మీరు మారకుంటే.. నేనే రిజైన్ చేసి వెళ్తా!

18 Nov, 2014 02:41 IST|Sakshi
మీరు మారకుంటే.. నేనే రిజైన్ చేసి వెళ్తా!

కందుకూరు : కందుకూరు రెవెన్యూ డివిజన్‌లోని 24 మండలాల తహశీల్దార్లు, రేషన్ డీలర్లతో సోమవారం స్థానిక తన కార్యాలయం నుంచి సబ్ కలెక్టర్ మల్లికార్జున వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పేదల బియ్యం విషయంలో ఎందుకు ఇంత గలీజుగా వ్యవహరిస్తున్నారని తహశీల్దార్లు, డీలర్లపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కందుకూరు రెవెన్యూ డివిజన్‌లోని అవినీతి రాష్ట్రంలో మరెక్కడా ఉండదేమోనని సందేహం వ్యక్తం చేశారు.

 రేషన్ షాపుల్లో తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని సబ్ కలెక్టర్ మల్లికార్జున ఆదేశించారు. ప్రధానంగా ఏ షాపు ఎవరి పేరుపై ఉంది, ఎక్కడ నిర్వహిస్తున్నారు, లెసైన్స్ ఉందా లేదా అనే వివరాలు ఉండాలన్నారు. తప్పనిసరిగా ప్రతి నెలా 5 నుంచి 15వ తేదీ వరకు నిర్దేశించిన సమయాల్లో సరుకులు పంపిణీ చేయాలన్నారు. డీలర్ నిబంధనలు పాటిస్తున్నాడో లేదోనని తహశీల్దార్ ప్రతినెలా ఫిట్‌నెస్ సర్టిఫికెట్ జారీ చేయాలని చెప్పారు.

 ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేకుంటే ఎట్టి పరిస్థితులోనూ నిత్యావసరాలు కేటాయించవద్దని తహశీల్దార్లతో పేర్కొన్నారు. కందుకూరులోని 8వ నంబర్ షాపునకు ఇప్పటికీ సరులకు పంపిణీ కాలేదంటూ సంబంధిత తహశీల్దార్‌పై మండిపడ్డారు. రాజీకీయ ఒత్తిళ్తు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని చెప్పినా వినిపించుకోరా.. అంటూ సబ్ కలెక్టర్ మండిపడ్డారు.  

 సరుకులు మాయమైతే ఎలా..
 సరుకులు ఎంఎల్‌ఎస్ పాయింట్ నుంచి షాపులకు చేరే వరకూ వాహనం వెంటే రూట్ ఆఫీసర్ ఉండాలని, కందుకూరు ప్రాంతంలో రూట్ ఆఫీసర్లే ఉండడం లేదని సబ్ కలెక్టర్ అన్నారు. డీలర్లు ఇచ్చే మామూళ్లకు అలవాటు పడి మధ్యలోనే రూట్ ఆఫీసర్లు వెళ్లిపోతున్నారని ఆవేదనగా మాట్లాడారు. ఇంత కక్కుర్తి పడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. డీలర్లు ఎవ్వరికీ మామూళ్లు ఇవ్వాల్సిన అవసరం లేదని, తమ అధికారులు ఎవరైనా మామూళ్ల కోసం ఒత్తిడి చేస్తే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. సొంత ఆలోచనలు, సొంత వ్యవహారాలు ఉంటే ఇప్పటికైనా మానుకోవాలని తహశీల్దార్లకు సబ్ కలెక్టర్ క్లాస్ పీకారు.

మరిన్ని వార్తలు