మొదటి ర్యాంకర్‌కూ దక్కని చోటు

12 Dec, 2013 03:56 IST|Sakshi
మొదటి ర్యాంకర్‌కూ దక్కని చోటు

=ఎంఫిల్, పీహెచ్‌డీ అడ్మిషన్లలో గందరగోళం
 =ఆందోళనలో విద్యార్థులు

 
 యూనివర్సిటీ క్యాంపస్, న్యూస్‌లైన్: ఏదైనా ప్రవేశ పరీక్షలో మొదటి ర్యాంకు వస్తే సీటు తప్పకుండా వస్తుంది. ఎస్వీయూలో మాత్రం రీసెట్‌లో మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థినికి పీహెచ్‌డీలో సీటు దక్కలేదు. ఎస్వీ యూనివర్సిటీలో సోమవారం నుంచి నిర్వహిస్తున్న ఎంఫిల్, పీహెచ్‌డీ అడ్మిషన్లలో ఓ విద్యార్థినికి చేదు అనుభవం ఎదురైంది. ప్రొద్దుటూరుకు చెందిన విద్యార్థిని ఎస్.గంగాదేవి ఎస్వీయూలో రీసెట్-2013లో భాగంగా నిర్వహించిన ప్రవేశపరీక్షలో ఈమె 86 మార్కులు సాధించి మొదటి ర్యాంకు సాధించింది.

బుధవారం సాయంత్రం జరిగిన కౌన్సెలింగ్‌కు హాజరైంది. ఎస్వీయూ అధికారులు నెట్, సెట్‌లలో అర్హత సాధించిన వారందరికీ సీట్లు కేటాయించడంతో ఈమెకు ఇవ్వడానికి సీటు మిగల్లేదు. మొదటి ర్యాంకు సాధించినా సీటు రాకపోతే రీసెట్ పేరిట ప్రవేశపరీక్ష ఎందుకు నిర్వహించాలని ఆమె ప్రశ్నిం చారు. తాను నాన్ లోకల్ కాదని, రీసెట్‌లో తెలుగు విభాగంలో మొదటి ర్యాంకు వచ్చినా సీటు ఇవ్వకపోవడం అన్యాయమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చేదు అనుభవమే మరొకరికి ఎదురైంది. ఎన్విరాన్‌మెంటల్ సైన్స్‌లో ఒక విద్యార్థిని మొదటి ర్యాంకు సాధించినా ఎస్వీయూ అధికారులు కౌన్సెలింగ్‌కు పిలువలేదు. ఎస్వీయూ అధికారుల నిబంధనలు సక్రమంగా లేకపోవడంతో తాము ర్యాంకులు సాధించినా సీట్లు రాక ఇబ్బందులు పడుతున్నామని పలువురు
 
 విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు  కొనసాగుతున్న అడ్మిషన్లు

ఎస్వీ యూనివర్సిటీలో నిర్వహిస్తున్న ఎంఫిల్, పీహెచ్‌డీ అడ్మిషన్లలో భాగంగా బుధవారం సోషియల్ వర్క్, తమిళ్, ఉమెన్‌స్టడీస్, సోషియాలజీ, పొలిటికల్ సైన్స్, హిస్టరీ, ఇంగ్లీష్, తెలుగు విభాగాలకు అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించింది. తెలుగు విభాగానికి సంబంధించి ఎస్టీ క్యాటగిరిలో అడ్మిషన్ విషయంపై కొందరు విద్యార్థుల మధ్య వివాదం చోటు చేసుకుంది. అయితే డీవోఏ డెరైక్టర్ శ్రీధర్‌రెడ్డి జోక్యంతో సమస్య సద్దుమణిగింది.
 

మరిన్ని వార్తలు