51 IST|Sakshi
ఇడుపులపాయలో ఆర్‌జీకేయూటీ ఆఫీస్
  • హైదరాబాద్‌లో ఏపీ విద్యార్థులకు ఎంసెట్ సెంటర్ అక్కడే
  •  వైఎస్సార్ జిల్లాలో ఉర్దూ వర్సిటీ
  •  రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ విజయ్ ప్రకాశ్
  • వేంపల్లె: రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్‌జీకేయూటీ) ప్రధాన కార్యాలయాన్ని వైఎస్సార్ జిల్లాలోని ఇడుపులపాయలో ఏర్పాటు చేసే అవకాశముందని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ విజయ్‌ప్రకాశ్ పేర్కొన్నారు. రాష్ట్ర విభజనకు ముందు పరిపాలన సౌలభ్యం కోసం హైదరాబాద్‌లో కార్యాలయాన్ని ఏర్పాటు చేశారని, త్వరలో ఇక్కడికి తరలించే అవకాశముందని అభిప్రాయపడ్డారు. వైఎస్‌ఆర్ జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో శనివారం ఆయన అభియంత్ టెక్ ఫెస్టివల్-15ను ప్రారంభించారు.

    అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మే 8న ఎంసెట్  ఉంటుందని, ఇంజనీరింగ్‌కు 7,630, మెడిసిన్‌కు 5,880 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. వచ్చే నెల 6తో గడువు ముగుస్తుందని, అయితే పరీక్షకు ఒక రోజు ముందు రూ.10 వేల ఫైన్ చెల్లించి ఎంసెట్ రాయవచ్చని తెలిపారు. మెడికల్, ఇంజనీరింగ్ సీట్లు 85 శాతం ఏపీ విద్యార్థులకు, మిగతా 15 శాతం తెలంగాణ విద్యార్థులకు కేటాయించినట్టు చెప్పారు. అదేవిధంగా తెలంగాణలో కూడా ఏపీ విద్యార్థులకు 15 శాతం సీట్లు ఉంటాయన్నారు. హైదరాబాద్‌లో చదివే ఏపీ విద్యార్థులకు(సుమారు 10 వేల మంది) ఎంసెట్ పరీక్ష కేంద్రాలను 99 శాతం ఏర్పాటు చేస్తున్నామన్నారు.

    ఇందుకోసం హైదరాబాద్‌లో ఉన్న కేంద్ర విశ్వవిద్యాలయాలకు చెందిన జాయిం ట్ సెక్రటరీకి లేఖ రాశామన్నారు. అనుమతి రాకపోతే కర్నూలులో ఎంసెట్ రాసేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో పీజీ అడ్మిషన్లు 16 నుంచి మొదలవుతాయని, విభజన వల్ల విద్యకు ఆటంకం కలి గిందన్నారు. జూన్‌లో 2 వేల అధ్యాపకుల పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేస్తుందన్నారు. రాష్ట్రంలో 11 విద్యా సంస్థలు నెలకొల్పాలన్నారు. వీటిలో తొమ్మిదింటికి నిధులు కేటాయించారన్నారు. వైఎస్సార్ జిల్లాలో టూరిజం పార్కు, ఉర్దూ వర్సిటీ, ఫుడ్ పార్కు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కార్యక్రమంలో డెరైక్టర్ వేణుగోపాల్‌రెడ్డి, ఏవో విశ్వనాథరెడ్డి, ఎఫ్‌వో కె.ఎల్.ఎన్.రెడ్డి, ఎన్‌ఎస్‌ఎస్ అధికారి జి.వి.రావు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు