ట్రిపుల్ ఐటీకి నాసిరకం ఫర్నిచర్

16 Aug, 2013 06:12 IST|Sakshi


 భైంసా, న్యూస్‌లైన్ : బాసర ట్రిపుల్ ఐటీ కొందరు అక్రమార్కులకు ఉపాధి కేంద్రంగా మారింది. ప్రభుత్వం మంజూరు చేస్తు న్న రూ.లక్షల నిధులు పక్కదారి పట్టిస్తున్నారు. వసతులు, సౌకర్యాల కోసం మంజూరవుతున్న నిధులను కాంట్రాక్టర్లతో అధికారులు రహస్య ఒప్పందాలు కుదుర్చుకుని చేతివాటం ప్రదర్శిస్తున్నారు. అధికారులు రూ.లక్షలకు పడగలెత్తుతున్నారు.
 
 రూ.20 లక్షలకుపైగా హాంఫట్
 రాష్ట్రంలోని బాసర, నూజివీడు, ఇడుపులపాయలలోని మూడు ట్రిపుల్ ఐటీలకు టేబుళ్లు, మంచాల కోసం ఇటీవలే రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం అధికారులు టెండర్లు పిలిచారు. ఒక్కో కళాశాలకు 1000 మంచాల చొప్పున 3 వేలు, 20 టేబుళ్ల చొప్పున 60 టేబుళ్లకు హైదరాబాద్‌లోని ఓ ఏజెన్సీకి టెండరు అప్పగించారు. బాసర ట్రిపుల్ ఐటీకి 1000 మంచాలు, 20 టేబుళ్లు వచ్చాయి. ఒక్కో మంచానికి రూ.6 వేల చొ ప్పున 1,000 మంచాలకు రూ.60 లక్షలు, 20 టేబుళ్లకు రూ.24 వేల చొప్పున రూ.4,80,00 అవుతాయి. అయి తే మంచాలు, టేబుళ్లను పరిశీలిస్తే నాసిరకంగా ఉన్నా యి. ఇవే బహిరంగ మార్కెట్‌లో ఒక్కో మంచం రూ.4 వేలు, ఒక్కో టేబుల్ రూ.12 వేల చొప్పున దొరుకుతా యి. అంటే అధికారులు దాదాపు రూ.20 లక్షలకుపైగా అవినీతికి పాల్పడ్డట్లు తెలుస్తోంది. నాసిరకం ఫర్నిచర్ కొనుగోలు చేసి అధికారులు చేతివాటం ప్రదర్శించారనే ఆరోపణలు ఉన్నాయి. నాణ్యమైన ఫర్నిచర్‌కు బదులు నాసిరకం ఫర్నిచర్ కొనుగోలు చేయడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నాసిరకం ఫర్నిచర్ మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలే అవకాశం ఉంది.
 
 తక్కువ ధరకే పాత మంచాల విక్రయం
 బాసరలోని ట్రిపుల్ ఐటీ కళాశాలలో రూ.18 వేలు వెచ్చించి ఒక్కో మంచం కొనుగోలు చేశారు. ఈ మంచాలకు మూడు బాక్సులు ఏర్పాటు చేశారు. క్యాంపస్‌లో ఉండే విద్యార్థులకు సంబంధించిన సామగ్రి మంచం కింద ఉంచుకునేలా మూడు చిన్నచిన్న బాక్సులు ఏర్పాటు చేశారు. కళాశాలలో 1000 మంచాలు చిన్నపాటి మరమ్మతు వచ్చాయని పక్కన పారేశారు. చిన్నపాటి మరమ్మత్తు చేస్తే ఈ మంచాలు వినియోగంలోకి వచ్చేవి. అయితే అప్పట్లో రూ.18 వేలకు కొనుగోలు చేసిన ఈ మంచాలను రూ.1000 సదరు ఏజెన్సీకి విక్రయించారు. కళాశాలలో ఇలాంటి మంచాలు బహిరంగంగా విక్రయిస్తే ఎక్కువ డబ్బులు వచ్చేవి. అయినా అధికారులు ఈ విషయాలు ఏవీ లెక్కలోకి తీసుకోవడం లేదు. ఇలా కొనుగోళ్లలోనూ, అమ్మకాల్లోనూ సొమ్ము వృథా అవుతున్నా అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి ఈ విషయంపై విచారణ జరిపితే అసలు విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.
 మాకు సంబంధం లేదు..
 - నారాయణ, ట్రిపుల్ ఐటీ ఓఎస్‌డీ
 ఫర్నిచర్ కొనుగోళ్ల విషయంలో యూనివర్సిటీ అధికారులే టెండర్లు పిలుస్తారు. తమకు సంబంధం లేదు. ఈ విషయం తమ పరిధిలోకి రాదు. బాగాలేని టేబుళ్లను వైస్ చాన్స్‌లర్ వెనక్కి పంపించమన్నారు.

మరిన్ని వార్తలు