జిల్లాకు హుదూద్ ముప్పు

9 Oct, 2014 02:15 IST|Sakshi
  • పలు ప్రాంతాల్లో కురిసిన వర్షాలు.. ఆందోళనలో రైతులు
  • సాక్షి, విజయవాడ : జిల్లాకు మరో తుపాను(హుదూద్) ముప్పు పొంచి ఉంది. అండమాన్ దీవులకు సమీపంలో ఏర్పడిన వాయిగుండం మచిలీపట్నం తీరానికి 1,700 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని, దాని ప్రభావంతో రానున్న 24 గంటల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవారణ శాఖ ప్రకటించింది. ఈ క్రమంలో వాతవరణంలో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. కంకిపాడు, ఉయ్యూరు, పెనమలూరు, చాట్రాయి తదితర ప్రాంతాల్లో బుధవారం వర్షం కురిసింది. గత అనుభవాలను గుర్తు చేసుకుని మళ్లీ తుపానుల వల్ల కష్టాలు తప్పవని అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు.
     
    అసలే ఆలస్యంగా ప్రారంభమైన సాగు..

    బ్యాంకర్లు రుణాలు ఇవ్వకపోవటంతో ఈ ఏడాది సీజన్ నిర్ణీత కాలవ్యవధి కంటే రెండు నెలలు ఆలస్యంగా మొదలైంది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 6.25 లక్షల ఎకరాల్లో వరి, 1.30 లక్షల ఎకరాల్లో పత్తి, 40 వేల ఎకరాల్లో చెరుకు, 20 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 6వేల ఎకరాల్లో పసుపు తదితర పంటలు సాగులో ఉన్నాయి. అనేక ప్రాంతాల్లో వరి ఇంకా చిరుపొట్ట దశలోనే ఉంది. మిగిలిన పంటలు పిలకల దశలో ఉన్నాయి.
     
    బుధవారం వర్షం కురిసిన ప్రాంతాలైన ఉయ్యూరు, పెనమలూరు, కంకిపాడు ప్రాంతాల్లో వరి చిరుపొట్ట దశలోనే ఉంది. ఈ దశలో వర్షాలు కురిసి పొలాల్లో నీరు నిలిస్తే పంటకు పూర్తిగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆందోళనకు గురవుతున్నారు.  గతేడాది వచ్చిన మూడు తుపానుల్లో రెండు బందరు వద్దే తీరం దాటడంతో ఆ ప్రభావం వల్ల జిల్లాలో భారీగా వర్షాలు కురిశాయి. సుమారు రూ.200 కోట్ల మేర పంటను నష్టపోయారు.
     

>
మరిన్ని వార్తలు