అ'డ్రెస్‌' లేదు!

3 Aug, 2018 13:18 IST|Sakshi

నేటికీ పంపిణీ పూర్తికాని యూనిఫాం

జిల్లాలోని 2,61,173 మంది విద్యార్థులు

91,338 మందికే అందిన దుస్తులు

చిలకలూరిపేట: విద్యార్థులకు యూనిఫాం అందించడంలో ప్రతి ఏటా ప్రభుత్వం విఫలమవుతోంది. పాఠశాలలు ప్రారంభమైన రెండు నెలలు గడుస్తున్నా పూర్తి స్థాయిలో విద్యార్థులకు యూనిఫాం అందలేదు. పాఠశాలలు పునఃప్రారంభమైన వెంటనే విద్యార్థులకు రెండు జతల చొప్పున దుస్తులు పంపిణీ చేస్తామంటూ ప్రభుత్వం ఆర్భాటపు ప్రకటనలు చేస్తోంది. తీరా ఆచరణలోకి వచ్చేసరికి చేతులెత్తేస్తోంది. 2016–17 విద్య సంవత్సరంలోనూ మార్చి వరకు విద్యార్థులకు యూనిఫాం ఇస్తూనే ఉన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 50 శాతం మందికి విద్యార్థులకు కూడా యూనిఫాం అందని పరిస్థితి నెలకొంది.

ఎస్‌ఎస్‌ఏ ద్వారా..
సర్వశిక్ష అభియాన్‌ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఏటా రెండు జతల యూనిఫాం అందజేయాల్సి ఉంది.  జిల్లాలో 3565 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. అన్ని పాఠశాలల్లో బాలురు 1,26,439 మంది, బాలికలు 1,34,734 మంది కలిపి మొత్తం 2,61,173 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే ఇప్పటి వరకు జిల్లాలో 91,338 మంది విద్యార్థులకు మాత్రమే దుస్తులను అందజేశారు. ఒకటి నుంచి ఏడవ తరగతి బాలురకు చొక్కా, నిక్కరు, బాలికలకు చొక్కా, స్కర్టు ఇవ్వాలి. ఎనిమిదో తరగతి బాలురకు షర్టు, ప్యాంటు, బాలికలకు పంజాడీ దుస్తులు అందించాలి. ఈ క్రమంలోనే ప్రభుత్వం క్లాత్‌ కొనుగోలు చేసి యూనిఫాం కుట్టించే బాధ్యతను ఆప్కోకు అప్పగించింది.

ప్రైవేటులో మరోలా..
ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలలు వేసవి సెలవల్లోనే యూనిఫాం, పుస్తకాల అమ్మకాలు మొదలుపెడుతున్నాయి.  ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ప్రభుత్వ తీరు, అధికారుల అలసత్వం కారణంగా విద్యార్థులకు యూనిఫాం పంపిణీలో ప్రతిసారి ఆలస్యం జరుగుతోంది. దీంతో చాలా మంది విద్యార్థులు పాత, చిరిగిన దుస్తులతోనే సూల్‌కి వెళ్తున్నారు. ఆగస్టు నాటికి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల అందరికీ పూర్తిస్థాయిలో యూనిఫాం అందజేసేలా ప్రణాళిక రూపొందించినట్లు అధికారులు చెబుతున్నా.. ఆచరణలో అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. కమిషన్ల కోసమే ప్రతియేటా ఇలా యూనిఫాం సరఫరాలో ఆలస్యం చేస్తున్నారంటూ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘ నాయకులు మండిపడుతున్నారు. ఆప్కో అధికారులు మండల కేంద్రాలకు దుస్తులను సకాలంలో అందించడంలో విఫలమవుతున్నారు. అక్కడి నుంచి అవి పాఠశాలలకు చేరే సరికి మరింత జాప్యం జగరుగుతోంది. ఫలితంగా కొంతమేర సిద్ధంగా ఉన్న దుస్తులు కూడా విద్యార్థులకు సకాలంలో అందటం లేదని విమర్శలు వస్తున్నాయి.

త్వరలో పంపిణీ పూర్తి చేస్తాం..
యూనిఫాం సరఫరా బాధ్యతను ప్రభుత్వం ఆప్కోకు అప్పగించింది. యూని ఫాం  విషయమై ఆప్కో అధికారులతో తరచు సంప్రదిస్తున్నాం. ఇప్పటి వరకు జిల్లాలోని 26 మండలాల్లోని పాఠశాలలకు యూనిఫాం అందజేశాం. మరో 31 మండలాలకు అందాల్సి ఉంది. ఈ నెలలో విద్యార్థులందరికీ యూనిఫాం అందేలా చర్యలు తీసుకుంటాం.– అరుణకుమారి, సీఎంవో, సర్వశిక్ష అభియాన్‌

మరిన్ని వార్తలు