కార్యకర్తల్ని బాధ్యులను చేస్తే ఎలా?

6 Mar, 2015 02:28 IST|Sakshi

విజయవాడ:  పార్టీ నాయకత్వం చేసిన తప్పులకు కార్యకర్తలను ఎలా బాధ్యుల్ని చేస్తారని సీపీఐ జిల్లాల నేతలు ధ్వజమెత్తారు. ఇక్కడ జరుగుతున్న సీపీఐ ఏపీ 25వ రాష్ట్ర మహాసభల్లో గురువారం కార్యదర్శి నివేదికపై చర్చ కొనసాగింది. వివిధ ప్రజాసంఘాల, జిల్లాల ప్రతిని దులు చర్చలో పాల్గొంటూ.. పార్టీ నాయకత్వం ఏ కార్యక్రమమిస్తే దాన్ని చిత్తశుద్ధితో నిర్వర్తించడానికి కార్యకర్తలు ప్రయత్నించారేతప్ప సొంత నిర్ణయాలు తీసుకోలేదన్నారు. నిర్ణయాలు తీసుకోవడంలో, ఎన్నికల ఎత్తుగడలు వేయడంలో తప్పంటూ జరిగితే అది నాయకత్వానిదే అవుతుందని తేల్చిచెప్పారు.

నైతిక విలువలకు తిలోదకాలిచ్చారా?
డబ్బులున్నోళ్లకు, విరాళాలు తెచ్చేవాళ్లకుతప్ప కష్టపడి పనిచేసే వారికి పార్టీలో ప్రాధాన్యం లేకుండా పోతోందని కోస్తాంధ్ర జిల్లాల నేతలు వాపోయారు. చందాలు తేవడమే అర్హతైతే కమ్యూనిస్టులకు, కాంగ్రెస్‌కు తేడా ఏముందని ప్రశ్నించారు.

ఏ పనిచేసినా పార్టీకోసమే: నారాయణ
తెలంగాణ ఏర్పాటుకు కట్టుబడాలన్నది తన నిర్ణయం కాదని, పార్టీ నాయకత్వ సమష్టి నిర్ణయాన్నే అమలు చేశానని కేంద్రకమిటీ సభ్యుడు కె.నారాయణ సుదీర్ఘవివరణ ఇచ్చుకున్నారు. ఆంధ్రాకు అన్యాయం చేసి తెలంగాణకు న్యాయం చేయాలని తనకు ఎందుకుంటుందన్నారు. క్లిష్ట సమయంలో తాను నాయకత్వ స్థానంలో ఉన్నానని, టీవీ చానల్ కోసం అప్పులు చేసినా, పత్రికకోసం భవనాన్ని నిర్మించినా పార్టీకోసమే చేశాను తప్ప వ్యక్తిగతానికి కాదని, ఈ విషయాన్ని విస్మరించి తనపై విమర్శలు గుప్పించడంలో హేతుబద్ధత లేదన్నారు.

మరిన్ని వార్తలు