రేపు గుంటూరులో సీఎం ఇఫ్తార్‌ విందు

2 Jun, 2019 03:57 IST|Sakshi
ముస్లిం పెద్దలతో చర్చిస్తున్న ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి తదితరులు

పోలీసు పరేడ్‌ గ్రౌండ్స్‌లో భారీ ఏర్పాట్లు

పరిశీలించిన వైఎస్సార్‌ సీపీ నేతలు

గుంటూరు వెస్ట్‌: పవిత్ర రంజాన్‌ మాసాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం గుంటూరులోని పోలీసు పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఇఫ్తార్‌ విందు ఇవ్వనున్నారని శాసన మండలి ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. శనివారం ఆయన పార్టీ నాయకులు, కలెక్టర్, ఎస్పీ ఇతర అధికారులతో పోలీసు పరేడ్‌ గ్రౌండ్స్‌లో  సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉమ్మారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ  జిల్లాలో రాజకీయాలకు అతీతంగా సుమారు 4 వేల మంది  ముస్లిం పెద్దలను విందుకు  ఆహ్వానిస్తున్నామన్నారు. ఆహ్వానం ఉన్న వారు మాత్రమే రావాలని కోరారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డికి ఈ జిల్లాతో ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. ఇఫ్తార్‌ విందు సందర్భంగా ముఖ్యమంత్రి ముస్లిం పెద్దలతో ముచ్చటిస్తారని ఉమ్మారెడ్డి తెలిపారు. 

మారిన వేదిక
రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదలచిన ఇఫ్తార్‌ విందుకు సంబంధించి తొలుత అధికారులు, ఎమ్మెల్యేలు, వైఎస్సార్‌సీపీ నేతలు బీఆర్‌ స్టేడియాన్ని పరిశీలించి ఏర్పాట్లపై సమీక్షించారు. అయితే శనివారం సాయంత్రం అకస్మాత్తుగా వచ్చిన భారీ గాలులతో కూడిన వర్షానికి బీఆర్‌ స్టేడియం చిత్తడిగా మారింది. దీంతో జిల్లా కలెక్టర్‌ కోన శశిధర్, వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలు చర్చించుకుని, వేదికను పోలీసు పరేడ్‌ గ్రౌండ్స్‌కు మార్చారు. ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, షేక్‌ మొహమ్మద్‌ ముస్తఫా  డాక్టర్‌ ఉండవల్లి శ్రీదేవి, కిలారి రోశయ్య, పార్టీ నేతలు లేళ్ళ అప్పిరెడ్డి, చంద్రగిరి ఏసురత్నంతో పాటు  ఎస్పీ విజయారావు  శనివారం సాయంత్రం పోలీసు పరేడ్‌ గ్రౌండ్స్‌లోని ఏర్పాట్లను పరిశీలించారు.

మరిన్ని వార్తలు