సీమకు అన్యాయం చేస్తే సహించం

11 Feb, 2016 02:36 IST|Sakshi
సీమకు అన్యాయం చేస్తే సహించం

 కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం సాధన కోసం విద్యార్థి సంఘాలు గర్జించాయి. సీమకు అన్యాయం చేస్తే సహించమంటూ నినాదాలు చేశాయి. రాయలసీమ రాష్ట్ర సాధనే ధ్యేయమని ప్రకటించాయి. సీమపై పాలకులు చూపుతున్న వివక్షపై దండెత్తాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోస్తా జపం చేయడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థి పరిషత్, ఇంజినీరింగ్ స్టూడెంట్ ఫెడరేషన్, రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన విద్యార్థి గర్జన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. సుమారు మూడు వేల మంది విద్యార్థులు హాజరై సీమ సమస్యలపై గళమెత్తారు. ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీ విద్యార్థి పరిషత్ అధ్యక్షుడు వీవీనాయుడు అధ్యక్షతన మున్సిపల్ ఓపెన్ ఎయిర్ థియేటర్‌లో నిర్వహించిన విద్యార్థి గర్జన కార్యక్రమానికి పలు ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల నేతలు మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నక్కలమిట్ల శ్రీనివాసులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బీవై రామయ్య మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 20 స్మార్ట్ సిటీలను ప్రకటించగా వెనుకబడిన రాయలసీమలో ఒక్కటి లేకపోవడం దారుణమన్నారు.


రాష్ట్ర విభజనతో రాళ్ల సీమగా మారిన రాయలసీకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. కర్నూలుకు రావాల్సిన రాజాధాని అమరావతికి తరలించారని, హైకోర్టును అక్కడే స్థాపించేందుకు చర్యలు తీసుకుంటున్నారన్నారు. దీంతో సీమకు రావాల్సిన పరిశ్రమలు కోస్తాకు తరలిపోతున్నాయని, అక్కడే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయన్నారు. రాయలసీమ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే ఇక్కడ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుతుందన్నారు. అంతకుముందు రాజవిహార్ నుంచి కొండారెడ్డి బురుజు వరకు 3000 మంది విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు రాధాకృష్ణారావు, బాలసుందరం, అరుణ్‌శర్మ, రవికుమార్, నాగేశ్వరరెడ్డి, సుహాన్‌బాష, రాజునాయుడు, శివకుమార్, క్రాంతికుమార్, రఘునాథ్‌రెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు