ప్రభుత్వాస్పత్రికి వస్తే ప్రాణాలే పోయాయి

16 Feb, 2016 04:08 IST|Sakshi
ప్రభుత్వాస్పత్రికి వస్తే ప్రాణాలే పోయాయి

వైద్యశాలలో నిండుకున్న వ్యాక్సిన్లు
పాముకాటుతో వ్యవసాయ కూలీ మృతి
వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ మృతుడి బంధువుల ఆందోళన
రేపల్లె ప్రధాన రహదారిపై మృతదేహంతో నిరసన
పోలీసుల జోక్యంతో ఆందోళన విరమణ

 

ప్రభుత్వ వైద్యశాలల్లో అన్ని వసతులు ఉన్నాయని, నిరంతరం వైద్యులు అందుబాటులో ఉండటంతో పాటు అన్ని రకాల మందులు సిద్ధంగా ఉన్నాయని గ్రామసభల్లో పాలకులు ప్రచారం చేస్తే నిజమేననుకున్నాం. పాముకాటుకు గురై ప్రాణాపాయ స్థితిలో వ్యక్తిని బతికించుకుందామని తీసుకొచ్చాం. తీరా వచ్చాక వైద్యులు సకాలంలో స్పందించలేదు. మందుల్లేవని చావుకబురు చల్లగా చెప్పారు. ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రాణాలు దక్కేవి.’ అంటూ మృతుడి బంధువులు బోరున విలపించారు. మృతదే హంతో రాస్తారోకో చే శారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన రేపల్లె పట్టణంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది.
  
 రేపల్లె మండలంలోని గుడ్డికాయలంక గ్రామానికి చెందిన చిట్టిమోతు ప్రసాద్(50) వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు భార్య, కుమారుడు,  ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సోమవారం వేకువజామున గ్రామ సమీపంలోని ఓ పొలంలో గడ్డి మోపులు కట్టేందుకు వెళ్లారు. గడ్డిలో ఉన్న పాము ప్రసాద్ భుజంపై కాటు వేసింది. కాలువేసింది రక్తపింజరిగా గుర్తించిన ప్రసాద్ వెంటనే విషయాన్ని చుట్టుపక్కల వారికి తెలిపాడు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది బాధితుడిని రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. విషమంగా ఉన్న ప్రసాద్‌కు చికత్స చేసే విషయంలో వైద్యులు సకాలంలో స్పందించలేదని, పాము కాటుకు విరుగుడు మందులు కూడా అందుబాటులో లేకపోవటంతోనే మృతి చెందాడని బంధువులు ఆరోపించారు.

మందులు అందుబాటులో ఉంటే ప్రసాద్ ప్రాణాలు పోయేవికావంటూ ఆసుపత్రి ఆవరణంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. గతంలో జరిగిన గ్రామసభల్లో ప్రభుత్వ వైద్యులు, పాలకులు ప్రభుత్వ వైద్యశాలలో అన్ని వసతులు, మందులు ఉన్నాయని ప్రచారం చేస్తేనే ఇక్కడికి తీసుకువచ్చామని విలపించారు. ఇలాగైతే ప్రభుత్వ వైద్యశాల పట్ల నమ్మకం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ప్రధాన రహదారిపై మృతదేహాన్ని ఉంచి రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పట్టణ సీఐ వి.మల్లికార్జునరావు ఆధ్వర్యంలో పోలీసులు రంగప్రవేశం చేసి రాస్తారోకోను విరమింపజేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు