స్థానికులకు ఉద్యోగాలివ్వకపోతే పోరాటాలు

16 Oct, 2014 03:00 IST|Sakshi
స్థానికులకు ఉద్యోగాలివ్వకపోతే పోరాటాలు

తోటపల్లిగూడూరు : తీర ప్రాంతం వెంబడి నెలకొల్పుతున్న పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలు కల్పించకపోతే పోరాటాలు తప్పవని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి హెచ్చరించారు. మండంలోని వరకవిపూడి, మండపం పంచాయతీల్లో జరిగిన జన్మభూమి- మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని తీర ప్రాంతంలో అనేక పరిశ్రమలు ఏర్పాటవుతున్నా స్థానికులకు ఉద్యోగావకాశాలు లభించడంలేదని చెప్పారు.

అతి చౌకగా భూములను తీసుకొని అందులో పరిశ్రమలను స్థాపించిన కంపెనీల యాజమాన్యాలు చదువుకొని నిరుద్యోగులుగా మిగిలిపోతున్న వారికి ఎందుకు ఉపాధి కల్పించడంలేదని మండిపడ్డారు. స్థానికులకు పోనూ మిగిలిన ఉద్యోగాలను మాత్రమే బయటి వారికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో స్థానికులకు అండగా నిలిచి కంపెనీలపై పోరాటాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. పేదల జీవన విధానాన్ని తెలుసుకోకుండా.. వారి జీవితాల్లో ఎలా మార్పులు తీసుకురావాలో ప్రణాళికలు వేయకుండా.. పేదరికంపై గెలుపంటూ పాలకులు డప్పులు కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

ప్రమాణ స్వీకారం అనంతరం సీఎం చంద్రబాబునాయుడు ఎన్టీఆర్ సుజలధార పథకంపై సంతకం చేశారని, దీని ద్వారా రూ.2కే 20 లీటర్ల స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తామని చెప్పారన్నారు. అయితే తమ వద్ద నిధుల్లేవని, దాతలే ముందుకొచ్చి వాటర్ ప్లాంట్‌ను నిర్మించాలని చంద్రబాబు ప్రస్తుతం చెప్పడం విడ్డూరంగా ఉందని చెప్పారు. అర్హుల పింఛన్లను తొలగిస్తే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రజల పక్షాన నిలిచి పోరాటాలకు సిద్ధమవుతామని స్పష్టం చేశారు.

అనంతరం పింఛన్లను పంపిణీ చేశారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మొక్కలు నాటారు. తహశీల్దార్ రామకృష్ణ, ఎంపీడీఓ సావిత్రమ్మ, జెడ్పీటీసీ సభ్యుడు మన్నెం చిరంజీవులుగౌడ్, సర్పంచ్‌లు కాల్తిరెడ్డి సుబ్బారావు, వెల్లసిరి వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ సభ్యులు ఉప్పల స్వర్ణలత, కాయల జోసఫ్, నాయకులు ఇసనాక రమేష్‌రెడ్డి, పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు చిల్లకూరు సుధీర్‌రెడ్డి, మండల కన్వీనర్ టంగుటూరు పద్మనాభరెడ్డి, ముత్తూకూరు మండల కన్వీనర్ మెట్టా విష్ణువర్ధన్‌రెడ్డి,  వేనాటి జితేంద్రరెడ్డి, ఉప్పల శంకరయ్యగౌడ్, తూపిలి శ్రీధర్‌గౌడ్, కృష్ణారెడ్డి, ఎండికళ్ల దయాకర్‌గౌడ్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు