కస్తూర్బా బాలికలకు ట్రిపుల్‌ ఐటీ కలేనా?

14 May, 2018 07:50 IST|Sakshi

ఆన్‌లైన్‌లో కనిపించని కస్తూర్బాగాంధీ విద్యాలయాలు

ఉత్తమ ఫలితాలు సాధించినా దరఖాస్తు చేసుకోలేకపోతున్న విద్యార్థినులు

విద్యాశాఖ అధికారులు స్పందించకుంటే నష్టపోతామని ఆవేదన

ప్రకాశం, కందుకూరు అర్బన్‌:గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద విద్యార్థినులు రాష్ట్ర విద్యాశాఖ చేస్తున్న తప్పిదాల వల్ల ఉన్నత చదువుకు దూరమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. నూజివీడు, బాసర, పులివెందుల ట్రిపుల్‌ ఐటీ కళాశాలల్లో ప్రవేశానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నా.. కస్తూర్బా గాంధీ విద్యాలయాలకు చెందిన బాలికలు మాత్రం దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు.   

గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఎంతో మంది విద్యార్థులు ట్రిపుల్‌ ఐటీ కళాశాలల్లో చదివి ఉద్యోగాల్లో స్థిరపడటంతో ఈ కాలేజీల్లో చదువుకోవాలని బాలికలు ఉత్సాహం చూపుతున్నారు. ముఖ్యంగా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో చదివి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ట్రిపుల్‌ ఐటీల్లో చేరి ఉజ్వల భవిష్యత్‌ పొందాలని కలలు కంటున్నారు. కానీ వారి కళ నేరవేరేటట్లు కనిపించడం లేదు. ప్రభుత్వం ఈ ఏడాది ట్రిపుల్‌ ఐటీలో ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించింది. అయితే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి వెళ్లిన విద్యార్థులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. అప్లికేషన్‌ ఆన్‌లైన్‌ చేసే సమయంలో జిల్లా, మండలం, స్కూల్‌ పేర్లతోపాటు 4 తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎక్కడ చదివారో వివరాలు నమోదు చేయాల్సి రావడమే ఇందుకు కారణం.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తున్న సమయంలో కొన్ని ప్రభుత్వ, రెసిడెన్షియల్‌ స్కూళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. దీంతో ఆన్‌లైన్‌లో పొందుపరిచిన స్కూల్స్‌కు చెందిన విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఈ జాబితాలో ప్రభుత్వం రెసిడెన్షియల్‌ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం పేర్లు లేకపోవడంతో ఏం చేయాలో తెలియక విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ స్కూళ్లు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యార్థులు ఎలా దరఖాస్తు చేసుకోవాలో కనీస సమాచారం కూడా ఉన్నతాధికారులు తెలియజేయలేదు.

జిల్లాలో 37 కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయాలు ఉన్నాయి. ఈ ఏడాది కస్తూర్బా విద్యాలయాల్లో 1206 మంది బాలికలు 10వ తరగతి పరీక్షలు రాయగా వారిలో 1154 మంది ఉత్తీర్ణత సాధించారు. 25 కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో నూరు శాతం ఉత్తీర్ణత నమోదైంది. అనేక మంది బాలికలు 10కి10 జీపీఏ, 9.8, 9.6 జీపీఏ సాధించారు. వీరిలో కొంత మంది మధ్యలో బడిమానేసి మళ్లీ చదువు కొనసాగించాలని కొండంత ఆశతో కస్తూర్బా గాంధీ పాఠశాలల్లో చేరి మంచి మార్కులు సాధించారు. ‘లక్షల రూపాయలు ఖర్చుపెట్టి ప్రైవేటు కళాశాలల్లో చదువుకునే స్థోమత మాకు లేదు. ట్రిపుల్‌ ఐటీ కళాశాలల్లో చేరేందుకు అవకాశం కల్పించండి’ అని బాలికలు ప్రాధేయపడుతున్నారు. జూన్‌ 8వ తేదీతో ట్రిపుల్‌ ఐటీ కాలేజీల్లో ప్రవేశానికి దరఖాస్తు గడువు ముగియనుంది. ఉన్నతాధికారులు స్పందించి ఆన్‌లైన్‌లో సమస్యను పరిష్కరించాలని విద్యార్థినులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు