వైఎస్ ఉంటే ఈ గతి పట్టేదా?

3 Sep, 2013 04:32 IST|Sakshi
వైఎస్ ఉంటే ఈ గతి పట్టేదా?

సాక్షి, హైదరాబాద్: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తరువాత రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా మారిందని, రావణకాష్టంలా మండుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పారు. ఆయనే బతికి ఉంటే రాష్ట్రానికి ఈ గతి పట్టేది కాదన్నారు. వైఎస్ నాలుగో వర్ధంతి సందర్భంగా సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతలు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. సేవా కార్యక్రమాలు నిర్వహించారు. యువజన విభాగం నిర్వహించిన రక్తదాన శిబిరంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమన్వయకర్త కొణతాల రామకృష్ణతో పాటు పెద్దసంఖ్యలో వైఎస్ అభిమానులు, కార్యకర్తలు రక్తదానం చేశారు. సేవాదళం ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.
 
 ఈ సందర్భంగా లోక్‌సభ సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘వైఎస్ మరణం తర్వాత తెలుగు ప్రజలకు అనేక ఇబ్బందులు వచ్చాయి. తెలుగు ప్రజల అభివృద్ధిని చూసి ఢిల్లీ నాయకులు అసూయపడ్డారు. అందుకే విభజించాలనే కుట్రతో విద్వేషాలు రగిలించారు’’ అని చెప్పారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమం, అభివృద్ధిని ఏకకాలంలో అందించి రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలిపిన ఘనత వైఎస్‌కే దక్కుతుందని కొణతాల రామకృష్ణ అన్నారు. వైఎస్ లేకపోవడంవల్లే రాష్ట్రం ముక్కచెక్కలయ్యే పరిస్థితి దాపురించిందని, రాష్ట్రం ఇన్ని సంక్షోభావాలను చవిచూస్తుందని కలలో కూడా ఊహించలేదని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు మైసూరారెడ్డి వ్యాఖ్యానించారు.
 
 చంద్రబాబును నిలదీయండి: శోభానాగిరెడ్డి
 రాష్ట్ర విభజన పాపం కాంగ్రెస్, టీడీపీలదేనని పార్టీ శాసనసభాపక్ష ఉప నాయకురాలు శోభానాగిరెడ్డి విమర్శించారు. ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు ఊసరవెల్లికంటే ఎక్కువగా రంగులు మారుస్తున్నారని దుయ్యబట్టారు. ‘‘తొమ్మిదేళ్లు సీఎంగా పనిచేసిన వ్యక్తి రాష్ట్రాన్ని విభజించాలని కేంద్రానికి లేఖ ఇవ్వడమే కాక, దానికి కట్టుబడి ఉన్నట్లు ఉద్యోగ జేఏసీ నేతలకు చెప్పారు. రాష్ట్రాన్ని అడ్డంగా విభజించాలంటూ లేఖలు రాసిన చంద్రబాబు సీమాంధ్ర ప్రాంతంలో యధేచ్ఛగా తిరుగుతుంటే ప్రజల్లో సమైక్య భావన లేదని ఢిల్లీ నాయకులు భావిస్తారు. అందువల్ల జేఏసీ సంఘాలన్నీ కూడా చంద్రబాబు విభజన లేఖ వెనక్కి తీసుకోవాలని, పదవులకు రాజీనామా చేయాలని ఆయన్ని నిలదీసి, ఒత్తిడి తీసుకురావాలి. అప్పుడే సీమాంధ్ర ఉద్యమ గొంతుకను ఢిల్లీలో వినిపించగలుగుతాం’’ అని చెప్పారు.

మరిన్ని వార్తలు