పండగ వేళ గుండెల్లో రైళ్లు

11 Jan, 2015 01:10 IST|Sakshi
పండగ వేళ గుండెల్లో రైళ్లు

పండక్కి ఊరెళ్లాలి. పిల్లలకు సెలవులిచ్చేశారు. అసలే పెద్ద పండగ. సొంతూళ్లో చేసుకోకపోతే సంతృప్తి ఉండదు. అందుకే విశాఖ రైల్వే స్టేషన్ ఇసుకేస్తే రాలనంతగా జనంతో నిండిపోయింది. నగరంలో వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడినవారే ఎక్కువ. వారంతా స్వస్థలాలకు పయనం కావడంతో రైళ్లు, బస్సులు కిటకిటలాడుతున్నాయి. శనివారం ఉదయం జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో టికెట్ తీసుకునేందుకు పోటీ పడాల్సి వచ్చింది. గంటపాటు నిరీక్షిస్తేనే కానీ టికెట్ లభ్యం కాలేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతలో ఆ రైలు వెళ్లిపోవడంతో సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌కు వెళ్లారు.

ఆ తర్వాత వచ్చిన బొకారో, రత్నాచల్, ప్యాసింజర్ రైళ్లన్నీ కిక్కిరిసిపోయాయి. విశాఖ ఎక్స్‌ప్రెస్, గోదావరి, నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లకు వందలాదిమంది నిరీక్షణ జాబితాలోనే ప్రయాణిస్తున్నారు. కరెంట్ రిజర్వేషన్ కౌంటర్ వద్ద వుండే జనరల్  బుకింగ్‌ను హుద్‌హుద్ తుపాను నుంచి మూసేశారు. దీంతో ప్రయాణికులంతా జనరల్ బుకింగ్ కౌంటర్ వద్దకు పరుగులు తీస్తున్నారు. ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్లు కూడా పనిచేయకపోవడంతో  తోపులాట తప్పడం లేదు.
 -విశాఖపట్నం సిటీ
 
 

మరిన్ని వార్తలు