యాక్సిడెంట్ చేస్తే 304 కొరడా

28 May, 2015 04:30 IST|Sakshi
యాక్సిడెంట్ చేస్తే 304 కొరడా

- హిట్ అండ్ రన్‌గా పోలీసుల నిర్ణయం
- నటుడు సల్మాన్‌ఖాన్‌పై ఇదే తరహా కేసు
- గొల్లపూడి ప్రమాదంలో లారీడ్రైవర్‌పై నమోదు
- నగరంలో ఇదే తొలిసారి
విజయవాడ సిటీ :
  బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌పై పెట్టిన రోడ్డు ప్రమాదం కేసు గుర్తుందా? ఇప్పటికే ఆ కేసులో సల్మాన్‌కు శిక్ష పడింది. ఇదే తరహా కేసుల నమోదుకు నగర పోలీసులూ సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా మంగళవారం రాత్రి గొల్లపూడి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన లారీడ్రైవర్‌పైనా సల్మాన్‌ఖాన్‌పై నమోదుచేసిన సెక్షన్ 304 (ప్రాణహరణం) కింద కేసు నమోదుచేశారు. ఇదే మొదటిసారి రోడ్డు ప్రమాదాలపై సీరియస్‌గా దృష్టిసారించిన ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. నిర్లక్ష్య వైఖరిపై సెక్షన్ 304 నమోదుచేయడం నగరంలో ఇదే తొలిసారి అని  పోలీసులు చెబుతున్నారు. గతంలో రోడ్డు ప్రమాదాలు జరిగిన ఎవరైనా మృత్యువాత పడితే సెక్షన్ 304ఎ (నిర్లక్ష్యపు డ్రైవింగ్) ఐపీసీ కింద ప్రమాదానికి కారణమైన వారిపై కేసు నమోదు చేసేవారు.

ప్రమాదాలను అరికట్టేందుకే..
కేసు నుంచి బయటపడిన డ్రైవర్లు పదేపదే వాహనాలు నిర్లక్ష్యంగా నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇకపై వీరిని ఉపేక్షించరాదంటూ తీసుకున్న నిర్ణయంలో భాగంగానే.. గొల్లపూడిలో మంగళవారం రాత్రి ఇద్దరి ప్రాణాలు పోవడానికి కారణమైన లారీడ్రైవర్‌పై సెక్షన్ 304 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు.

304 కింద కేసు అయితే లెసైన్‌‌స లేనట్టే..
304 సెక్షన్ ప్రకారం సంబంధిత డ్రైవర్ లెసైన్స్ సస్పెండ్‌చేసి విచారణ జరుపుతారు. కేసు విచారణలో ఉండగా లెసైన్స్ పునరుద్ధరించడం జరగదు. గతంలో మాదిరి జరిమానాలు చెల్లించి బయటపడొచ్చనే ఆలోచించే వారికి నగర పోలీసు  అధికారులు తీసుకున్న ఈ నిర్ణయం ఇబ్బందికరమేనని చెప్పొచ్చు.

అధికారులతో విచారణ
ప్రతి రోడ్డు ప్రమాద కేసును ప్రాధాన్యత కలిగినదిగా పరిగణించి ఉన్నతాధికారుల పర్యవేక్షణలో పరిశోధన నిర్వహించనున్నట్టు నగర పోలీస్ కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన చేస్తూ ప్రమాద కారణాలను నిష్పక్ష పాతంగా నిర్ధారిస్తారని పేర్కొన్నారు. నిర్ధారణ అయిన అంశాల ఆధారంగానే తదుపరి చర్యలు  తీసుకుంటామని వివరించారు.  పెద్ద వాహనాల డ్రైవర్లను నేరస్తులుగా పరిగణించే సంప్రదాయానికి స్వస్తిపలికి వాస్తవాల ఆధారంగా శాస్త్రీయ పరిశోధన నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకుని వాహనాలకు పూర్తిస్థాయిలో ఇన్సూరెన్స్ చేయించుకోవాలని ఆయన సూచించారు.

మరిన్ని వార్తలు