స్థానికేతరులు గెలిస్తే మంత్రి పదవి ఖాయం

18 Mar, 2019 13:46 IST|Sakshi
నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, నేదురుమల్లి రాజ్యలక్ష్మి, నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి

సాక్షి, వెంకటగిరి (నెల్లూరు): వెంకటగిరి నియోజకవర్గం నుంచి గెలుపొందిన స్థానికేతరులకే సీఎం, మంత్రి, చైర్మన్‌ పీఠాలు దక్కుతాయనే సెంటిమెంట్‌ ప్రతి సారి రుజువైంది. స్థానికులైతే మాజీ ఎమ్మెల్యేలుగానే మిగిలిపోతారు. 1978లో వెంకటగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన కోటకు చెందిన నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి చక్కెర శాఖ మంత్రి, ఆర్టీసీ చైర్మన్‌ పదవులను అలంకరించారు. 1983లో వెంకటగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన కోటకు చెందిన నల్లపరెడ్డి చంద్రశేఖరరెడ్డి రాష్ట్ర పంచాయతీరాజ్‌ చైర్మన్‌ పదవి పొందారు. 1989 ఎన్నికల్లో విజయం సాధించిన నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి తొలుత రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత రాష్ట్రంలో అత్యున్నతమైన ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు. 2004 ఎన్నికల్లో వెంకటగిరి నియోజకవర్గం నుంచి గెలుపొందిన నేదురుమల్లి రాజ్యలక్ష్మి రాష్ట్ర ప్రాథమిక విద్య, స్త్రీ శిశుసంక్షేమ శాఖ మంత్రిగా పని చేశారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీసీ తరఫున పోటీలో ఉన్న ఆనం రామనారాయణరెడ్డి గతంలో పలు దఫాలుగా మంత్రిగా పనిచేశారు.

స్థానికులకు అచ్చిరాని వైనం
వెంకటగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన పాదిలేటి వెంకటస్వామిరెడ్డి, కమతం షణ్ముగం, ఓరేపల్లి వెంకటసుబ్బయ్య, అల్లం కృష్ణయ్య, వీబీ సాయికృష్ణ యాచేంద్ర, వీవీఆర్‌కే యాచేంద్రతో పాటు వరుసగా రెండు దఫాలు ఎమ్మెల్యేగా గెలుపొందిన ప్రస్తుత సిట్టింగ్‌ ఎమ్మెల్యే కె.రామకృష్ణకు ఎలాంటి మంత్రి పదవి గానీ, ప్రభుత్వ పదవులు దక్కలేదు.

మరిన్ని వార్తలు