నిర్లక్ష్యంపై ఐజీ వేటు

21 Nov, 2014 02:16 IST|Sakshi

నెల్లూరు(క్రైమ్): విధి నిర్వహణలో నిర్లక్ష్యంతో పాటు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పొదలకూరు సీఐ హైమారావుపై గుంటూరు రేంజ్ ఐజీ పీవీ సునీల్‌కుమార్ గురువారం సస్పెండ్ వేటు వేశారు. పొదలకూరు సీఐగా ఎం.హైమారావు ఈ ఏడాది ఫిబ్రవరిలో బాధ్యతలు చేపట్టారు. నాటి నుంచి పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పొదలకూరు సర్కిల్ పరిధిలోని మూగసముద్రం గ్రామంలో ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఓ వర్గానికి చెందిన వృద్ధుడితో పాటు కొందరు గాయాలపాలయ్యారు.

అప్పట్లో 324 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. గాయాలపాలైన వృద్ధుడు నెల తర్వాత గుండెపోటుతో మృతి చెందాడు. దీన్ని సాకుగా తీసుకున్న సీఐ ప్రత్యర్థి వర్గంపై 302 కింద కేసు నమోదు చేసి మృతుడి తరఫు వారి నుంచి భారీగా ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. అలాగే పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు రమేష్ విద్యార్థినులను లైంగికంగా వేధించాడు. ఈ ఘటనపై పోలీసులు ఫోక్సాయాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఉపాధ్యాయుడికి కొమ్ముకాసే విధంగా దర్యాప్తు సాగింది.

నిందితున్ని అరెస్ట్ చేయడంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు లేకపోలేదు. మరో ఫోక్సాయాక్ట్ కేసులో ఇదే విధంగా సీఐ వ్యవహరించారు. అంతేకాకుండా బాధితురాలిని సకాలంలో వైద్యపరీక్షలకు తీసుకెళ్లలేదు. దర్యాప్తులోనే అలసత్వం వహించారని ఆరోపణలు వచ్చాయి. నిందితులను తప్పించేలా వ్యవహరించారని విమర్శలు గుప్పుమన్నాయి. ఈ ఘటనలపై  ఎస్పీ  ఎస్.సెంథిల్‌కుమార్‌కు ఫిర్యాదులు అందాయి. సమగ్ర దర్యాప్తు చేపట్టారు. అనంతరం నివేదికను ఐజీకి పంపారు. గుంటూరు రేంజ్ ఐజీ నివేదికను పరిశీలించి పొదలకూరు సీఐ హైమారావుపై సస్పెండ్ వేటు వేశారు.
 
ఆది నుంచీ అవినీతి ఆరోపణలు
 హైమారావు ఆది నుంచీ అనేక అవినీతి ఆరోపణలు మూటగట్టుకున్నారు. ఆర్టీసీకి చెందిన ఓ వ్యక్తిని బినామీగా నియమించుకుని అవినీతికి పాల్పడ్డాడన్న విమర్శలున్నాయి. అతని ఆధ్వర్యంలో పంచాయితీలు, సివిల్ వివాదాలు నెరిపారన్న ఆరోపణలున్నాయి. ఇటీవల కలువాయికి చెందిన కొందరు ఎర్రచందనం రవాణా విషయంలో సీఐ తమను వేధిస్తున్నారని ఎస్పీ సెంథిల్‌కుమార్‌కు లిఖితపూర్వక ఫిర్యాదు చేసినట్టు సమాచారం. దీంతో సీఐ వ్యవహారశైలిపై ఎస్పీ సమగ్ర విచారణ జరిపి నివేదికను ఐజీకి అందజేసినట్టు తెలుస్తోంది.
 
వరుస ఘటనలతో సిబ్బంది బెంబేలు
అవినీతి, అక్రమాలకు పాల్పడితే వేటు తప్పదన్న సంకేతాలతో పోలీసు అధికారులు బెంబేలు ఎత్తుతున్నారు. క్రమశిక్షణతో నడచుకోకపోతే చర్యలు తప్పవని ఐజీ ఇప్పటికే పలుమార్లు సిబ్బందిని హెచ్చరించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎన్నికల విధుల్లో ఉన్న ఓ అధికారిని అక్రమంగా నిర్బంధించి అనుచితంగా ప్రవర్తించిన ఘటనలో సీఐ చెంచురామారావును ఐజీ సస్పెండ్ చేశారు. అవినీతి, అక్రమాలకు పాల్పడి ధనార్జనే ధ్యేయంగా వ్యవహరించిన వాకాడు ఎస్‌ఐ వాసును ఏకంగా సర్వీసు నుంచి తొలగించారు. బొగ్గు కుంభకోణం కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలతో కృష్ణపట్నం పోర్టు ఎస్‌ఐను సస్పెండ్ చేశారు. తాజాగా సీఐ హైమారావును సస్పెండ్ చేశారు.

>
మరిన్ని వార్తలు