సంక్షేమ పథకాలు అమలు కావాలంటే జగన్ రావాలి

24 Apr, 2014 01:25 IST|Sakshi
సంక్షేమ పథకాలు అమలు కావాలంటే జగన్ రావాలి

నందివాడ, న్యూస్‌లైన్ : రాష్ట్రంలో పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు కావాలన్నా.. కొత్త రాజధాని నిర్మాణం జరగలన్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలోనే సాధ్యమని మచిలీపట్నం లోక్‌సభ అభ్యర్థి కొలుసు పార్థసారథి చెప్పారు. బుధవారం మండలంలోని తమిరిశ గ్రామంలో గుడివాడ ఎమ్మెల్యే అభ్యర్థి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని)తో కలసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఆయన పరిపాలనను ప్రజలు చూశారన్నారు. అటువంటి భయానక రోజులు రాకుండా ఉండాలంటే జగన్‌మోహన్‌రెడ్డి నాయత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించాలని కోరారు. వైఎస్సార్ అమలు చేసిన గొప్ప పథకాలను జగన్ అమలు చేస్తారని తెలిపారు. ప్రతి పేదవాడి పెదవిపై చిరునవ్వు చూడటమే జగన్ లక్ష్యమని చెప్పారు.

సంపన్న వర్గాలతో నిండిపోయిన టీడీపీలో బడుగు, బలహీన వర్గాలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడని తెలిపారు. టీడీపీ తరఫున పోటీచేస్తున్న అభ్యర్థులందరూ సంపన్నవర్గాలకు చెందినవారేనని చెప్పారు. వారిని గెలిపిస్తే కార్పొరేట్ సెక్టార్ అమలు చేస్తారని తెలిపారు. పేద ప్రజల సమస్యలు తెలిసిన జగన్‌ను సీఎం చేస్తే పేద ప్రజలకు అండగా ఉంటామని వివరించారు.
 
కొడాలి నాని మాట్లాడుతూ చంద్రబాబు చెప్పే అబద్ధాలను ప్రజలు నమ్మవద్దన్నారు. తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలన, ఆరేళ్ల వైఎస్సార్ పాలన చూసిన ప్రజలకు ఎవరికి ఓటేయాలో ఇప్పటికే అర్థమైందని చెప్పారు. జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో సీమాంధ్ర ప్రాంతంలో వైఎస్సార్‌సీపీ గెలుపొందటం ఖాయమని తెలిపారు.
 
కఠారి.. చౌకబారు ఆరోపణలు మానుకో.
 
కఠారి ఈశ్వర్‌కుమార్ చౌకబారు ఆరోపణలు మానుకోవాలని పార్థసారథి హితవు పలికారు. మచిలీపట్నం ఎంపీ సీటు కోసం జగన్‌మోహన్‌రెడ్డికి తాను రూ.50 కోట్లు ఇచ్చినట్లు ఆరోపణలు చేసిన కఠారి ఈశ్వర్‌కుమార్ దానిని నిరూపించాలన్నారు. ఈశ్వర్ కుమార్ తండ్రి కఠారి సత్యనారాయణ విగ్రహం సాక్షిగా డబ్బు తీసుకున్నట్లు నిరుపిస్తారా అని ప్రశ్నించారు. ఈశ్వర్‌కుమార్ ఆరోపణలపై తాను తన బిడ్డల సాక్షిగా జగన్‌మోహన్‌రెడ్డికి ఒక్క రూపాయి ఇవ్వలేదని ప్రమాణం చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

జగన్‌ను తాను కలసినప్పుడు పెనమలూరు సీటు అడిగిన మాట వాస్తవమని వివరించారు. అయితే బందరు లోక్‌సభకు వెళ్లాలని ఆయన సూచించటంతో అధినేత ఆదే శాల ప్రకారం పోటీ చేస్తున్నట్లు తెలిపారు. జగన్‌మోహన్‌రెడ్డి ఒక్క రూపాయి కూడా తనను అడగలేదని వివరించారు. గోబెల్స్ ప్రచారం కోసం ఈశ్వర్‌కుమార్ ఇలా దిగజారటం దారుణమన్నారు. ఇప్పటికైనా చౌకబారు ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు. ప్రచారంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు