వైఎస్ బతికి ఉంటే వాన్‌పిక్ పూర్తయ్యేది

25 Dec, 2013 02:19 IST|Sakshi

అరండల్‌పేట,(గుంటూరు) న్యూస్‌లైన్: మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి బతికి ఉంటే ‘వాన్‌పిక్’ను పూర్తిచేసి ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేవారని వెఎస్సార్ సీపీ నేత, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని తీరప్రాంతాన్ని అభివృద్ధి చేసి అక్కడి ప్రజల స్థితిగతులు మార్చాలని నాటి ముఖ్యమంత్రి  వైఎస్ భావించడంతో ప్రకాశం జిల్లాలోని ఓడరేవు, గుంటూరు జిల్లాలోని నిజాంపట్నంను అనుసంధానం చేస్తూ వాన్‌పిక్ కారిడార్‌గా అభివృద్ధి చేసేందుకు అప్పటి మంత్రి వర్గం సమష్టిగా నిర్ణయం తీసుకుందన్నారు.

ఇందులో ఎటువంటి అక్రమాలు జరగలేదని ఆయన తెలిపారు. 19 నెలల తర్వాత తొలిసారిగా జిల్లా కేంద్రమైన గుంటూరుకు వచ్చిన ఆయనకు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మోపిదేవి మాట్లాడారు.  వైఎస్ మరణానంతరం రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయన్నారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమపథకాలను సక్రమంగా అమలు చేయడంలేదని, ఆయన ఆశయాలను సజీవంగా ఉంచేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ స్థాపించి ప్రజల్లోకి వెళ్లడంతో బ్రహ్మరథం పట్టారన్నారు. ప్రజల నుంచి వస్తున్న ఆదరణను ఓర్చుకోలేని ఢిల్లీ పెద్దలు, పాలక, ప్రతిపక్షాలు కుమ్మక్కై అక్రమకేసులు బనాయించాయన్నారు.

ఆయన్ను అరెస్ట్ చేసే ముందు తననూ బలిచేశారన్నారు. కేసులు నుంచి నిర్దోషిగా బయట పడతానని, న్యాయస్థానాలపై తనకు నమ్మకం ఉందన్నారు.  సమైక్యాంధ్ర అంటూ ముఖ్యమంత్రి, ఎంపీలు, మంత్రులు నాటకమాడుతున్నారని వారి మాటలను ఢిల్లీపెద్దలు వినే ప్రసక్తేలేదన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఘన విజయం సాధించి జగన్ ముఖ్యమంత్రి కాబోతున్నారని తెలిపారు.

 వైఎస్సార్ సీపీ మరింత బలోపేతం
 - మర్రి రాజశేఖర్
 పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ అకారణంగా, అన్యాయంగా మాజీ మంత్రి మోపిదేవిని 16 నెలలు జైల్లో ఉంచారన్నారు. మోపిదేవికి జరిగిన అన్యాయం ప్రజలందరికీ కనపడుతుందన్నారు.మోపిదేవి నాయకత్వంలో జిల్లాలో వైఎస్సార్ సీపీ మరింత బలోపేతం అవుతుందని, ఆయన  అందరికీ మార్గదర్శకంగా ఉంటారన్నారు. ఈ సమావేశంలో నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి, వాణిజ్య విభాగం కన్వీనర్ ఆతుకూరి ఆంజనేయులు, జిల్లా యువజన విభాగం కన్వీనర్ కావటి మనోహర్‌నాయుడు, సమన్వయకర్తలు అనూప్, రాతంశెట్టి సీతారామాంజనేయులు, బొల్లా బ్రహ్మనాయుడు, షౌకత్, పార్టీ నాయకులు మహ్మద్ ముస్తాఫా, మేరిగ విజయలక్ష్మీ, దర్శనపు శ్రీనివాస్, శాఖమూరి నారాయణప్రసాద్ తదితరులు ఉన్నారు.
 పార్టీ నాయకులతో ప్రత్యేక సమావేశం
 తొలిసారి పార్టీ కార్యాలయానికి వచ్చిన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన నాయకులతో సమావేశమై మాట్లాడుతూ పార్టీని బలోపేతం చేయాలన్నారు. ఎన్నికలకు ఎన్నో రోజులు లేవని, ప్రతి ఒక్కరూ కష్టించి పనిచేసి జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలన్నారు. జిల్లాలో అన్ని సీట్లను గెలవాలని మార్గదర్శకం చేశారు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు రాజకీయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు.

మరిన్ని వార్తలు